Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్‌లో కోవిడ్ 'ఎండెమిక్ స్టేజ్'కు చేరుకుంది..
- తక్కువ..ఎక్కువలు కొన్ని ప్రాంతాలకే పరిమితం..
- టైఫాయిడ్ జ్వరంలా... మారిపోనున్నది : ప్రముఖ వైరాలజిస్ట్ గగన్‌దీప్ కాంగ్
న్యూఢిల్లీ : కోవిడ్-19 వైరస్ భయాలు ఎప్పుడు పోతాయా? అని ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. అత్యధిక జనాభా, జన సాంద్రత ఉన్న భారత్..కరోనా మొదటివేవ్, రెండోవేవ్ దెబ్బకు కుదేలైంది. మూడో వేవ్ ఎలా వస్తుందోననే భయాలున్నాయి. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్ కొద్ది రోజుల క్రితం భారత్‌కు సంబంధించి కీలకమైన ప్రకటన చేశారు. వైరస్ మూడోవేవ్‌పై పెద్దగా భయపడవద్దు, వైరస్ వ్యాప్తి 'ఎండమిక్ స్టేజ్'కు వచ్చిందని అన్నారు. ఆమె వ్యాఖ్యల్ని ప్రముఖ వైరాలజిస్ట్ గగన్‌దీప్ కాంగ్ సమర్థిస్తున్నారు. కరోనా మహమ్మారి భారత్‌లో 'దాదాపు ఎండెమిక్ స్టేజ్'కు వచ్చిందని ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాదు వైరస్‌కు సంబంధించి కొత్త వేరియెంట్స్ విజృంభించే అవకాశాలు లేవని అంచనావేశారు. ఒకవేళ ఉన్నా..అది కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన 'కోవిడ్ వర్కింగ్ గ్రూప్' సభ్యురాలు అయిన గగన్‌దీప్ కాంగ్ న్యూస్ వెబ్‌పోర్టల్ 'ద వైర్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె ఏమన్నారంటే..
ఇతర వ్యాధులపై దృష్టి పెట్టాలి..
దేశవ్యాప్తంగా రెండోవేవ్ ప్రభావం చూపింది. కానీ మూడో వేవ్ కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతుంది. కారణం వైరస్ వ్యాప్తి 'ఎండెమిక్ స్టేజ్'కు చేరుకుంది. రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వారిపై మాత్రం వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కరోనా కారణంగా గత రెండేండ్లుగా కేన్సర్, మధుమేహం, క్షయ..వంటి వ్యాధులపై పెద్దగా దృష్టిపెట్టలేదు. ఇకనుంచి వీటిపై దృష్టిపెట్టాల్సి వుంటుంది.
భయపడాల్సిన పనిలేదు..
వైరస్‌కు సంబంధించి కొత్త వేరియెంట్స్ రావొచ్చు. కానీ ఇప్పటివరకైతే అది బయటపడలేదు. టైఫాయిడ్ జ్వరం మాదిరిగా..కోవిడ్ మారుతుందని వైద్యులు భావిస్తున్నారు. ఎందుకంటే టైఫాయిడ్ జ్వరం గురించి వైద్యులకు పూర్తిగా అవగాహన ఉంది. అలాగే కోవిడ్‌ను ఇప్పుడు వైద్యులు పూర్తిగా అంచనా వేయగలుగుతున్నారు. ఏ మందులు వాడితే తగ్గుతుందో తెలిసిపోయింది. ఇకపై భయపడాల్సిన పని లేదు.
డెల్టా తగ్గుముఖం..
డెల్టా వేరియెంట్ తగ్గుముఖం పడుతోంది. దీని ప్రభావం వల్ల ముందు ముందు కేసుల సంఖ్య రోజుకు 30-35వేల మధ్యకు చేరుకుంటుంది. ఇది సుదీర్ఘకాలం ఉంటుందని భావిస్తున్నాం. బ్రిటన్‌లోనూ వైరస్ గణాంకాలు ఇదే విధంగా ఉన్నాయి. వ్యాక్సిన్ సామర్థ్యం, అది ఎంతకాలం పాటు మనల్ని రక్షిస్తుంది? అనేదానిపై ఇప్పుడే ఏమీ చెప్పలేం. అంతర్జాతీయ పరిశోధన, గణాంకాలు కూడా స్పష్టంగా ఏమీ చెప్పట్లేదు.