Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా కాలంలో కొన్ని రాష్ట్రాల తీరుపై అసహనం
- దీనిపై విచారణ చేయాల్సిందే..: భవన నిర్మాణ సలహా మండలి చైర్మెన్ శ్రీనివాసనాయుడు
న్యూఢిల్లీ: కరోనా కాలంలో కొన్ని రాష్ట్రాలు సరిగా సహాయం చేయలేదనీ, దీనిపై విచారణ జరపాల్సి ఉన్నదని కేంద్ర కార్మిక శాఖ భవన నిర్మాణ సలహా మండలి చైర్మెన్ శ్రీనివాసనాయుడు అన్నారు. బుధవారం నాడిక్కడ కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ కార్యాలయంలో కేంద్ర భవన నిర్మాణ కార్మికుల సలహా మండలి సమావేశం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సమావేశంలో భవన నిర్మాణ కార్మికులు, అసంఘటిత రంగ కార్మికుల సమస్యలపై చర్చించామన్నారు. కరోనా కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం కార్మికులకు రూ.1,000 ఆర్థిక సహాయం అందించిందని చెప్పారు. దేశంలో ఏడు కోట్ల మంది వలస కార్మికులు నమోదు చేసుకోవాల్సి ఉన్నదనీ, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వలస కార్మికులను వెంటనే నమోదు చేయించాలని సూచించారు. సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చిన వారిని భవన నిర్మాణ కార్మికులుగా నమోదు చేసుకోవాలని, వారికి కేంద్రం ఇస్తున్న అన్ని సంక్షేమ పథకాలు అందించాలని తెలిపారు. అసంఘటిత రంగ కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ- శ్రమ్ పోర్టల్‌ను ప్రారంభించిందని, ఈఎస్ఐ, పీఎఫ్ లేని కార్మికులంతా ఇందులో నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ పోర్టల్‌లో నమోదు చేసుకుంటే రెండు లక్షల ప్రమాద బీమా, ఐదు లక్షల ఆరోగ్య బీమా, రూ.3 వేలు పింఛన్ లభిస్తుందని చెప్పారు. అర్చకులు, పూజారులు, వంట బ్రాహ్మణులు సైతం ఈ పోర్టులో నమోదు చేసుకునే అవకాశం కల్పించామని అన్నారు. ఈ అవకాశాన్ని కార్మికులంతా ఉపయోగించుకోవాలని సూచించారు.