Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండేండ్లలో 16 రాష్ట్రాల్లో ఎన్నికలు
- యూపీ, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఫలితాలు కీలకం
- 2024 లోక్‌సభ ఫలితాల్ని నిర్దేశిస్తాయి : రాజకీయ విశ్లేషకులు
న్యూఢిల్లీ : త్వరలో దేశవ్యాప్తంగా రాజకీయాలు మరింత రసవత్తరంగా మారే అవకాశం కనపడుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి తర్వాత వరుసగా 16 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. సరిగ్గా 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు చోటుచేసుకునే ఈ ఎన్నికలు దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చబోతోందని, ఊహించని ఫలితాలు రావొచ్చునని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. బీజేపీ, దాని మిత్ర పక్షాల పాలనలో ఉన్న 12 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. ఇందులో గెలుపు ఓటములు 2024 సార్వత్రిక ఎన్నికల్ని గణనీయంగా ప్రభావితం చేయనున్నది. ముఖ్యంగా ఉత్తరాదిన బీజేపీ మనుగడ అంతా ఉత్తరప్రదేశ్, గుజరాత్ ఎన్నికల ఫలితాలతో ముడిపడి ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
అందరి దృష్టి యూపీపైన్నే..
ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ రాజకీయమంతా మతంతో ముడిపడి ఉందన్న సంగతి తెలిసిందే. హిందూత్వ ఎజెండాతో మరోమారు ఎన్నికల్ని గెలిచేందుకు బీజేపీ చేయని ప్రయత్నం లేదు. యూపీ ఎన్నికల ఫలితాల్ని పరిశీలిస్తే..గత 25ఏండ్లలో ఏ అధికారపార్టీకి ఓటర్లు రెండోసారి అవకాశం ఇవ్వలేదు. అంతేగాక యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ప్రజావ్యతిరేకత నెలకొంది. ప్రజా వ్యతిరేకతను తగ్గించడానికి యోగిని తప్పించాలని బీజేపీ అధిష్టానంపై ఒత్తిడి ఉంది. అయితే అసెంబ్లీ ఎన్నికలకు (వచ్చే ఏడాది ఫిబ్రవరిలో) కొద్ది నెలల ముందు సీఎం మార్పు దెబ్బకొడుతుందని బీజేపీ అధిష్టానం భయపడుతోందని సమాచారం. మోడీ సర్కార్ తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలపై రైతులు ఆగ్రహంతో ఉన్నారని, ఎన్నికల్లో కచ్చితంగా ఇది కీలకంగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఉత్తరాఖండ్‌లో ఎదురీత
రకరకాల వాగ్దానాలతో ఇన్నేండ్లు నెట్టుకొచ్చిన బీజేపీ నాయకుల మాటల్ని ఉత్తరాఖండ్‌లో ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో బీజేపీ ముగ్గురు సీఎంలను మార్చింది. హరీశ్ రావత్ నేతృత్వంలో కాంగ్రెస్ పుంజుకుందని వార్తలు వెలువడుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తనదైన ఏర్పాట్లతో ఉత్తరాఖండ్‌లో ప్రవేశించేందుకు పలు ప్రయత్నాలు చేస్తోంది. మాజీ సైనికులు, సిక్కు ఓట్లు గెలుపును నిర్ణయిస్తాయని ఇక్కడ సీఎం అభ్యర్థిగా కల్నల్ అజరు కోత్యాల్ను ఆప్ నిలబెడుతోంది.
పంజాబ్‌లో తడబడుతున్న కాంగ్రెస్
సీఎం పదవికి అమరీందర్ సింగ్ రాజీనామా చేయటంతో పంజాబ్ రాజకీయాలు వేడెక్కాయి. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకతపై ఆ పార్టీ అధిష్టానం ఆందోళనగానే ఉంది. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బలం చూపడానికి ఆప్, శిరోమణి అకాలీదళ్ పార్టీలు ఎదురుచూస్తున్నాయి. ఢిల్లీ శివార్లలో జరుగుతున్న రైతు ఉద్యమంలో పంజాబ్ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఇలాంటి తరుణంలో అసెంబ్లీ ఎన్నికలు రావటంతో బీజేపీ నేతలు కలవరపడుతున్నారు. గోవాలో సీఎం ప్రమోద్ సావంత్‌ను మార్చాలనీ ఎమ్మెల్యేలు ఢిల్లీలో బీజేపీ నేతలకు మొరపెట్టుకుంటున్నారని సమాచారం. కాంగ్రెస్, ఆప్ గణనీయంగా పుంజుకుందని మీడియాలో వార్తాకథనాలు వెలువడుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఆప్ చీల్చుతుందని బీజేపీ నాయకులు ఆశలు పెట్టుకున్నారు.
మరికొన్ని..
- మణిపూర్‌లో అధికారంలో ఉన్న బీజేపీకి అనేక సవాళ్లు ఉన్నాయి. ఎన్.బీరేన్‌సింగ్ పాలనపై అక్కడి ప్రజలు సుముఖంగా లేరు. నాగా పీపుల్స్ ఫ్రంట్, ఇతర చిన్న చిన్న పార్టీల ప్రభావం ఏమేరకు ఉంటుందన్నది ఎన్నికల ఫలితాల్ని నిర్ణయిస్తుంది.
- హిమాచల్ ప్రదేశ్‌లోనూ సీఎంను మార్చాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది. సీఎం జైరామ్ ఠాకూర్‌ను మార్చుతున్నారని వార్తలు వెలువడ్డాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు సరైన నాయకుడు లేకపోవటం బీజేపీకి కలిసివస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.
- యూపీ తర్వాత బీజేపీకి అత్యంత కీలకమైన రాష్ట్రం గుజరాత్. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ భవిష్యత్తును గుజరాత్ నిర్ణయిస్తుందని, అందుకే ఇక్కడ మొత్తం రాష్ట్ర మంత్రివర్గానే మార్చారని తెలుస్తోంది. హిందూత్వ రాజకీయాలు, మతపరమైన ఎజెండా, కాంగ్రెస్ నాయకత్వం వైఫల్యాన్ని బీజేపీ నమ్ముకుంది.
కుట్రలు..కుతంత్రాలు
మేఘాలయలో కేవలం రెండు అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న బీజేపీ..అనేక కుట్రలు, కుతంత్రాలకు తెరలేపి 2018లో అధికారాన్ని కైవసం చేసుకుంది. 60 స్థానాలున్న అసెంబ్లీలో 21 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్‌ను దెబ్బకొట్టింది. చిన్న చిన్న పార్టీల పాత్ర బీజేపీ, కాంగ్రెస్‌ల గెలుపును నిర్ణయిస్తాయని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. త్రిపురలో బీజేపీ హింసా రాజకీయాలు పెచ్చుమీరిపోయాయి. ప్రజలు సీపీఐ(ఎం) నేతృత్వంలోని వామపక్ష పాలనను కోరుకుంటున్నారు. ప్రజావ్యతిరేకతను తగ్గించడానికి సీఎం విప్లవ్కుమార్ను మార్చాలని బీజేపీ భావిస్తోంది.
ఇవే కీలకం..
కేంద్రంలో మోడీ సర్కార్‌కు మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్నాటక, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కీలకంగా మారుతాయని తెలుస్తోంది. కుట్రలు, కుతంత్రాల్ని నమ్ముకున్న బీజేపీ కర్నాటకలో అధికారాన్ని కైవసం చేసుకున్నాక..అదే ఫార్ములాను మధ్యప్రదేశ్‌లో ప్రయోగించింది. కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలతో బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకునే పరిస్థితి లేదు. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో కాంగ్రెస్ బలంగా ఉంది. ప్రజలు బీజేపీ వైపు వెళ్లే అవకాశాలు లేవని వార్తలు వెలువడుతున్నాయి.