Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరో ఇద్దరు ఉపముఖ్యమంత్రులుగా..
చండీగఢ్: పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా దళిత సిక్కు నేత చరణ్‌జిత్ సింగ్ చన్నీ ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం ఉదయం చండీగఢ్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆ రాష్ట్ర గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్.. చరణ్‌జిత్‌తో ప్రమాణం చేయించారు. ఆయన తర్వాత కాంగ్రెస్ నేతలు సుఖ్జిందర్ రణ్‌ధావా, ఒపి.సోని ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు పంజాబ్ వ్యవహారాల ఇన్చార్జి హరీశ్ రావత్, రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు నవజోత్ సింగ్ సిద్ధూ హాజరయ్యారు. సీఎల్పీ నేతగా ఎన్నికైనందుకు చరణ్‌జిత్‌కు శుభాకాంక్షలు చెప్పిన మాజీ సీఎం అమరీందర్ సింగ్ ఈ కార్యక్రమానికి రాకపోవడం గమనార్హం. చరణ్‌జిత్ సింగ్‌కు ప్రధాని మోడీ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలియజేశారు. పంజాబ్ రాష్ట్ర ప్రజల పురోగతి కోసం కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు. గతవారం అమరీందర్ సింగ్ రాజీనామా నేపథ్యంలో అనేక నాటకీయ పరిణామాల మధ్య కాంగ్రెస్ అధిష్టానం కొత్త సీఎంగా చరణ్‌జిత్‌ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని సీఎం రేసులో ప్రముఖంగా పేరు వినిపించిన సుఖ్జిందర్తో సహా కాంగ్రెస్ పార్టీ ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చింది. మరోవైపు రాష్ట్ర కాంగ్రెస్‌లో సంక్షోభం సమసినట్టు కనిపించడం లేదు. సిద్ధూ నాయకత్వంలో రానున్న అసెంబ్లీ ఎన్నికలకు వెళతామని రాష్ట్ర పార్టీ ఇన్చార్జి హరీశ్‌రావత్ చేసిన ప్రకటనపై మాజీ పీసీసీ అధ్యక్షులు సునీల్ జక్కర్ పలు ప్రశ్నలు లేవనెత్తారు. రావత్ ప్రకటన గందరగోళంగా ఉన్నదనీ, ఇది సీఎం అధికారాన్ని బలహీనపరుస్తుందని ట్వీట్ చేశారు.