Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నో అవాంతరాలు ఎదురొడ్డి సాగుతున్న ఉద్యమం
- 600 మందికి పైగా అమరవీరులైన రైతులు
- ఉద్యమం లక్షలాది మంది రైతుల సంకల్పానికి నిదర్శన్ణం ఎస్కేఎం
న్యూఢిల్లీ: మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాది మంది రైతులు చేపట్టిన చారిత్రాత్మక ఉద్యమం 300 రోజుల పూర్తి చేసుకున్నది. 2020 నవంబర్‌లో రైతులను ఢిల్లీలోకి ప్రవేశించకుండా సరిహద్దుల్లో ఢిల్లీ పోలీసులు అడ్డుకు న్నారు. దీంతో రైతులు అక్కడే రోడ్లపైనే ఆందోళన చేప ట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ రోడ్లపైనే ఆందోళన కొసాగిస్తున్నారు. తీవ్రమైన వర్షాలు, చలి, ఎండలను సైతం తట్టుకొని భారతదేశ ఆహారాన్ని, వ్యవసాయాన్ని కార్పొరేట్ స్వాధీనం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన చేస్తున్నారు. కేంద్ర, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలు పన్నిన కుట్రలను సైతం ఎదుర్కొని చారిత్రాత్మక పోరాటాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతి యుతంగా నిర్వహిస్తున్నారు. పాలకులు సృష్టించిన అవంతరాలను సైతం ఎదురొడ్డి రైతు ఉద్యమం ముందుకు సాగుతుంది. ఈ ఉద్యమంలో ఇప్పటికే 600 మందికిపైగా రైతులు అమరులయ్యారు. అయి నప్పటికీ రైతుల న్యాయ బద్ధమైన డిమాండ్లను అంగీకరించకూడదని మోడీ సర్కార్ మొండిగా వ్యవహరిస్తుంది. రైతుల డిమాండ్లు మోడీ సర్కార్‌కు స్పష్టంగా తెలుసు, కానీ ఇలా వ్యవహరించడ దారుణమని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) విమర్శిస్తుంది. ఈ చారిత్రాత్మక ఉద్యమం దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతుల సంకల్పం, ఆశలకు నిదర్శనంగా నిలుస్తుందని ఎస్కేఎం పేర్కొంది. ఈ ఉద్యమాన్ని బలోపేతం చేస్తామనీ, ముందుకు తీసుకెళ్లేందుకు, మరింత విస్తృతంగా చేయడానికి ఎస్కేఎం ప్రణాళికలు చేస్తుందని తెలిపింది.
ముమ్మరంగా భారత్ బంద్ సన్నాహాలు
సెప్టెంబర్ 27న భారత్ బంద్ విజయవంతం చేయడానికి సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. దేశంలోని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే ఉద్యమంగా మారుతున్న రైతు పోరాటానికి మద్దతు, సంఘీభావం పొందడానికి దేశంలోని వివిధ ప్రాంతాల్లోని రైతు సంఘాలు సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే అనేక రైతు, వ్యవసాయ కార్మిక, కార్మిక, ఉద్యోగ, యువజన, విద్యార్థి, మహిళా సంఘాలు, ట్రాన్స్పోర్టర్స్ అసోసియేషన్లతో పాటు వివిధ సంఘాలతో ఉమ్మడి ప్రణాళిక సమావేశాలు జరుగుతున్నాయి. భారత్ బంద్ పిలుపులో ఎక్కువ మంది పౌరులను భాగస్వామ్యం చేసేందుకు మహా పంచాయితీలు కూడా నిర్వహిస్తున్నామని ఎస్కేఎం తెలిపింది. బైక్ ర్యాలీలు, సైకిల్ యాత్రలు కూడా జరుగుతున్నాయని తెలిపింది.
యూపీ సీఎం నియోజకవర్గం గోరఖ్‌పూర్‌లో కిసాన్ మహాపంచాయత్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి నియోజకవర్గం గోరఖ్‌పూర్‌లో కిసాన్ మహాపంచాయత్ భారీ స్థాయిలో జరిగింది. యూపీలో రైతుల ఆందోళన తీవ్రత, సమీకరణ క్రమంగా పశ్చిమ యూపీ దాటి ఇతర ప్రాంతాలకు బలంగా వ్యాప్తి చెందుతోంది. యమునా ఎక్స్‌ప్రెస్‌వేలో మధుర సమీపంలో జరిగినట్టుగా ఉత్తరప్రదేశ్‌లో కూడా టోల్ ప్లాజాలు నెమ్మదిగా ప్రజల కోసం ఉచితం చేయబడుతున్నాయి. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో లక్సర్‌లో భారీ కిసాన్ మహా పంచాయితీ జరిగింది. ఈ కిసాన్ పంచాయత్‌లో ఎస్కేఎం నేత రాకేశ్ తికాయత్ పాల్గొన్నారు.
ప్రారంభమైన కబడ్డీ పోటీలు
సరిహద్దుల వద్ద దేశాన్ని కాపాడే జవాన్లు కూడా ప్రధానంగా వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన విధంగానే, దేశంలో అనేక మంది క్రీడాకారులు వ్యవసాయ కుటుంబాల నుంచే వచ్చారు. అందుకు రైతులు ఎల్లప్పుడూ గర్వపడుతున్నారు. దేశంలోని వివిధ క్రీడల్లో అనేక పతకాలు, అవార్డు గెలుచుకున్న క్రీడాకారులు వ్యవసాయ కుటుంబాలకు చెందినవారు. ఈ నేపథ్యంలో బుధ, గురువారాల్లో టిక్రి బోర్డర్లో కబడ్డీ లీగ్ పోటీలు జరుగుతున్నాయి. 24, 25, 26 తేదీలలో సింఘు బోర్డర్లో కబడ్డీ లీగ్ పోటీలు జరుగుతాయి. రైతుల సమస్యలపై అవగాహన పెంచడానికి, ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి ఈ కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నామని ఎస్కేఎం నేతలు తెలిపారు.