Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2020లో 200 మందికి పైగా హత్య
- భారత్ నుంచి నలుగురు : 'గ్లోబల్ విట్నెస్' నివేదిక
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా పర్యావరణం, భూములకు మాత్రమే కాదు.. వాటి పరిరక్షిస్తున్న వ్యక్తులకూ భద్రత కరువైంది. ఇందుకు 'గ్లోబల్ విట్నెస్' నివేదికే నిదర్శనం. ఈ సంస్థ యూకే కేంద్రంగా పని చేస్తుంది. ఈ నివేదిక వెల్లడించిన సమాచారం ప్రకారం.. 2020లో ప్రపపంచవ్యాప్తంగా 227 మంది పర్యావరణ, భూ సంరక్షకులు హత్యకు గురయ్యారు. వీరంతా పర్యావరణ పరిరక్షణకు, భూ హక్కుల కోసం పోరాడినవారే. కాగా, సగానికి పైగా మరణాలు కేవలం మూడు దేశాల నుంచే ఉన్నాయి. వీటిలో కొలంబియా (65), మెక్సికో (30), ఫిలిప్పైన్స్ (29) లు ఉన్నాయి. అత్యధిక మరణాలతో వరుసగా రెండో ఏడాదీ కొలంబియా మొదటి స్థానంలో ఉండటం గమనార్హం. '' 2018 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ హత్యలు క్రమంగా పెరిగాయి. 2019-20లో 200 మందికి పైగా హత్యకు గురయ్యారు. 2013లో నమోదైన గణాంకాల కంటే ఇది రెట్టింపు'' అని నివేదిక వివరించింది.
భారత్ నుంచి..
అయితే, ఇందులో నలుగురు భారత్ నుంచే ఉండటం గమనార్హం. తమిళనాడుకు చెందిన జర్నలిస్టు ఇజ్రావెల్ మోసెస్ (25), శుభం మణి త్రిపాఠి, అలాగే, యూపీలో ఇసుక మాఫియా ఆగడాలను వెలికి తీసెందుకు కృషి చేసిన రజన్ కుమార్ దాస్, పంకజ్ కుమార్లు వీరిలో ఉన్నారు. కాగా, మోడీ పాలనలో పర్యావరణ పరిరక్షకులు, భూ హక్కుల కోసం పోరాడేవారికి భారత్లో రక్షణ లేదని సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వీరిపై 'మాఫియా'ల దాడులు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు.