Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దీని కోసం చర్యలు చేపట్టండి : రాజస్థాన్ సర్కారు తీరును ప్రశ్నించిన ఐద్వా
జైపూర్ : బాల్య వివాహాల విషయంలో రాజస్థాన్ సర్కారు తీరును ఆలిండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ (ఐద్వా) ప్రశ్నించింది. రాష్ట్రంలో ఈ దురాచారాన్ని తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. రాష్ట్ర అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నడుమ 'రాజస్థాన్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజేస్ యాక్ట్, 2009' ను కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన విషయం తెలిసిందే. ఇందులో బాల్య వివాహాలనూ పేర్కొనడం గమనార్హం. దీనికి స్పందనగానే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఐద్వా ప్రశ్నించింది. ఇటు రాష్ట్రంలోని ప్రతిపక్షాలు సైతం ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. చట్టంలో ప్రభుత్వం చేసిన మార్పులు రాష్ట్రంలో బాల్య వివాహాలు చెల్లుబాటు అయ్యేలా చేస్తుందని ఆరోపించాయి. అయితే, చట్టంలో ఒక సాంకేతిక మార్పు తప్పా కొత్తదేమీ లేదని అధికార కాంగ్రెస్.. తన చర్యను సమర్థించకుంటున్నది. '' 2009 చట్టం ఇప్పటికే బాల్య వివాహాలకు రిజిస్ట్రేషన్‌ను కల్పించింది. సవరణ చట్టంలోని సెక్షన్ 8 దీనినే పునరుద్ఘాటిస్తున్నది'' అని ఒక ప్రకటనలో ఐద్వా పేర్కొన్నది. '' బాల్య వివాహాల నిరోధక చట్టం, 2006(పీఎంసీఏ, 2006) ప్రకారం ఇలాంటి వివాహాలు చెల్లుబాటు కావు. అయినప్పటికీ, రాజస్థాన్ 2009 చట్టం బాల్య వివాహాలకు రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేస్తూ చట్టబద్ధతను కల్పిస్తున్నది'' అని అసహనాన్ని వ్యక్తం చేసింది.
'ప్రభుత్వం తగిన విధంగా వ్యవహరించడంలేదు'
చట్టంలో సవరణ పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత లేదని ఆరోపించింది.బాల్య వివాహాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించడంలేదని పేర్కొన్నది.మహమ్మారి సమయంలో రాష్ట్రంలో బాల్య వివాహాలు ఎక్కువయ్యాయని తెలిపింది.బాల్య వివాహాలు బాలికలపై తీవ్ర ప్రభావాన్ని చూపడమే కాకుండా వారిని వివక్షకు గురి చేస్తాయని వివరించింది. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితుల పట్ల ఐద్వా ఆందోళన వ్యక్తం చేసింది.2020లో బాల్య వివాహాలు 50 శాతం పెరిగాయని నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డులను ఈ సందర్భంగా ఉటంకిం చింది.కాగా,చిన్నారుల హక్కులను కాపడటం కోసం రాజస్థాన్ అసెంబ్లీ పాస్ చేసిన బిల్లును పరిశీలిస్తామని 'నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్సీపీసీఆర్)' ఇప్పటికే తెలిపిన విషయం విదితమే.