Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇకపై యాజమాన్యం ఓకే చెబితేనే సంఘాలకు గుర్తింపు
- యాజమాన్యం సంతృప్తి చెందితేనే మనుగడ
- 'పారిశ్రామిక సంబంధాల కోడ్, 2020'లో నియమ నిబంధనలు
- ట్రేడ్ యూనియన్లను బలహీనపర్చటమే మోడీ సర్కార్ లక్ష్యం : రాజకీయ విశ్లేషకులు
- కార్పొరేట్లు, యాజమాన్యాల్ని బలోపేతం చేయటమే లేబర్ కోడ్ లక్ష్యం
- కేంద్రం చేపట్టిన కార్మిక సంస్కరణలపై సర్వత్రా ఆగ్రహం
మనదేశంలో కార్మిక సంఘాలు చురుకుగా ఉన్నాయి. వీటిని బలహీనం చేయాలన్న వ్యూహంతో మోడీ సర్కార్ అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టాలకు సంబంధించి నియమాలు, నిబంధనల్ని కేంద్ర ప్రభుత్వం మెల్లమెల్లగా బహిరంగ పరుస్తోంది. ఉదాహరణకు 'పారిశ్రామిక సంబంధాల కోడ్'లో 'ట్రేడ్ యూనియన్ల గుర్తింపు' అనేది చేర్చటం చర్చనీయాంశమైంది. కార్పొరేట్లను, కంపెనీల యాజమాన్యాల్ని బలోపేతం చేయటం, కార్మికసంఘాల మనుగడ ప్రశ్నార్థకం చేయటం 'లేబర్ కోడ్' లక్ష్యమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
న్యూఢిల్లీ : కార్మికలోకంపై మోడీ సర్కార్ మరో బాంబు పేల్చింది. యాజమాన్యాలకు, కార్మికసంఘాలకు మధ్య ఇప్పటివరకూ ఉన్న సంబంధాన్ని సమూలంగా మార్చేస్తూ కొత్త నిబంధనల్ని, నియమావళిని తీసుకొచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. కార్మికసంఘాల గుర్తింపు, వాటి హోదా, చర్చలు, వివాద పరిష్కారంలో ట్రేడ్ యూనియన్ల పాత్ర...ఇలా అనేక అంశాల్లో సమూల మార్పులు చేస్తోంది. అన్నింట్లోనూ 'యాజమాన్యా లకు పైచేయి' ఉండేట్టు నిబంధనల్ని పొందుపర్చారు. ఉదాహరణకు కార్మికసంఘానికి గుర్తింపు..ఉంచాలా?లేదా? అనేది యాజమాన్యాల చేతుల్లో పెట్టారు. ఇదంతా కూడా 2022 ఆఖరుకల్లా దేశమంతా అమల్లోకి తీసుకొచ్చే ఆలోచనలో కేంద్రం ఉంది.
ఇప్పటివరకూ అమల్లో ఉన్న అనేక కార్మికచట్టాల్లో మార్పులు చేసిన కేంద్రం, వాటిని నాలుగు లేబర్ కోడ్లలో కూర్చింది. అలా..'ఇండిస్టియల్ రిలేషన్స్ కోడ్'(ఐఆర్ కోడ్)లో చేరిపోయిన కార్మికచట్టం 'ట్రేడ్ యూనియన్స్ యాక్ట్, 1926'. ఈచట్టం ప్రకారం..ఇప్పటివరకూ ఏదైనా కార్మికసంఘానికి గుర్తింపు, రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదు. ఆయా రాష్ట్రాల్లోని చట్టాల ద్వారానే కార్మికసంఘాలకు గుర్తింపు లభిస్తోంది. అయితే ఇదంతా కూడా ఐఆర్ కోడ్‌తో మారబోతోంది. ఐఆర్ కోడ్‌లో నిబంధనల ప్రకారం, కార్మికసంఘా నికి యాజమాన్యమే గుర్తింపు ఇస్తుంది. కంపెనీలో పనిచేస్తున్న కార్మికుల్లో 51శాతం మద్దతు ఉన్న కార్మికసంఘానికి మాత్రమే 'నెగోషియేటింగ్ యూనియన్'ను ఏర్పరచగలదు. 'నెగోషియేటింగ్ యూనియన్'తో మాత్రమే యాజమాన్యాలు చర్చిస్తాయి, మాట్లాడుతాయి. ఒకవేళ 51శాతం కార్మికుల మద్దతు లేకపోతే..అప్పుడు 'నెగోషియేటింగ్ కౌన్సిల్' ఏర్పాటవుతుంది. మొత్తం కార్మికుల్లో 20శాతం సభ్యత్వమున్న సంఘాలకు మాత్రమే కౌన్సిల్లో చోటు ఉంటుంది. కార్మికుల సమస్యలపై ఏది మాట్లాడాలన్నా ఈ సంఘాలను మాత్రమే అనుమతిస్తారు. వీటన్నింటికంటే ముందు కార్మికసంఘాలకు గుర్తింపు ఇవ్వటమనేది చర్చనీయాంశమవుతోంది. ఐఆర్ కోడ్ ప్రకారం కార్మికసంఘాల గుర్తింపు..అనేది కంపెనీ యాజమాన్యాలు నిర్ణయిస్తాయి. సాంప్రదాయంగా ఇప్పటివరకూ చూస్తున్న యాజమాన్యాలు-కార్మికులు, యాజమాన్యాలు- కార్మికసంఘాల సంబంధాల్లో సమూల మార్పులకు ఈ లేబర్ కోడ్లు అవకాశం కల్పిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. యాజమాన్యాలకు పైచేయి కల్పిస్తూ లేబర్ కోడ్లకు రూపకల్పన చేశారని వారు చెప్పారు.
మనుగడనే దెబ్బతీయాలని..
ఇప్పటివరకూ ఉన్న కార్మిక చట్టాల్లో...కార్మికులకు ఉద్యోగ భద్రత, పనిగంటలు, వేతనాలు, వైద్య, ఆరోగ్య బీమా..మొదలైనవి ప్రధాన అంశాలుగా ఉన్నాయి. కార్మిక హక్కుల్ని పరిరక్షించే విధంగా నిబంధనలు, నియమాలు ఏర్పాటుచేశారు. ఉదాహరణకు 'పారిశ్రామిక వివాదాల చట్టం, 1947'. దీని ప్రకారం కంపెనీ లే-ఆఫ్ (కార్మికుల్ని తాత్కాలికంగా, శాశ్వతంగా తొలగించటం) ప్రకటించాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. లేబర్ కోడ్ అమల్లోకి వస్తే కంపెనీ ఇష్టం, ప్రభుత్వ అనుమతి అవసరం లేదు. అప్పుడు కార్మికుల ప్రయోజనాలు, హక్కులకు విలువ లేకుండా పోతుంది. లేబర్ కోడ్లలో యాజమాన్యాలకు అనుకూలమైన విధానాలను పొందుపర్చారు. కార్మికసంఘాల మనుగడను ప్రశ్నార్థకం చేసేందుకు 'ఐఆర్ కోడ్'ను తీసుకొచ్చారు.
నిపుణులు ఏమంటున్నారు?
ఈ లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే...సంఘటిత, అసంఘటిత రంగాల్లో ఉపాధి, పనితీరు మారిపోనున్నది. కాంట్రాక్ట్ పద్ధతిలో ఇష్టమున్నట్టుగా కార్మికుల్ని యాజమాన్యాలు నియమించుకుంటాయి. కార్మికుల్ని తొలగించి నప్పుడు, వారి హక్కుల్ని కాలరాసినప్పుడు...నిరసన గళం ఉండకూడదనేది కేంద్రంలోని పాలకుల వ్యూహం. అమెరికా, బ్రిటన్‌లలోనూ ఈ తరహా చట్టాలు వస్తున్నాయి. కాబట్టే భారత్ కూడా నయా ఉదారవాద విధానాల్లో భాగంగానే వీటిని తీసుకొస్తోందని తెలుస్తోంది.