Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఏఐ వాటాను విక్రయించనున్న కేంద్రం
- మానిటైజేషన్ ప్రక్రియలో భాగం
న్యూఢిల్లీ : హైదరాబాద్ విమానాశ్రయం పూర్తిగా ప్రయివేటుపరం కానుంది. ఇందులోని ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కు ఉన్న మైనారిటీ వాటాను కూడా మోడీ సర్కార్ అమ్మకానికి పెడుతోంది. ప్రభుత్వ రంగ సంస్థల వాటాలు, ఆస్తుల విక్రయానికి కేంద్రం కొత్తగా మానిటైజేషన్ ప్రక్రియను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే దేశంలోని నాలుగు కీలక విమానాశ్రయాల్లోని ఏఏఐకి ఉన్న మైనారిటీ వాటాను కూడా కార్పొరేట్లకు కట్టబెట్టడానికి సిద్దమైంది. ఢిల్లీ ఎయిర్‌పోర్టు, ముంబయి విమానాశ్రయాల్లో 26 శాతం చొప్పున వాటా, హైదరాబాద్, బెంగళూరు ఎయిర్‌పోర్టులోని 13 శాతం చొప్పున ఏఏఐ వాటాలను కలిగి ఉంది. ఈ విమానాశ్రయాల్లోని వాటాలను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అమ్మకానికి పెట్టనున్నదని సమాచారం. ఇందులో భాగంగా తొలుత బెంగళూరు, హైదరాబాద్ ఎయిర్‌పోర్టులను పూర్తిగా ప్రయివేటీకరించనున్నది.
13 విమానాశ్రయాల ప్రయివేటీకరణకు ఇటీవల ఏఏఐ బోర్డు ఆమోదం తెలిపింది. వీటిని ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్య పద్దతిలో ఏడు చిన్న విమానాశ్రయాలను, ఆరు పెద్ద విమానాశ్రయాలను కలపాలని భావించింది. ఇందులో భాగంగానే తిరుపతి, రారుపూర్ విమానాశ్రయాలను విలీనం చేయాలని యోచించింది. ఈ ప్రక్రియ తుది దశలో ఉందని.. త్వరలోనే క్యాబినెట్ ఆమోదం లభించనున్నదని సమాచారం. నిటి అయోగ్ ఇటీవల నేషనల్ అసెట్ మానిటైజేషన్ పైపులైన్‌ను రూపొందించింది. ఇందులో భాగంగా విమానయాన మంత్రిత్వ శాఖలోని రూ.20,782 కోట్ల విలువ చేసే ఆస్తులను ప్రయివేటు పెట్టుబడిదారులకు కట్టబెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా వచ్చే 2025 నాటికి ఎఎఐ పరిధిలోని లేదా సంయుక్త వాటాలు కలిగిన 25 విమానాశ్రయాలను కార్పొరేట్లకు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ప్రయివేటు సంస్థలతో ఎఎఐ సంయుక్త భాగస్వామ్యం కలిగిన రూ.10వేల కోట్ల ఆస్తులను విక్రయించాలని నిటి అయోగ్ సూచించింది. సర్కార్ అండతో దేశంలోని కీలకమైన అన్ని విమానాశ్రయాలను అదానీ గ్రూపు సొంతం చేసుకుంటున్న విషయం తెలిసిందే.