Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నల్ల చట్టాలకు వ్యతిరేకంగా 2020 సెప్టెంబర్ 19న పంజాబ్‌లో ప్రారంభం
- మొగాలో చారిత్రాత్మక రైతు ఉద్యమానికి బీజాలు
న్యూఢిల్లీ: .మోడీ సర్కార్ తీసుకొచ్చిన మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను నిరసిస్తూ రైతులు చేపట్టిన ఉద్యమానికి ఏడాది అయింది. ఏడాది నిరంతరాయంగా రైతు ఉద్యమం చారిత్రాత్మకంగా కొనసాగుతుంది. మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా 2020 సెప్టెంబర్ 19న పంజాబ్‌లో ఉద్యమం ప్రారంభమైంది. ప్రస్తుతం జరుగుతున్నచారిత్రాత్మక రైతు పోరాటానికి నాడు పంజాబ్‌లోని మొగాలో బీజాలు పడ్డాయి. సరిగ్గా ఏడాది క్రితం అక్కడ రైతు ఉద్యమం ప్రారంభమైంది. మోడీ ప్రభుత్వం 2020 జూన్‌లో అప్రజాస్వామికంగా, రాజ్యాంగ విరుద్ధంగా తీసుకువచ్చిన రైతు వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల ఆర్డినెన్స్‌లకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వివిధ రైతు సంఘాలు చేతులు కలుపుతూ సమిష్టి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాయి. 2020 సెప్టెంబర్ 19న పంజాబ్‌లోని 32 రైతు సంఘాలు సమన్వయంతో కూడిన ఒక ఉద్యమం ఒక పెద్ద పాన్ ఇండియా కూటమికి పునాది వేసింది. తదనంతరం అక్టోబర్ 27 నుంచి నవంబర్ 4న పంజాబ్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమించారు. రైలు, రోడ్ల దిగ్బంధం చేశారు. రెండు మూడు సార్లు కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపినా ఫలితం లేదు. అయితే రైతు ఉద్యమం పంజాబ్‌కు మాత్రమే పరిమితం కాకూడదని అఖిల భారత స్థాయిలో సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం)ను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా దాదాపు 500 రైతు సంఘాలు ఎస్కేఎంలో భాగస్వామ్యం అయ్యాయి. రైతు సంఘాలు, నాయకులు ప్రజాస్వామ్య పద్ధతిలో విశాలమైన నాయకత్వంతో పనిచేయడం నేర్చుకున్నారు. ఈ చారిత్రాత్మక పోరాటంలో దేశంలోని రైతుల గుర్తింపు, గౌరవం, బలం పుంజుకుందని ఎస్కేఎం తెలిపింది.
రైతుల డిమాండ్లపై మొండిగా మోడీ సర్కార్
రైతుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చకపోవడంపై కేంద్ర ప్రభుత్వం మొండిగా ఉందని, 2021జనవరి 22 తర్వాత రైతుల ప్రతినిధులతో ఎలాంటి చర్చలు చేయలేదని ఎస్కేఎం విమర్శించింది. పరిష్కారం ఎక్కడ ఉందో ప్రభుత్వానికి తెలుసని, నిరసన తెలిపే రైతులపై ప్రతీకారం తీర్చుకుందని పేర్కొంది. రైతులు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని, ఇప్పటి వరకు 600 మందికి పైగా రైతులు అమరులైనప్పటికీ కేంద్రం స్పందించకపోవడం సిగ్గు చేటని ఆగ్రహం వ్యక్తంచేసింది. ''ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికైన ప్రభుత్వం ఉండగా పౌరులు తమ జీవనోపాధిని, భవిష్యత్తును కాపాడటం కోసం ఇటువంటి పోరాటం చేయడం సిగ్గుచేటు'' అని ఎస్కేఎం పేర్కొంది. రైతులను హర్యానా, ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారని, బారికేడ్లను ఏర్పాటు చేసి రోడ్లను బ్లాక్ చేశారని పేర్కొంది. రోడ్లను దిగ్బంధించింది రైతులు కాదనీ, వాస్తవానికి నిరసన తెలిపే రైతులు ట్రాఫిక్ తరలించడానికి సింఘు, టిక్రి బోర్డర్ వద్ద రోడ్డుకు ఇరువైపులా స్పష్టమైన మార్గాలను విడిచిపెట్టారని తెలిపింది. ఘాజీపూర్ సరిహద్దు వద్ద రోడ్డు ఒక వైపు మాత్రమే రైతులు దిగ్బంధించారని పేర్కొంది. షాజహాన్‌పూర్ బోర్డర్‌తో పాటు ఇతర సరిహద్దు ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి ఉందని ఎస్కేఎం తెలిపింది. సుప్రీం కోర్టు ఆర్డర్ పేరుతో హర్యానా ప్రభుత్వం రైతుల ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించింది.
భారత్ బంద్‌కు సన్నాహాలు
సెప్టెంబర్ 27 భారత్ బంద్ విజయవంతం కావడానికి దేశవ్యాప్తంగా సన్నాహాలు చురుగ్గా జరుగుతున్నాయి. ఆదివారం రాజస్థాన్‌లోని జైపూర్‌లో రైతుల సదస్సు జరిగింది. కర్నాటకలోబహిరంగ సభ జరిగింది. మొహాలీలో పాల అమ్మకం దారులు, కూరగాయల అమ్మకం దారులు భారత్ బంద్‌కు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ రైతులు సమావేశం నిర్వహించారు. మధ్యప్రదేశ్‌లోని బద్వానీ జిల్లాలోభారత్ బంద్‌కు మద్దతుగా నర్మదా బచావో ఆందోళన్ ర్యాలీ చేపట్టారు. గ్వాలియర్, జబల్పూర్లోని భితర్వార్లో సమావేశాలు జరిగాయి. సోమవారం తమిళనాడులో భారత్ బంద్ కోసం సన్నాహాలను సమీక్షించడానికి, అనేక రైతు సంఘాల మధ్య సమన్వయంతో పని చేయడానికి సమావేశం జరగనుంది. మధ్యప్రదేశ్‌లో భారత్ బంద్ విజయవంతం కోసం రాష్ట్ర స్థాయి ప్రణాళికా సమావేశం నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మధురలోని చంద్పూర్ కలాన్‌లో బంద్ ప్లాన్ కోసం కిసాన్ పంచాయితీని నిర్వహించారు. ఉత్తర ప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్నాటక,తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, వివిధ ప్రాంతాల్లో ప్రణాళిక సమావేశాలు జరిగాయి. భారత్ బంద్‌కు వర్తకులు, వ్యాపారులు, ఉద్యోగ సంఘాలు, న్యాయవాద సంఘాలు, రవాణాదారుల సంఘాలు, కార్మికుల సంఘాలతో పాటు ఇతర ప్రజా సంఘాల నుండి సంపూర్ణ మద్దతు లభించింది. ఇప్పటికే అనేక రాజకీయ పార్టీలు కూడా తమ మద్దతును ప్రకటించాయి.
పడిపోయిన టమోటా ధర.. నిరాశలో రైతులు
కర్నాటకలో టమోట ధరలు సాధారణ ధరకు చేరుకుందని రైతులు ఆశించే లోపే రైతులకు నిరాశే మిగిలింది. నెల రోజులుగా టమోట ధరలు సాధారణంగా బాక్సు రూ.300 నుంచి 400 దాక ధర పలికింది. టమోట పంటలు పండించిన రైతులు ఆనందించి లోపే గతవారం రోజులుగా టమోట ధర బాక్సు రూ.100కు పడిపోయింది. ప్రస్తుతం టమోటా బాక్సు ధర రూ.100 - 150 వరకు ధర పలుకుతోంది. సెప్టెంబర్ నెలలో టమోట ధరలు పెరుగుతాయని కృష్ణగిరి జిల్లావ్యాప్తంగా సుమారు 2వేల ఎకరాలలో రైతులు టమోట పంట వేశారు. ప్రస్తుతం పంట చేతికొచ్చేసరికి ధరలు తీవ్రగా పడిపోయాయి. చాలా మంది రైతులు టమోట పండించడానికి ఎకరానికి లక్షకుపైగా ఖర్చు చేశారు. అయితే గిట్టుబాటు ధర రాకపోయేసరికి రైతులు తీవ్ర దిగ్భ్రాంతికి గురైయ్యారు. కొంతమంది రైతులు మాత్రం పండించిన టమోటా పంటను తోట్లల్లోనే వదిలేశారు.