Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మత తీవ్రవాదాన్ని హెచ్చరిస్తుంది: సాహిత్య అకాడమీ చర్చ వేదికలో రచయిత నిఖిలేశ్వర్
న్యూఢిల్లీ : సాహిత్య అకాడమీ తెచ్చిపెటిన 'అగ్ని శ్వాస' తరతరాలు వ్యాపిస్తున్నదనీ, చైతన్యం రగిలిస్తుందని రచయిత నిఖిలేశ్వర్ తెలిపారు. మత తీవ్రవాద భయంకర, ప్రమాదకరమైన సవాళ్లను ఎదుర్కొనేలా ప్రపంచాన్ని హెచ్చరిస్తుందని అన్నారు. ఆదివారం నాడిక్కడ సాహిత్య అకాడమీ ఉపాధ్యక్షులు మాధవ్ కౌషిక్ అధ్యక్షతన నిర్వహించిన 'అవార్డు గ్రహీతల అనుభవాలు' చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మత తీవ్రవాదం ప్రపంచం నలుమూలలా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవాలని మరణ మృదంగం వాయిస్తోందని అందరికీ తెలుసునన్నారు. జీవితంలోని అనేక కోణాలను అగ్నిశ్వాస స్పృశించిందని నిఖిలేశ్వర్ తెలిపారు. ప్రజల సమస్యలు, ప్రజాస్వామ్య హక్కులు కాపాడే సాహితీ వేత్తగా అనేక కథలు రాశానన్నారు. సాహిత్యం, రాజకీయ విమర్శలతోపాటు పలు అనువాదాలు కూడా చేసినట్టు ఆయన తెలిపారు. డయాలెక్టికల్ మార్క్సియన్ ఆలోచనే ఈ ప్రపంచాన్ని అర్థంగా చేసుకోవడానికి సమకరించిందని ఆయన తెలిపారు. తెలంగాణలోని మారుమూల కుగ్రామం నుంచి వచ్చిన తనపై గురజాడ అప్పారావు, గుర్రం జాషువా, శ్రీశ్రీల ప్రభావం ఉందన్నారు. తొలుత తాను కె.యాదవ రెడ్డి పేరు మీదే రాత ప్రారంభమైనప్పటికీ 1965 నుంచి నిఖిలేశ్వర్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నానన్నారు. జన సాహితి సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపక సభ్యుడైన తాను ప్రజా సాహితి మాస పత్రికకు ఎడిటర్ రెండేండ్లపాటు పనిచేశానన్నారు. ఆరు దశాబ్దాలుగా భారతీయ భాషల్లోని అనేక మంది రచయితలను కలుసుకున్నాననీ, ఎంతో గొప్పదైన భారతీయ సంస్కృతి నుంచి చాలా నేర్చుకున్నానని నిఖిలేశ్వర్ తెలిపారు. కన్నడంలో సాహిత్య అకాడమీ గ్రహీత వీరప్పమొయిలీ మాట్లాడుతూ.. సత్యాన్వేషణ చేయడానికి, అన్ని రకాల కోరికల నిర్మూలనకు ప్రపంచ ధర్మం ఏంటో తన 'బాహుబలి' వివరిస్తుందని తెలిపారు.