Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మధ్యప్రదేశ్,యూపీ టాప్
- భ్రూణహత్యల్లో గుజరాత్ అగ్రస్థానం : ఎన్సీఆర్బీ నివేదిక
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చిన్నారులపై ఘోరాలు ఎక్కువగా జరుగుతున్నట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) ప్రకటించింది. మోడీ పాలనలో ఎవరికీ రక్షణలేదన్న కఠోరవాస్తవాలు తెరపైకి వచ్చాయి. పిల్లలపై జరిగిన నేరాలు..ఘోరాల్లో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ఉత్తరప్రదేశ్ రెండోస్థానంలో ఉన్నది. ప్రధాని మోడీ స్వీయ రాష్ట్రమైన గుజరాత్ భ్రూణ హత్యల విషయంలో మొదటి స్థానంలో ఉన్నదని నివేదిక వెల్లడించింది.
న్యూఢిల్లీ : దేశానికే గుజరాత్ మోడల్ గా అని మోడీ చెప్పుకుంటుంటారు. కానీ ఇపుడు ఆ గుజరాత్ భ్రూణహత్యల్లో అగ్రస్థానంలో ఉన్నదని..ప్రయివేట్ సంస్థలు చేసిన అధ్యయనం కాదిది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) ప్రకటించిందంటే.. అక్కడ పరిస్థితులు ఎంతదారుణంగా ఉన్నాయో..స్పష్టమవుతున్నది. ఇక బీజేపీ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్,ఉత్తరప్రదేశ్ చిన్నారులపై అంతులేని అనర్థాలు జరుగుతున్నాయని నివేదిక నిర్ధారించింది.2020లో పిల్లలకు సంబంధించిన నేరాలు మధ్యప్రదేశ్‌లో(17,008 కేసులు) ఎక్కువగా నమోదయ్యాయి. కాగా 2011 జనాభాలెక్కల ప్రకారం పిల్లల సంఖ్య సుమారు 2 కోట్ల 87 లక్షలు.ఇక ఉత్తరప్రదేశ్‌లో 15,271 కేసులు నమోదయ్యాయి. ఇక్కడ 2011 సంవత్సరం నాటికి పిల్లల సంఖ్య దాదాపు 8.53 మిలియన్లు.(85లక్షలకుపైనే..) 2020లో 14371 కేసులు నమోదుకావటంతో.. చిన్నారులపై నేరాల విషయంలో మహారాష్ట్ర మూడవ స్థానంలో ఉన్నది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇక్కడ పిల్లల సంఖ్య సుమారు 3 కోట్ల 61 లక్షలు. మరోవైపు అదే ఏడాదిలో 10248 నేర కేసులు నమోదై... పశ్చిమ బెంగాల్ నాల్గవ స్థానంలో ఉన్నది. 2011 సంవత్సరం ప్రకారం, ఇక్కడ పిల్లల సంఖ్య మూడు కోట్లుగా ఉన్నది. కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీ ఏమాత్రం సురక్షితం కాదని ఎన్సీఆర్బీ నివేదికలు ధ్రువీకరిస్తున్నాయి. 2020 లో అత్యధికంగా 5362 కేసులు నమోదయ్యాయి, ఇక్కడ 2011 సంవత్సరం నాటికి పిల్లల సంఖ్య 55 కోట్లు.
ఇక కేంద్రపాలిత ప్రాంతాలు మినహా అన్ని రాష్ట్రాల్లోనూ మొత్తం 1,22,064 కేసులు నమోదయ్యాయి. కేంద్రపాలిత ప్రాంతాల్లో 6467 కేసులు నమోద య్యాయి. భారత దేశంలో చిన్నారులపై మొత్తం 1,28,531 నేర సంఘటనలు జరిగాయి.
పిల్లల హత్యల్లోనూ యూపీ టాప్
2020 లో 271 దారుణాలు నమోదై.. పిల్లల హత్య కేసులో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉన్నది. 149 హత్య ఘటనలతో మహారాష్ట్ర రెండవ స్థానంలో ఉండగా, 144 కేసులతో మధ్యప్రదేశ్ మూడో స్థానంలో ఉన్నది. బీహార్‌లోనూ 122 హత్య కేసులు నమోదయ్యాయి. మరోవైపు 2020లో 30 లైంగికదాడి కేసులు.. హత్యలకేసులతో ఉత్తర ప్రదేశ్ మొదటి స్థానంలో ఉన్నది. 13 కేసులతో మధ్యప్రదేశ్ రెండవస్థానంలో ఉన్నది. ఢిల్లీలో 24 మంది చిన్నారులపై హత్య కేసులు నమోదయ్యాయి.
దేశవ్యాప్తంగా చిన్నారుల హత్యకు సంబంధించి మొత్తం 1420 కేసులు నమోదయ్యాయి. వీటిలో 37 సంఘటనలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో జరగగా, 1383 సంఘటనలు కేంద్ర పాలిత ప్రాంతాలు కాకుండా ఇతర రాష్ట్రాల్లో జరిగాయి. అలాగే దేశవ్యాప్తంగా 115 లైంగికదాడులు,హత్య కేసులు నమోదయ్యాయి. వీటికి సంబంధించి రాష్ట్రాలలో 114 కేసులు నమోదయ్యాయి, ఢిల్లీలో ఒక కేసు నమోదైంది.
పిల్లలపై హత్యాయత్నాలు
పిల్లలను చంపడానికి ప్రయత్నించిన అత్యధిక కేసులు బీహార్‌లో ఉన్నాయి. దీనికి సంబంధించిన 136 కేసులు ఇక్కడ నమోదయ్యాయి. దేశంలో మొత్తం 336 కేసులు నమోదయ్యాయి, అయితే కేంద్రపాలిత ప్రాంతాల్లో 8 కేసులు నమోదయ్యాయి, వాటిలో అత్యధికంగా రాజధాని ఢిల్లీలో ఐదు కేసులు నమోదయ్యాయి.
భ్రూణ హత్య
భ్రూణ హత్యల విషయానికి వస్తే.. గుజరాత్ మొదటి స్థానంలో ఉన్నది. దీనికి సంబంధించిన 22 కేసులు ఇక్కడ నమోదయ్యాయి. అలాగే 17 కేసులు నమోదైన గుజరాత్ తర్వాత మధ్యప్రదేశ్ రెండవ స్థానంలో ఉన్నది. 2020 లో దేశంలో భ్రూణ హత్యలకు సంబంధించిన మొత్తం 109 కేసులు నమోదయ్యాయి. కేంద్రపాలిత ప్రాంతాలలో, ఢిల్లీలో మాత్రమే ఒక కేసు నమోదైంది.
మైనర్ల కిడ్నాప్
వివాహం పేరిట మైనర్ బాలికలను అపహరించిన (11,051) కేసులు దేశంలో నమోదయ్యాయి. 2020 లో 2943 కేసులు నమోదై.. ఉత్తరప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. 2688 కేసులతో బీహార్ రెండవస్థానంలో ఉన్నది.
మైనర్ బాలికల అపహరణ.. అమ్మకం
మైనర్ బాలికల కొనుగోలు, విక్రయానికి సంబంధించి, 2020 లో అసోంలో అత్యధికంగా 1052 కేసులు నమోదయ్యాయి. హర్యానాలో 787 కేసులు నమోదయ్యాయి. జార్ఖండ్‌లో 231 నమోదయ్యాయి. మైనర్ బాలికల అమ్మకం, కొనుగోలుకు సంబంధించి దేశంలో మొత్తం 2471 కేసులు నమోదయ్యాయి.
మైనర్‌పై లైంగికదాడి
- స్కూల్ బస్సు దిగగానే..కిడ్నాప్
- మధ్యప్రదేశ్ రాజ్‌గఢ్‌లో తాజా ఘటన..
మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌లో మైనర్ బాలిక బస్సు దిగుతుండగా..కిడ్నాప్ చేసి..లైంగికదాడికి పాల్పడ్డారు. 13 రోజుల తర్వాత తనపై జరిగిన అఘాయిత్యాన్ని తల్లికి వినిపించి విలపించింది. బిడ్డను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.పోలీస్ స్టేషన్ ఇన్చార్జి డిపి లోహియా వివరాల ప్రకారం.. రాజ్‌గఢ్ జిల్లాలోని పచోర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సెప్టెంబర్ 6 న మధ్యాహ్నం మూడున్నరంగటలకు 13 ఏండ్ల బాలిక స్కూల్ బస్సులో ఇంటికి తిరిగి వచ్చింది. 21 ఏండ్ల ఆశిష్ వర్మ బస్ స్టాప్ వద్ద దిగగానే ఆమెను ఆపాడు. నీతో మాట్లాడాలి.. కారులో కూర్చోండి, నిన్ను ఇంటి వద్ద మళ్లీ దింపేస్తానన్నాడు.ఆ బాలికను తన ఇంటికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.అంతేకాదు చంపేస్తానంటూ బెదిరించాడు. లైంగికదాడి, కిడ్నాప్, పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
పిల్లలపై జరిగిన మొత్తం నేరాలివే..
కేంద్రపాలిత ప్రాంతాలతో సహా రాష్ట్రాలలో 2020 లో 77,382 కేసులు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్‌లో మాత్రమే 11,322 కేసులు నమోదయ్యాయి. ఈ విభాగంలో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో ఉన్నది.ఆ తర్వాత మహారాష్ట్రలో 8407 కేసులు నమోదయ్యాయి.ఉత్తర ప్రదేశ్‌లో 8186 కేసులు నమోదయ్యాయి. మరోవైపు కేంద్రపాలిత ప్రాంతమైన దేశ రాజధాని ఢిల్లీలో అత్యధికంగా 4113 కేసులు నమోదయ్యాయి. కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 4760 కేసులు నమోదయ్యాయి.