Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐటీ దాడులపై సోనూసూద్ స్పందన
ముంబయి: తనపై జరిగిన ఐటీ దాడులమీద బాలీవుడ్ నటుడు సోనూసూద్ తొలిసారిగా స్పందించారు. తన ఫౌండేషన్‌లోని ప్రతి రూపాయి నిరుపేదలను చేరుకునేందుకు, వారి విలువైన ప్రాణాలను కాపాడడంలో తన వంతు కోసం ఎదురుచూస్తోందని పేర్కొన్నారు. విషయమేదైనా సరే సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదని.. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందని స్పష్టం చేశారు. ఈ మేరకు సోనూసూద్ తన ట్విట్టర్ ఖాతాలో ఒక ప్రకటన పోస్టు చేశారు. సోనూసూద్‌తో పాటు ఆయన సహచరులు రూ.20 కోట్ల మేర పన్ను ఎగవేశారని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఆరోపించిన విషయం తెలిసిందే. గత వారం ముంబయిలోని సోనూసూద్ నివాసంతో లక్నోలో ఆయనకు చెందిన పలు కార్యాలయాలపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించింది. 'ప్రతి భారతీయుని ప్రార్థనల ప్రభావం ఎలా ఉంటుందంటే... అధ్వాన్నంగా ఉన్న రోడ్లలో కూడా ప్రయాణం అత్యంత సులభమవుతుంది' అని సోనూసూద్ తన పోస్టులో పేర్కొన్నారు. మంచి మనస్సుతో భారత ప్రజలందరికీ తన వంతు సాయం చేయాలని ప్రతిజ్ఞ చేసుకున్నానని, తాను ప్రచారకర్తగా వ్యవహరించినందుకుగాను వచ్చే పారితోషికాన్ని మానవసేవ కోసం వినియోగించాలని ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో ఆయా బ్రాండ్ సంస్థలకు సూచించానని తెలిపారు. 'గత నాలుగు రోజుల నుంచి ' కొంత మంది అతిధులతో' బిజీగా ఉండటం వలన ప్రజా సేవకు అందుబాటులో ఉండలేకపోయాను. మళ్లీ సేవలందించేందుకు ఇప్పుడు మీ ముందుకు వచ్చేశాను. నా ఈ ప్రయాణం కొనసాగుతుంది. జై హింద్ '' అని సోనూసూద్ ట్వీట్ చేశారు. సోనూసూద్ పలు బోగస్ సంస్థల నుంచి రుణాల రూపంలో లెక్కచూపని ఆదాయం పొందారని సీబీడీటీ పేర్కొంది. అదేవిధంగా విదేశాల నుంచి విరాళాలు పొందే విషయంలో ఆయన ఎఫ్‌సిఆర్ చట్టాన్ని ఉల్లంఘించారని ఆరోపించింది.