Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు
విశాఖ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్‌తో సహా దేశంలోని అన్ని ప్రభుత్య రంగ పరిశ్రమలను ప్రైవేటీకరించడానికి పన్నాగం పన్నిందని, ఈ కుయుక్తులను ఐక్య ఉద్యమాల ద్వారా కార్మిక వర్గం తిప్పికొడుతుందని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు డి.ఆదినారాయణ, ఎన్.రామారావు అన్నారు. ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం స్టీల్‌ప్లాంట్ ఆర్చ్ వద్ద చేపట్టిన నిరాహార దీక్షలు ఆదివారం నాటికి 220వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఆదినారాయణ, రామారావు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కార్మిక హక్కులపైనా దాడికి పూనుకుంటోందని తెలిపారు. స్టీల్ కార్మికుల జీతభత్యాలను ఇప్పటి వరకు యాజమాన్యం, కార్మిక సంఘాలు కలిసి ఎన్జెసిఎస్గా ఏర్పడి చర్చల ద్వారా నిర్ణయాలు జరిగేవని, రానున్న కాలంలో స్టీల్ కార్మికుల జీతభత్యాలు యాజ మాన్యాల నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయని తెలిపారు. ఆర్టిఐ నాయకులు బొడ్డు కల్యాణరావు మాట్లాడుతూ దేశ సంపదను కాపాడుకోడానికి జరుగుతున్న ఈ ఉద్యమానికి సంఘీభావం తెలియ జేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ అనంతపురం జిల్లా కార్యదర్శి కె.నాగభూషణం దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉక్కు కార్మికుల ఉద్యమానికి తమ యూనియన్ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. ఉద్యమన్ని క్షేత్ర స్థాయిలో తీసుకెవెళ్లడానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పోరాట కమిటీ ప్రతినిధులు కె.సత్యనారాయణ రావు, వైటి దాస్, కెఎం.శ్రీనివాస్, జి.బోసుబాబు, ఎంఎంఎస్ఎం, డబ్ల్యుఆర్ఎం-2, ఎస్టిఎం, ఎస్బిఎం విభాగాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.