Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజా పోరాటాలను పరిరక్షించాలని వ్యాఖ్య
న్యూఢిల్లీ : కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును ప్రముఖ రచయిత నిఖిలేశ్వర్ అందుకున్నారు. శనివారం నాడిక్కడ కామాని ఆడిటోరియంలో సాహిత్య అకాడమీ అవార్డులు-2020 ప్రధానోత్సవం జరిగింది. ముఖ్య అతిధిగా ప్రముఖ హిందీ రచయిత విశ్వనాథ్ ప్రసాద్ తివారీ, సాహిత్య అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్ కంబర్, కార్యదర్శి కె.శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు మాధవ్ కౌశిక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశంలోని 22 భాషల్లో సాహితీ వేత్తలకు అవార్డులు అందజేశారు. తెలుగు భాష నుంచి అగ్నిశ్వాస రచనకు ప్రముఖ రచయిత నిఖిలేశ్వర్ అందుకున్నారు. అలాగే కన్నడ భాష నుంచి మాజీ కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ అవార్డును అందుకున్నారు.
ప్రజా పోరాటల ద్వాసే..తన లక్ష్యం : నిఖిలేశ్వర్
అనంతరం నిఖిలేశ్వర్ మీడియాతో మాట్లాడుతూ అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. జీవితంలో ఆరు దశబ్దాల పాటు నిరంతరం ప్రజల పట్ల నిబద్ధత, సామాజిక విశ్వాసంతో రచనలు చేస్తున్నానని అన్నారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ప్రభుత్వంతో పోరాడి జైలు పాలయ్యానని తెలిపారు. ఏనాటికైనా నా శ్వాస, అగ్ని శ్వాస ప్రజా పోరాటాల ద్యాస అనీ, ఇదే తన లక్ష్యమని తెలిపారు. కవి, రచయిత ప్రపంచ బాధలను చూస్తాడని, ఉత్తమ రచయిత, ప్రజల పట్ల స్పహ కలిగిన వాడై ఉండాలని అన్నారు. కుల, మత తదితర వైరుద్యాలున్న దేశంలో రచయిత ఎంతో బాధ్యతాయుతంగా దిశా నిర్దేశం చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం రచయితలు అగ్నిపరీక్ష ఎదుర్కొంటున్నారని, ప్రజల పట్ల బాధ్యత కలిగిన రచయితలు పాలకుల నుంచి ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారని అన్నారు. కేంద్రంలోని, రాష్ట్రంలోని పాలకులు స్వేచ్ఛను అరికట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పాలకుల తప్పిదాలను, పొరపాట్లను ఎత్తిచూపితే సహించలేకపోతున్నారని అన్నారు. సమాజంలో కీలక పాత్ర పోషిస్తూ బాధ్యతాయుతంగా ఉండాలని అన్నారు.సమాజంలో ఎలాగైతే కుల, మత వైరుద్యాలు ఏర్పాడ్డాయో... అలాగే రచయితల్లో కూడా వర్గీకరణ జరిగిందని పేర్కొన్నారు. తెలంగాణ, ఏపీతో సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో పురస్కారాలకు, పదవులకు ఎగబాకుతున్నవారు చాలా మంది రచయితలు ఉన్నారని అన్నారు. వారు పాలక వర్గాలకు వత్తాసుగా ఉంటున్నారని, పాలక వర్గాల భజన చేస్తున్నారని విమర్శించారు. వాళ్లను ప్రజలు గమనిస్తున్నారనీ, వారివల్ల ప్రయోజనం ఉండదని తేలిపోయిందని అన్నారు. ప్రస్తుతం ప్రజా రచయితులు కీలకమైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పార్టీలు ఓట్లను కొనుగోలు చేసి అధికారంలోకి వచ్చాయని అన్నారు.
రంగనాథ రామచంద్రరావుకు సాహిత్య అకాడమీ అనువాద అవార్డు
సాహిత్య అకాడమీ అనువాద అవార్డు రంగనాథ రామచంద్రరావును వరించింది. శనివారం నాడిక్కడ స్థానిక రవీంద్ర భవన్లో కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్ కంబర్ అధ్యక్షతన ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సాహిత్య అకాడమీ అనువాద అవార్డు-2020ను 24 పుస్తకాలకు ఇస్తూ ఆమోదం తెలిపినట్టు అకాడమీ కార్యదర్శి కె. శ్రీనివాసరావు తెలిపారు. కన్నడ భాషలోని ఓం నమో పుస్తకాన్ని తెలుగులోకి (శాంతినాథ దేశారు) అనువదించినందుకు తెలుగు నుంచి రంగనాథ రామచంద్రరావుకు అవార్డు లభించింది. రూ. 50 వేల నగదు, కాపర్ షీల్డ్‌తో అవార్డును అందజేయనున్నారు. ఈ ఏడాదిలోనే అవార్డు ప్రధానోత్సవం ఉంటుందని శ్రీనివాసరావు తెలిపారు.