Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ సర్కార్ దిగిరావాల్సిందే : రైతునేతలు
- యూపీలోని సీతాపూర్‌లో భారీ కిసాన్ మహా పంచాయత్
- హర్యానాలోని బడోవల్ టోల్ ప్లాజా వద్ద భారీ బహిరంగ సభ
న్యూఢిల్లీ: నల్లచట్టాలను రద్దుచేసేదాకా పోరు ఆగదనీ, మోడీ సర్కార్ దిగిరావాల్సిందేనని రైతునేతలు శపథం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో ముజఫర్ నగర్ కిసాన్, మజ్దూర్ మహా పంచాయత్ విజయవంతమయ్యాక.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కిసాన్ మహా పంచాయత్‌లు జరుగుతున్నాయి. సోమవారం యూపీలోని సీతాపూర్‌లో చారిత్రాత్మక కిసాన్ మహా పంచాయత్ జరిగింది. ఈ మహా పంచాయత్‌లో అవధ్ ప్రాంతం నుంచి వేలాది మంది రైతులు, వ్యవసాయ కార్మికులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల్లో కిసాన్ మహా పంచాయతీలు నిర్వహించి తీరుతామని ఎస్కేఎం నేతలు స్పష్టం చేశారు. హర్యానాలోని ధైర్యవంతుడైన, నిబద్ధత కలిగిన రైతు నాయకుడు ఘాసి రామ్ నైన్ నాల్గవ వర్ధంతి సందర్భంగా సోమవారం హర్యానాలోని జింద్‌లో బడోవల్ టోల్ ప్లాజాలో భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో రైతు నేత ఘాసి రామ్ నైన్ స్ఫూర్తిని కొనసాగించాలని ఎస్కేఎం నేతలు పిలుపు ఇచ్చారు. వేలాది మంది రైతులు ఈ సభలో పాల్గొన్నారు.
సెప్టెంబర్ 27న భారత్ బంద్‌కు మద్దతుగా మజ్దూర్ సంఘర్ష్ సమితి ఆధ్వర్యంలో సోనేపట్ పట్టణం, గ్రామీణ ప్రాంతాల్లో భారీ బైక్ ర్యాలీ జరిగింది. మంగళవారం తమిళనాడులోని ఈరోడ్‌లో భారత్ బంద్ విజయవంతం కావడానికి భారీ సమావేశం జరగనున్నది. అలహాబాద్‌లోని ఘూర్పూర్ సబ్జీ మండిలో కిసాన్ మహా పంచాయతీ జరగనున్నది. మహారాష్ట్రలో జరుగుతున్న షెట్కారి సంవాద్ యాత్ర సోమవారం కొల్హాపూర్ జిల్లాలోని గాధింగ్లాజ్కు చేరుకున్నది. కొల్లాపూర్, సతారా, సాంగ్లీ జిల్లాల నాయకులు పాల్గొన్నారు. ఈ యాత్ర ఇప్పటివరకు కనీసం రెండు లక్షల మంది రైతులను కలిసింది. 12 జిల్లాల్లో 2,000 కిలోమీటర్లు మేర సాగింది. మహారాష్ట్రలో ఈ యాత్రకు ఉత్సాహభరితమైన మద్దతు లభించింది. బీహార్‌లోని భోజ్‌పూర్ ఎమ్మెల్యే సుదమ ప్రసాద్ యాత్రలో చేరారు.
డిమాండ్లు నెరవేరేదాకా ఉద్యమం
డిమాండ్లు నెరవేరే వరకు రైతు ఉద్యమం శాంతియుతంగా.. బలంగా కొనసాగుతున్నదని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) స్పష్టం చేసింది. రాజకీయ పార్టీల మధ్య నెలకొన్ని వివాదాలు, పార్టీల్లో చోటు చేసుకున్న సంక్షోభాలు రైతు ఉద్యమాన్ని ప్రభావితం చేయాలని పేర్కొంది. సెప్టెంబర్ 27న భారత్ బంద్ విజయవంతం చేయడానికి వివిధ రాష్ట్రాలలో వివిధ రాజకీయ పార్టీలు తమ సొంత ప్రణాళిక సమావేశాలను నిర్వహిస్తున్నాయనీ, బంద్ పిలుపునకు సమాజంలోని వివిధ వర్గాలు తమ మద్దతు, సంఘీభావం తెలియజేయడానికి ముందుకు వస్తున్నాయని ఎస్కేఎం తెలిపింది. మూడు నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీకి వెళుతున్న శిరోమణి అకాలీదళ్‌కు చెందిన కొంతమంది మద్దతుదారులు సెప్టెంబర్ 16 రాత్రి సింఘు సరిహద్దు వద్ద చేసిన ప్రవర్తనపై ఎస్కేఎం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. అలాంటి దుష్ప్రవర్తన పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేసింది.