Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 92 నూతన పాఠశాలలు..
- వంద రోజుల ప్రణాళికలో కేరళ సర్కారు ఘనత
- వెయ్యి గ్రామీణ రోడ్లు.. మూడు ఫుట్‌బాల్ అకాడమీలు కూడా..!
తిరువనంతపురం : వంద రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా కేరళ ప్రభుత్వం చక్కటి ఫలితాలను చూపెట్టింది. రాష్ట్రంలో గూడు లేనివారి కోసం కొత్త ఇండ్లు, పాఠశాలలు, రోడ్లు, ఫుట్‌బాల్ కోర్టులతో పాటు పలు ప్రాజెక్టులను విజయన్ సర్కారు నిర్మించింది. దీంతో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యకలాపాలు, మౌలిక సదుపాయాల పట్ల రాష్ట్ర ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. విమర్శకులు సైతం కేరళ ప్రభుత్వం తీసుకున్న చర్యలను అభినందించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత పినరయి విజయన్ జూన్ 11న వంద రోజుల యాక్షన్ ప్లాన్‌ను ప్రకటించారు. కరోనాతో దెబ్బతిన్న ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కోవడంలో భాగంగా ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ యాక్షన్ ప్లాన్‌లో రూ. 2464.92 కోట్ల విలువైన ప్రాజెక్టులున్నాయి. ఇందులో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (పీడబ్ల్యూడీ), రీబిల్డ్ కేరళ ఇనిషియేటివ్ (ఆర్‌కేఐ), కేరళ ఇన్ఫాస్ట్రక్షర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ బోర్డ్ (కేఐఐఎఫ్బీ) లు భాగమయ్యాయి.ఇప్పటి వందరోజుల ప్రణాళిక ఆదివారం (సెప్టెంబర్ 19)తో పూర్తయ్యింది. 178 ప్రాజెక్టుల్లో 132 ప్రాజెక్టులు పూర్తయ్యినట్టు ఈ కార్యక్రమ అధికారిక గణాంకాలు వివరించాయి. మిగిలిన 46 ప్రాజెక్టులు త్వరలోనే పూర్తి కానున్నాయి. అయితే, పూర్తయిన ఈ కొత్త ప్రాజెక్టుల్లో 12,067 ఇండ్లు, 92 కొత్త పాఠశాలలు, 1000 గ్రామీణ రోడ్లు, మూడు ఫుట్‌బాల్ అకాడెమీలు ఉన్నాయి. వీటితో పాటు కేర్సెంటర్లు, టారులెట్ కాంప్లెక్స్‌లు ఇలా మరికొన్ని ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాలు కూడా ఉన్నాయి.
కొత్త ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యినట్టు ఆన్లైన్ కార్యక్రమంలో భాగంగా విజయన్ తెలిపారు. కాగా, ఈ 12వేలకు పైగా ఇండ్లల్లో 3,358 షెడ్యూల్డ్ కులాలవారికి, 606 షెడ్యూల్డ్ తెగలకు, 271 ఇండ్లు ఫిషింగ్ కమ్యూనిటీకి కేటాయించారు. అలాగే, 36 అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లలో 2,207 ఫ్లాట్ల నిర్మాణం జరుగుతోందని సీఎం చెప్పారు. మరో 17 అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని వివరించారు.
ఇక ఇండ్లతో పాటు రాష్ట్రంలోని 13,534 కుటుంబాలకు ఈనెల 14న భూమి పట్టాలు అందాయి. రాష్ట్రంలోని 14 జిల్లాలో 'పట్టాయ మేళ' కార్యక్రమంలో భాగంగా వీటిని లబ్దిదారులకు అందించారు. గత వామపక్ష ప్రభుత్వం రాష్ట్రంలో 1.75 లక్షల పట్టాలను అందించిన విషయం విదితమే. 92 కొత్త పాఠశాలలను, 48 హయ్యర్ సెకండరీ ల్యాబ్‌లు, మూడు లైబ్రరీలను అదే రోజు సీఎం ప్రారంభించారు. చీఫ్ మినిస్టర్స్ లోకల్ రోడ్ రీబిల్డ్ ప్రాజెక్ట్ (సీఎంఎల్ఆర్ఆర్పీ)లో భాగంగా రాష్ట్రంలో పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టు కింద ఇప్పటి వరకు దాదాపు 2500 రోడ్లు పూర్తి కాగా, తొలి వెయ్యి రోడ్లను ఫిబ్రవరిలో ప్రారంభించారు.ఇక హెల్త్ అండ్ ఫ్యామిలీ డిపార్ట్మెంట్ పలు ప్రాజెక్టులను పూర్తి చేసింది. ఇందులో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, హెచ్ఐవీ రోగుల కోసం ఏడు జిల్లాల్లో కేర్ సపోర్ట్ సెంటర్లు, నాలుగు మెడికల్ కాలేజీలకు యాంటీరిట్రోవైరల్ థెరపీ సెంటర్లు, తిరువనంతపురంలోని మెడికల్ కాలేజీకి 110 బెడ్లతో ఉన్న ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లు ఉన్నాయి. వీటిని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ప్రారంభించారు.
ఈనెల 7న వర్చువల్ కార్యక్రమంలో భాగంగా రోడ్ల వెంట నిర్మించిన వంద టారులెట్లు, రెస్ట్‌రూమ్‌లను ప్రారంభించారు. మరో 524 టారులెట్ కాంప్లెక్స్‌లు నిర్మాణంలో ఉన్నాయి. కాగా, వంద రోజుల ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంలోని పలు విభాగాలు, పబ్లిక్ సెక్టార్ ఇన్స్టిట్యూషన్లలో 64,835 ఉద్యోగాలు సృష్టించబడినట్టు స్టేట్ డాష్‌బోర్డ్ వెల్లడించింది.