Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజల ముక్కు పిండి వసూలు చేస్తున్న కేంద్రం
- అంతర్జాతీయంగా ఒడిదుడుకులు లేవు
- అయినా ధరలు పెంచుతున్న మోడీ ప్రభుత్వం
- యూపీఏ సర్కారే కారణమంటూ బీజేపీ ఐటీ సెల్ ప్రచారాలు
న్యూఢిల్లీ : దేశంలో పెట్రో ధరలను పెంచుతూ సాధారణ జనా నికి, వాహనదారులు, గృహిణుల జేబులకు చిల్లులు పెడుతోంది మోడీ ప్రభుత్వం. ఈ విధంగా ధరలు, పన్నుల రూపంలో వారి నుంచి ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నది. ఇందుకు కేంద్రం అనేక రకాల కారణాలను వెల్లడిస్తున్నది. తప్పునంతా యూపీఏ ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నది. అయితే, కేంద్రం చెప్తున్న కారణాలేవీ సహేతుకంగా లేవని విశ్లేషకులు ఆరోపించారు. ''పెట్రో లియం ఉత్పత్తుల ధరలను తగ్గించడం 2026 వరకు సాధ్యం కాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవలే చెప్పారు. అయితే, రూ. 2.38 లక్షల కోట్ల బకాయిలను తిరిగి చెల్లించడం కోసం దాదాపు 22 లక్షల కోట్ల రూపాయలు ప్రజల ముక్కు పిండి వసూలు చేయడం న్యాయమేనా?'' అని వారు ప్రశ్నించారు.
సబ్సిడీల నుంచి రూ. 1.15 లక్షల కోట్లు వసూలు
2018లో అప్పటి పెట్రోలియం, సహజవాయువు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందిస్తూ.. ఆహార భద్రతపై సబ్సీడీకి నిధులు కావాలని కేంద్రం కోరుకున్నదనీ, నిరంతర పెట్రో ధరల పెరుగుదల అనివార్యమని అన్నారు. అయితే, ఆహార భద్రతపై కేంద్రం చేసిన ఖర్చును చూస్తే ఈ వాదన తప్పని తేలుతుందని విశ్లేషకులు చెప్పారు. 2015-16లో ఆహార భద్రత వ్యయం రూ. 1,39,419 కోట్లుగా ఉన్నది. అయితే, అది 2019-20లో రూ. 1,08,688 కోట్లకు తగ్గించబడటం గమనార్హం. ఇంకా, పెట్రోలియం ఉత్పత్తులపై సబ్సిడీల నుంచి మంచి మొత్తాన్ని కేంద్రం ఆదా చేసింది. 2013-14లో పెట్రోల్‌పై కేంద్ర సబ్సిడీ రూ. 85,378 కోట్లుగా ఉన్నది. అయితే, అది 2018-19 నాటికి రూ. 24,460 కోట్లకు తగ్గిపోవడం గమనించాల్సిన అంశం. దీంతో కేంద్రం దాదాపు రూ. 60వేల కోట్లను ఆదా చేసింది. అలాగే, కిరోసిన్‌పై తగ్గించిన సబ్సిడీల ద్వారా రూ. 25 వేల కోట్లు, ఎల్పీజీ సబ్సిడీపై రూ. 30 వేల కోట్లను మోడీ ప్రభుత్వం ఆదా చేసింది. ఈ విధంగా గత ఆరేండ్లలో బీజేపీ సర్కారు.. పెట్రో ఉత్పత్తులపై రాయితీలను నిరంతరం తగ్గించడం ద్వారా రూ. 1.15 లక్షల కోట్లను ఆదా చేసింది.
ఎక్సైజ్ పన్ను ద్వారా రూ. 18 లక్షల కోట్లకు పైగానే..!
2014-15, 2020-21 మధ్య సెంట్రల్ ఎక్సైజ్ పన్ను 400 శాతం పెరుగుదలను చూసింది. దీంతో సెంట్రల్ ఎక్సైజ్ పన్ను ద్వారా రూ. 18.11 లక్షల కోట్లు కేంద్రానికి జమ అయిన విషయం విదితమే. సుమారుగా, మరో రూ. 12 లక్షల కోట్లు రాష్ట్రాలకు చేరాయి. మొత్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల పర్సులకు చిల్లులు చేసి రూ. 32.66 లక్షల కోట్లను వసూలు చేశాయి. ఇందులో కేంద్రానికి వెళ్లింది రూ. 20.66 లక్షల కోట్లు. అయితే, బీజేపీ ఐటీ సెల్, ఆర్థిక మంత్రి మాత్రం దీనంతటికీ యూపీఏ ప్రభుత్వం హయాంలోని చమురు బాండ్లే అని ఆరోపించడం గమనార్హమని విశ్లేషకులు చెప్పారు.
'యూపీఏ హయాంలో అందుకే ఆయిల్ బాండ్లు'
అయితే, యూపీఏకు సంకీర్ణ పార్టీల ముందు తలొగ్గని పరిస్థితని తెలిపారు. చమురు మార్కెంటింగ్ కంపెనీలకు అండర్ రికవరీల భారాన్ని తగ్గించాలనీ, అదే విధంగా సామాన్యుడిపై ధర భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆయిల్ బాండ్లను జారీ చేసిందని వివరించారు. దీని ప్రకారం.. వినియోగదారులు పెట్రో ఉత్పత్తులను కృత్రిమంగా తగ్గించిన ధరలకు పొందగలిగారని విశ్లేషకులు తెలిపారు. అయితే, ఆ సమయంలో యూపీఏ ప్రభుత్వం అంతర్జాతీయంగా చమురు ధరలపై నియంత్రణకు మించిన కారణాల వల్ల అలా చేయాల్సి వచ్చిందని చెప్పారు. అయితే, ప్రస్తుత బీజేపీ ప్రభుత్వానికి అలాంటి అంతర్జాతీయ ధరల ఒత్తిడి లేదని విశ్లేషకులు వివరించారు. అయినప్పటికీ భారత్‌లో ధరలు పెరుగుతూనే ఉండటం గమనించాల్సిన అంశమన్నారు. '' యూపీయే ప్రభుత్వం జారీ చేసిన చమురు బాండ్ల ధర రూ. 2.38 లక్షల కోట్లు. అలాగే, సెంట్రల్ ఎక్సైజ్ సుంకాల వేగం 2026 వరకు కొనసాగితే ప్రభుత్వ ఖజానాకు చేరేది దాదాపు రూ. 40-50 లక్షల కోట్ల మధ్య ఉంటుంది. అంటే, ఎలాంటి అధికారిక విధానం లేకుండానే చెల్లించాల్సిన దాని కంటే 200 రెట్లు ఎక్కువ మొత్తాన్ని జమ చేసేలా ఒక పద్దతిని రూపొందించింది. గత ఏడేండ్లుగా మోడీ పాలనలో జరుగుతున్న దోపిడీ ఇది'' అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
బీజేపీ తప్పుడు ప్రచారాలు
కేంద్రం తీరుపై దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. 'ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్' సర్వేలో ఈ విషయమే వెల్లడైంది. దీంతో పలు సందర్భాల్లో నిర్మలా సీతారామన్ అనేక అవాస్తవాలను వెల్లడించాల్సిన ఒత్తిడి ఏర్పడిందని విశ్లేషకులు వివరించారు. ''దీనికి తోడు బీజేపీ ఐటీ సెల్ కల్పిత వార్తలు. నకిలీ వార్తలతో ప్రజలను తప్పుదారి పట్టించే బీజేపీ ఐటీ సెల్ అధిపతి అమిత్ మాలవ్య తన పాత్రను పోషిస్తున్నారు. ముఖ్యంగా, పబ్లిక్ ఫైనాన్స్ గురించి ఆర్థిక మంత్రి కంటే ఎక్కువ అవగాహన ఉన్నదనే రీతిలో ఆయన నేతృత్వంలోని ఐటీ సెల్ నుంచి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు రావడం గమనార్హం'' అని వివరించారు.