Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కర్నాటకలో 184, తెలంగాణలో 62 కేసులు నమోదు : ఎన్సీఆర్బీ
న్యూఢిల్లీ : గతంతో పోల్చితే బాల్యవివాహాలు 50శాతానికిపైగా పెరిగాయని 'జాతీయ నేర గణాంకాల బ్యూరో' (ఎన్సీఆర్బీ) తాజాగా వెల్లడించింది. బాల్య వివాహాల నిరోధక చట్టం కింద దేశవ్యాప్తంగా 2020లో 785 కేసులు నమోదయ్యాయని, గతంతో పోల్చితే కేసుల సంఖ్య, ఫిర్యాదులు పెరిగాయని 'ఎన్సీఆర్బీ' తాజా నివేదిక పేర్కొంది. కర్నాటకలో అత్యధికంగా 184 కేసులు, అసోంలో 138, పశ్చిమ బెంగాల్లో 98, తమిళనాడులో 77, తెలంగాణలో 62 కేసులు నమోదయ్యాయి. అంతక్రితం ఏడాది(2019)లో 523, 2018లో 501 కేసులు దేశవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదయ్యాయి. చట్ట ప్రకారం అబ్బాయికి 21ఏండ్లు, అమ్మాయికి 18ఏండ్ల లోపు వివాహం జరిగితే అది బాల్య వివాహం కిందే లెక్క.ఎన్సీఆర్బీ నివేదికపై స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యుడు రూప్ సేన్ మాట్లాడుతూ..''బాల్య వివాహాలు పెరగటం వెనుక వివిధ కారణాలున్నాయి. ప్రజల్లో అవగాహన పెరగటంతో పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు. బాల్య వివాహాలకు కారణమేంటన్నది క్షేత్రస్థాయిలో పరిశీలించాలని నిపుణులు భావిస్తున్నారు. బాలికల్ని బలవంతంగా పెండ్లి పీటలు ఎక్కించే ఘటనల్లో నిందితులపై పోక్సో చట్టాన్ని ప్రయోగించి కేసులు నమోదుచేయాలి'' అని అన్నారు.పశ్చిమ బెంగాల్ హైకోర్టు న్యాయవాది కౌశిక్ గుప్తా ఏమంటున్నారంటే...''స్థానిక గ్రామపంచాయతీలు, జిల్లా యంత్రాంగం అప్రమత్తతో ఉండాలి. బాల్య వివాహాలపై ఫిర్యాదులు పెరుగుతున్నాయని తెలియగానే ఉన్నతాధికారులు వెంటనే చర్యలు చేపట్టాలి.
దాంతో సమాజంలో మార్పు వచ్చి..బాల్య వివాహాలు తగ్గుముఖం పడతాయి'' అని చెప్పారు. బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయాలని, లేదంటే..బాలికల భవిష్యత్తు తీవ్రంగా ప్రభావిత మవుతుందని, వారి చదువు ఆగిపోతుందని, జీవితంలో అనేక అవకాశాల్ని వారు కోల్పోతారని, శారీరకంగా, మానసికంగా అనేక సమస్యలు తలెత్తుతాయని సామాజికవేత్తలు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు.