Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్రూ అప్ చార్జీలకు ఇఆర్‌సి చైర్మన్ సమర్థన
అమరావతి : విద్యుత్ సంస్థలు ఆర్థికంగా సంక్షోభ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడం రాష్ట్రానికి, వినియోగదారులకు మంచిది కాదని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఎపిఇఆర్సి) చైర్మన్ నాగార్జున రెడ్డి వెల్లడించారు. ఇఆర్‌సి సభ్యులతో ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి ఆయన మాట్లాడారు. వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడం, విద్యుత్ సంస్థలను బలోపేతం చేయడం ఇఆర్‌సికి ఈ రెండూ ప్రధాన లక్ష్యాలని చెప్పారు. డిస్కంల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని 2015-2019 మధ్యకాలానికి గాను ట్రూఅప్ చార్జీలలను రూ.3669 కోట్లు వసూలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చిన్నట్లు వివరించారు. డిస్కాంలు ఆర్థిక సామర్థ్యం, సుస్థిరత అత్యవసరమని, వీటిని దృష్టిలో పెట్టుకునే ట్రూఅప్ చార్జీలు వసూలు చేసుకోవటానికి అనుమతి ఇచ్చిన్నట్లు తెలిపారు. సర్దుబాటు ఛార్జీల్లో మూడో వంతును రాష్ట్రప్రభుత్వమే(రైతులు, ఎస్సి,ఎస్టిలు, ఎంబిసి తదితరుల తరపున) భరించాల్సి వస్తుందన్నారు. రాష్ట్రంలో నాణ్యమైన, నిరంతర విద్యుత్‌ను అందుబాటు ధరల్లోనే సరఫరా చేస్తే వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు వేగంగా వృద్ధి చెందుతాయని, ఫలితంగా రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. నిరంతరం నాణ్యమైన కరెంట్ అందించడంతో పాటు వినియోగదారుని శ్రేయస్సు, అభివృద్ధి తమకు అత్యంత ప్రాధాన్యమైన అంశమని పేర్కొన్నారు. వినియోగదారులకు అందించే సేవలను మెరుగుపర్చేందుకు పౌరసేవల ప్రమాణాలను సవరించిందని పేర్కొన్నారు. ఇంధన పొదుపు, సంరక్షణ కార్యక్రమాలను ప్రోత్సహించడంలో ఇఆర్‌సి క్రియాశీల పాత్ర పోషిస్తోందన్నారు. సోమవారం రాష్ట్ర సలహా కమిటీ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు.