Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ నేత బినరు విశ్వం
ఉక్కునగరం (విశాఖ) : ప్రభుత్వ రంగ సంస్థలను తన్నుకుపోవాలని చూస్తోన్న కార్పొరేట్ శక్తులను తరిమికొడితేనే ప్రభుత్వ రంగానికి రక్షణ ఉంటుందని సీపీఐ కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు బినరు విశ్వం అన్నారు. సీపీఐ ఏపీ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో జన ఆందోళన్‌లో భాగంగా అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల నుంచి ప్రారంభమైన జాతాల ముగింపు సందర్భంగా మంగళవారం విశాఖలోని జింక్ గేట్ నుంచి కూర్మన్నపాలెం స్టీల్‌ప్లాంట్ కార్మికుల దీక్షా శిబిరం వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం అక్కడ జరిగిన సభలో బినరువిశ్వం మాట్లాడుతూ ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ప్రతీక విశాఖ ఉక్కు అని, దీనిని కాపాడుకొనేందుకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమని అన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ పరిశ్రమలను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కంకణం కట్టుకుందని విమర్శించారు. వీటికి వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా పోరాడాలని కోరారు. వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేసే వరకు రైతుల పోరాటానికి మద్దతు ఇవ్వాలన్నారు. సీపీఐ కార్యదర్శి కె.నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ఎంపీలంతా విశాఖ ఉక్కు పరిరక్షణకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 27న నిర్వహిస్తున్న భారత్ బంద్‌కు జయప్రదం చేయాలని కోరారు. సీపీఐ ఏపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి.సత్యనారాయణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సభలో సీపీఐ ఏపీ రాష్ట్ర నాయకులు ముప్పాళ్ల నాగేశ్వర్రావు, కార్పొరేటర్ ఎజె స్టాలిన్, ఏఐటీయూసీ ఏపీ రాష్ట్ర నాయకులు ఓబులేసు, రవీంద్రనాథ్, సీపీఐ నగర కార్యదర్శి ఎమ్.పైడిరాజు, ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్, జె.అయోధ్యరామ్ పాల్గొన్నారు.