Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడాదైనా హత్రాస్ బాధిత కుటుంబ సభ్యులకు దక్కని న్యాయం
లక్నో : హత్రాస్ అత్యాచార ఘటన జరిగి ఏడాది గడిచినా బాధిత కుటుంబ సభ్యులు న్యాయం కోసం నిరీక్షిస్తూనే ఉన్నారు. పైగా భద్రతా సిబ్బంది, సిసిటివి నిఘా నీడలో బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. సాధారణ జీవితానికీ దూర మయ్యారు. హత్రాస్‌లోని 19 ఏళ్ల దళిత బాలికపై నలుగురు అగ్రకుల యువకులు అత్యాచారానికి పాల్పడ టంతో పాటు తీవ్ర హింసకు గురిచేయడంతో ఆమె పరిస్థితి విషమంగా మారింది. ఢిల్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత ఏడాది సెప్టెంబరు 29న బాలిక మరణించింది. ఆమె మృతదేహాన్ని తీసుకొచ్చిన అధికారులు తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో బలవంతంగా కుటుంబ సభ్యుల చేత అంత్యక్రియలు చేయించారు. అప్పటి నుంచి బాలిక కుటుంబం న్యాయం కోసం పోరాటం చేస్తూనే ఉంది. ప్రభుత్వం వారి ఇంటి ముందు భద్రత కోసం సిఆర్పిఎఫ్ పోస్టును ఏర్పాటు చేసింది. దీనిపై బాలిక తండ్రి మాట్లాడుతూ 'మేం ఇప్పుడు సురక్షితంగానే ఉన్నాం. ఎందుకంటే ఊరిలో మమల్ని పూర్తిగా వెలివేశారు' అని అన్నారు. కేవలం ఒక బ్రాహ్మణ కుటుంబం మాత్రమే తమకు సహాయం చేస్తోందని తెలిపారు. న్యాయం జరగాలని మేం కోరినప్పుడల్లా తమకు అవహేళనలు, అవమానాలు ఎదురవు తాయని చెప్పారు. గ్రామస్తులంతా పేడ, ఇతర వ్యర్థాలను వారి ఇంటి ముందే వేస్తున్నారు. దీనిపై భద్రతా సిబ్బంది ఒకరు మాట్లాడుతూ 'వ్యర్థాలు దుర్వాసన వెదజల్లడమే కాకుండా, వర్షాల సమయంలో ఇన్ఫెక్షన్కి కారణమవుతాయి. మాకు ఇక్కడ విధులు నిర్వహించడం కూడా కష్టమవు తుంది' అని అన్నారు. హత్రాస్ ఘటనపై రెండు కేసులు నమోదయ్యాయి. బాలిక అత్యాచారం, హత్యపై హత్రాస్‌లో ఎస్సి, ఎస్టి కోర్టు విచారణ చేస్తుండగా, మృత దేహాన్ని బలవంతంగా దహనం చేయడాన్ని సుమోటోగా స్వీకరించిన అలహాబాద్ హైకోర్టు విచారణ చేస్తోంది.