Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్త సీఎం ఎవరనేదానిపై కాంగ్రెస్ సీఎల్పీ భేటీ
చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్‌లో గత కొంత కాలంగా అంతర్యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత, కెప్టెన్ అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. శనివారం తన సతీమణితో కలిసి రాజ్‌భవన్‌కు చేరుకున్న అమరీందర్.. గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్‌కు రాజీనామా పత్రాన్ని అందించారు. పంజాబ్ కాంగ్రెస్ శాసనసభాపక్షం భేటీకి కొన్ని నిమిషాల ముందు రాజీనామా చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎల్పీ భేటీ మరోసారి నిర్వహించాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించడం తనను మనస్తాపానికి గురిచేసిందని అమరీందర్ సింగ్ తెలిపారు. అందుకే పదవి నుంచి తప్పుకోవాలని శనివారం ఉదయమే నిర్ణయించుకున్నానని తెలిపారు. త్వరలోనే తన మద్దతుదారులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు. ఇక కొత్త సీఎంగా ఎవరిని ఎన్నుకొబోతున్నారనేది తనకు తెలియదని చెప్పారు. ఇదిలావుండగా, కొత్త సీఎంను ఎన్నుకునేందుకు కాంగ్రెస్ శాసనసభాపక్షం మరోసారి సమావేశం అవుతోంది. సీఎల్పీ భేటీ నిర్వహించాలని శుక్రవారం అర్ధరాత్రే పార్టీ నిర్ణయించింది. ఆ మేరకు పార్టీ ఎమ్మెల్యేలకు సమాచారం ఇచ్చింది. మెజార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని మార్చాలని ఒత్తిడి చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. ఈ భేటీకి పీసీసీ అధ్యక్షుడు సిద్ధూతో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి హరీశ్ రావత్ కూడా హాజరుకానున్నారు. సీఎం పదవి రేసులో సిద్దూ, సునీల్ జఖర్ పేర్లు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.