Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'వరల్డ్ వర్రీస్' సర్వేలో మొదటి స్థానంలో కోవిడ్-19
- ఆ తర్వాత స్థానంలో నిరుద్యోగం, అసమానతలు, పేదరికం
న్యూఢిల్లీ : గత రెండు సంవత్సరాలుగా 'కరోనా వైరస్' ప్రపంచాన్ని వణికిస్తోందన్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ అత్యంత ప్రమాదకరమని, ఇది వెంటనే తొలగిపోవాలంటూ వివిధ దేశాల్లో అత్యధికశాతం ప్రజలు అభిప్రాయపడ్డారని తాజా అధ్యయనం పేర్కొంది. ఏ ఏ సమస్యలు తమ దేశాన్ని పట్టిపీడిస్తున్నాయి? అనేదానిపై సర్వే జరగగా అందులో వ్యక్తమైన అభిప్రాయాల్ని 'వాట్ వర్రీస్ ద వరల్డ్' నివేదికలో పొందుపర్చారు. కరోనా తర్వాత...నిరుద్యోగం, సామాజిక అసమానతలు, పేదరికం..వంటివాటిపై ప్రజలు ఎక్కువగా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యలు తమ దేశాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయని అత్యధికశాతం మంది చెప్పారు.తమ దేశం ఎదుర్కొంటున్న మూడు ముఖ్యమైన సమస్యల్లో...మొదటిది..కరోనా అని 37శాతం ప్రజలు చెప్పారు. రెండో అతిపెద్ద సమస్య నిరుద్యోగమని 31శాతం మంది, మూడో అతిపెద్ద సమస్య పేదరికం, సామాజిక అసమానతలు..అని 31శాతం మంది చెప్పారు. సామాజిక, రాజకీయ అంశాలపై 28దేశాల్లో సర్వే జరగగా ఈ విషయాలు బయటకొచ్చాయి. గత 10ఏండ్లుగా ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తున్న అంశాలపై నమోదైన గణాంకాల ఆధారంగా సర్వేలో వివరాలు పొందుపర్చారు. మొత్తం సర్వే జరిగిన దేశాలన్నింటిలోనూ ప్రజల్ని అత్యధికంగా ఆందోళనకు గురిచేసిన సమస్య 'కరోనా సంక్షోభం'. ఆ తర్వాత స్థానాల్లో నిరుద్యోగం, పేదరికం, సామాజిక అసమానతలు ఉన్నాయి.ఆర్థిక, రాజకీయ అవినీతి, నేరాలు, హింస..అనేవి టాప్-5లో ఉన్నాయి. నిరుద్యోగం, పేదరికం, సామాజిక అసమానతలు..సుదీర్ఘకాలంగా ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న అంశాలుగా ఉన్నాయి. మలేషియాలో అత్యధికశాతం మంది కోవిడ్-19పై ఆందోళన వ్యక్తం చేయగా, స్వీడన్లో అత్యధికశాతం మంది నేరాలు, హింసపై స్పందించారు. వాతావరణ మార్పులు అతిముఖ్యమైన అంశమని 15శాతం మంది చెప్పారు. వరల్డ్ వర్రీస్...జాబితాలో వాతావరణ మార్పులు 8వ స్థానంలో ఉంది. జర్మనీ, ఆస్ట్రేలియా, కెనడా దేశాల్లో అత్యధికశాతం మంది వాతావరణ మార్పులపై స్పందించారు.