Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు సార్లు దాడుల్లో గుర్తించిన ఐటి శాఖ
న్యూఢిల్లీ : ఉక్కు, టెక్స్‌టైట్స్, ఫిలమెంట్ నూలు ఉత్పత్తుల్లో ప్రసిద్ధి చెందిన ఒక ప్రముఖ సంస్థలో రూ వెయ్యి కోట్ల ఆర్థిక అక్రమాలను ఆదాయపన్ను శాఖ గుర్తించింది. పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, పంజాబ్‌ల్లో సంస్థకు చెందిన 25కు పైగా ప్రదేశాల్లో ఈ నెలలో రెండు దఫాలుగా నిర్వహించిన దాడుల్లో ఐటి శాఖ ఈ అక్రమాలను గుర్తించింది. ఈ నెల 17న పశ్చిమబెంగాల్లోని కొల్కతా, దుర్గాపూర్, అసన్సోల్, పురులియా ప్రాంతాల్లో సంస్థ ఉక్కు ఉత్పత్తి చేసే కేంద్రాలో ఐటి శాఖ తొలి దశ దాడులను నిర్వహించింది. ఈ దాడుల్లో లెక్కల్లోనికి రాని భారీ ఆదాయాన్ని గుర్తించింది. నగదు అమ్మకాలు, వ్యయాలు, బోగస్ పార్టీల నుంచి కొనుగోలు, అసలు ఉత్పత్తిని తక్కువగా చూపడం, స్క్రాప్ కొనుగోళ్లు, అన్సెక్యూర్డ్ రుణాలు, భూమి కొనుగోలు, అమ్మకాలు ద్వారా వస్తున్న ఆదాయాన్ని సంస్థ లెక్కల్లో చూపించడం లేదని, అలాగే ఈ ఆదాయాన్ని షెల్ కంపెనీల్లో పెట్టుబడిపెడుతున్నట్లు ఐటి శాఖ గుర్తించింది. గ్రూపు సభ్యుల్లో ఒకరి పేరు మీద ఆస్తి పత్రాలు ఉన్నట్లు గుర్తించింది. రెండు లాకర్ల నుంచి రూ 20 లక్షలను స్వాధీనం చేసుకుంది. ఈ మొదటి దశ దాడుల్లో ఈ సంస్థ రూ 700 కోట్లు వరకూ అర్థిక అక్రమాలకు పాల్పడినట్లు తెల్చింది. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా సంపాదించింది. ఈ నెల 18న కొల్‌కత్తాతో పాటు సంస్థకు చెందిన ఢిల్లీ, పంజాబ్‌లోని ప్రదేశాల్లో దాడులు జరిపింది. ఈ దాడుల్లో సంస్థకు చెందిన విదేశీ బ్యాంక్ ఖాతాల్లో దాదాపు 350 కోట్ల రూపాయిల వరకూ అన్ఎకౌంటెడ్ నిధులను గుర్తించింది.