Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం సెస్ తగ్గిస్తేనే పెట్రోల్, డిజిల్ ధరలు తగ్గుతాయి
- కిరోసిన్‌పై పన్ను పెంచడాన్ని వ్యతిరేకించాం : కేరళ ఆర్థిక మంత్రి కెఎన్ బాలగోపాల్
న్యూఢిల్లీ : జీఎస్టీ పరిహారం కాలపరిమితిని పొడిగించాలని కేరళ ఆర్థిక మంత్రి కెఎన్ బాలగోపాల్ డిమాండ్ చేశారు. శనివారం నాడిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ఒకవేళ వచ్చే ఏడాదితో జీఎస్టీ పరిహారం ముగిస్తే... కేరళ మరింత ఆదాయ లోటును ఎదుర్కొంటుందని అన్నారు. పరిహార కాలపరిమితిని పొడిగిస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు. కేరళ జీఎస్టీ పరిహారంగా రూ.13,000 కోట్లు అందుకుంటుందనీ, మార్చి 2022తో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.19,000 కోట్లకు పైగా మరొకసారి గ్రాంట్ రావల్సి ఉందన్నారు. ఒకవేళ వచ్చే ఏడాదిలో జీఎస్టీ పరిహారం ముగిసినట్లయితే, రాష్ట్రం మరింత రెవెన్యూ లోటును ఎదుర్కొంటుందని అన్నారు.
కేంద్రం సెస్ తగ్గిస్తేనే...
కేంద్ర ప్రభుత్వం సెస్ తగ్గిస్తేనే ఇంధన ధరలు తగ్గుతాయన్నారు. అయితే ఇంధన ధరలు పెరగడంపై మోడీ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవపట్టిస్తుందని విమర్శించారు. ఇంధన ధరలను తగ్గించడం కోసం కేంద్రం సెస్ తగ్గించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతినిధులందరూ సూచించారని అన్నారు. ఈ-ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావటాన్ని జీఎస్టీ సమావేశంలో అనేక రాష్ట్రాలు వ్యతిరేకించాయన్నారు.
కిరోసిన్‌పై పన్ను పెంచడాన్ని వ్యతిరేకించాం
కిరోసిన్‌పై పన్ను పెంచడాన్ని కేరళ, గోవా, తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకించాయని తెలిపారు. అనేక రాష్ట్రాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయనీ, రాష్ట్ర ప్రయోజనాలు రక్షించబడాలంటే, ప్రస్తుత నిధుల బదిలీ కొనసాగించడం ఉత్తమమని తెలిపారు. ప్రజలపై వ్యాట్, అమ్మకపు పన్ను విధించినప్పుడు పన్ను ఆదాయం మొత్తం 14శాతానికి చేరుకుందనీ, అయితే ఇప్పుడు వసూలు చేసిన పన్నులు ఏమైనప్పటికీ, ఆ సంఖ్యలో సగం కూడా రాష్ట్రం పొందలేకపోతోందని అన్నారు. ఇది కేవలం కేరళకే కాదనీ, యూపీ, ఢిల్లీ ఇతర రాష్ట్రాలన్ని ఈ సమస్యలో చిక్కుకున్నాయని మంత్రి చెప్పారు.