Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు 11 గంటలకు ప్రమాణస్వీకారం
- రాష్ట్ర ముఖ్యమంత్రిగా తొలి దళిత సిక్కు నేత
- దళితునికి దక్కిన ముఖ్యమంత్రి పీఠం
చండీగఢ్ : పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా దళిత సిక్కు నేత చరణ్‌జిత్ సింగ్ చన్నీని కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. ఈ మేరకు ఆయన పేరును రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి హరీశ్ రావత్ ఆదివారం సాయంత్రం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. పంజాబ్ అసెంబ్లీ కాంగ్రెస్ శాసనపక్ష నేతగా చరణ్‌జిత్ సింగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని తెలిపారు. సీఎల్పీ నేతగా ఎంపికైన అనంతరం గవర్నర్ భన్వర్‌లాల్ పురోహిత్ ఆహ్వానం మేరకు చరణ్‌జిత్ సింగ్ ఏఐసీసీ పరిశీలకులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లారు. తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల జాబితా సమర్పించారు. సోమవారం ఉదయం 11 గంటలకు ప్రమాణం చేయాల్సిందిగా చన్నీని గవర్నర్ ఆహ్వానించినట్టు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. చామ్‌కౌర్ సాహిబ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చరణ్‌జిత్ సింగ్ చన్నీ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2015-2017 మధ్య అసెంబ్లీలో కాంగ్రెస్ తరఫున ప్రతిపక్ష నాయకుడిగా వ్యవవహరించారు. అమరీందర్ క్యాబినెట్లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు.
ఐదారు నెలలే ఈ పదవి..
రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి అమరీంగ్ సింగ్ శనివారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పంజాబ్‌కు తొలి దళిత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న చరణ్‌జిత్ సింగ్ చన్నీ మరో ఐదారు నెలలు మాత్రమే ఆ పదవిలో ఉంటారు. వచ్చే ఏడాది మార్చి 27తో ప్రస్తుత అసెంబ్లీ పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ఫిబ్రవరి లేదా మార్చి నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. జాట్ ఆధిప్యతం ఉండే పంజాబ్ రాజకీయాల్లో కాంగ్రెస్ ఒక దళిత నేతను ముందుకు తీసుకురావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. రాష్ట్రంలో 33 శాతం వరకు దళిత ఓటు బ్యాంకు ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ తాజా అడుగు వేసినట్లు తెలుస్తోంది.
చరణ్‌జిత్‌కు అమరీందర్ శుభాకాంక్షలు
సీఎల్పీ నేతగా ఎన్నికవడం పట్ల చరణ్‌జిత్ సింగ్‌కు అమరీందర్ సింగ్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. పంజాబ్ రాష్ట్ర సరిహద్దులను చరణ్‌జిత్ సురక్షితంగా ఉంచుతాడనీ, అదేవిధంగా సరిహద్దు నుంచి పెరుగుతున్న భద్రతాపరమైన ముప్పు నుంచి ప్రజలను రక్షిస్తాడని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా చరణ్‌జిత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. పంజాబ్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నేరవేర్చడం కొనసాగించాల్సి ఉందని, వారి విశ్వాసానికి అత్యంత ప్రాధాన్యత ఉందని తన ట్వీట్లో పేర్కొన్నారు. సీఎంగా అమరీందర్ రాజీనామా తర్వాత తదుపరి సిఎం ఎవరన్న విషయంలో పలువురి పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. పీసీసీ మాజీ అధ్యక్షుడు సునీల్ జక్కర్, రాజిందర్ సింగ్ భజ్వా, మాజీ సీఎం రాజేందర్ కౌర్ పేర్లు వినిపించాయి. ఒక దశలో సుఖ్జిందర్ పేరును ఖరారు చేసినట్లు కూడా వార్తలొచ్చాయి. కానీ అక్కడికి కొద్ది గంటల్లోనే అనూహ్యంగా చరణ్‌జిత్ పేరును కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది.