Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి
- ఇంటింటికీ కరోనా టీకాలు అంశంపై నిర్ణయం చెప్పండి: కేంద్రాని సుప్రీంకోర్టు ఆదేశాలు
న్యూఢిల్లీ: గతేడాది వెలుగుచూసిన కరోనా మహమ్మారి ప్రభావం దేశంలో ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ప్రజల ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఉన్న మార్గం టీకాలు. ఈ నేపథ్యంలోనే ఇటీవల వ్యాక్సినేషన్ ప్రక్రియ, టీకాల షెడ్యూల్లో ప్రధాన్యతలకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. జస్టిస్ డీవై. చంద్రచూడ్, జస్టిస్ బీవీ. నాగరత్నలతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ పిటిషన్‌ను విచారించింది. ఈ క్రమంలోనే వికలాంగులకు టీకాలు వేయడం కోసం ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, ఈ అంశంపై ప్రభుత్వ ప్రతిపాదనలు గురించి తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. దీని కోసం రెండు వారాల గడువు ఇచ్చింది. వికలాంగులకు టీకాలు, షెడ్యూల్ ప్రాధాన్యత కోసం ప్రత్యేకత కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ అందుబాటులోకి తీసుకురావాలని ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. పిటిషనర్ తరఫున హాజరైన న్యాయవాది పంకజ్ సిన్హా.. వ్యాక్సినేషన్ గరిష్ట కవరేజీ ఉండేలా ఇంటింటికీ కరోనా టీకాలు వేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇలాంటి ప్రక్రియను జార్ఖండ్, కేరళలు విజయవంతంగా నిర్వహిస్తున్నాయనీ, కాబట్టి వికలాంగుల కోసం ఇంటింటికి వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టాలని కోర్టుకు తెలిపారు. అన్ని కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీంతో ధర్మాసనం కోవిన్ పోర్టల్లోనూ వికలాంగుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ ఉండేలా చర్యలు తీసుకోవాలంది. ప్రస్తుతం ఈ అంశంపై స్పందనన తెలియజేయడానికి కేంద్రానికి ఆదేశాలు జారీ చేస్తామనీ, భవిష్యత్తులో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేయాల్సిన అవసరం ఉంటే తప్పకుండా అలానే ముందుకు సాగుతామన ధర్మాసనం పేర్కొంది.