Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై కమలదళంలో ఆందోళన
- ఆయా రాష్ట్రాల్లో 50శాతం సిట్టింగ్‌లను మార్చాలని నిర్ణయం
- ఇప్పటికే గుజరాత్, ఉత్తరాఖండ్‌లో ముఖ్యమంత్రుల మార్పు
న్యూఢిల్లీ : బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజా వ్యతిరేక బాగా పెరిగింది. ఆయా రాష్ట్రాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు వచ్చే ఎన్నికల్లో నష్టం చేకూర్చే అవకాశముందని కమలదళంలో ఆందోళన నెలకొంది. ప్రజా వ్యతిరేకతను మూటకట్టు కున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో ఓటమి భయంలో ఆ పార్టీ నేతలున్నారు. అయితే ప్రజా వ్యతిరేకతను పక్కకు నెట్టేందుకు జాతీయత వ్యతిరేక, హిందూత్వం వంటి అంశాలతో పాటు అంతర్జాతీయ, సరిహద్దు అంశాలు ప్రచారం లోకి తీసుకురావాలని బీజేపీ భావిస్తున్నది. అలాగే ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేల మార్పు వంటి చర్యలు చేపట్టాలని ఆ పార్టీ అగ్రనాయకత్వం ఆలోచిస్తున్నది. అందుకోసం కొన్ని చర్యలకు సిద్ధమైంది. ఇప్పటికే వరుసగా రాష్ట్రాల ముఖ్యమంత్రులను మార్చుకుంటూ వస్తున్న బీజేపీ, ఇప్పుడు ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వకూడదని నిర్ణయించింది.
50శాతం సిట్టింగ్‌లకు సీట్లు నో..
వచ్చే ఏడాది (2022)లో ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఒక్క పంజాబ్ మినహా, మిలిగిన ఆరు బీజేపీ పాలిత రాష్ట్రాలు. ఇందులో కూడా ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్ బీజేపీకి చాలా కీలకం. గుజరాత్, ఉత్తరాఖండ్‌లో ఇప్పటికే ముఖ్యమంత్రులను మార్చారు. అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 50 శాతం మందికి సీట్లు ఇవ్వకూడదని నిర్ణయించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 15 నుంచి 20శాతం మంది సిట్టింగ్‌లకు సీట్లు ఇవ్వలేదనీ, కానీ ఈసారి పరిపాలనపై ప్రజల... అసంతృప్తి కారణంగా ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉండవచ్చని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. 'అనేక రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితిని అంచనా వేయడానికి గ్రౌండ్ సర్వేలను నిర్వహించింది. ప్రభుత్వ పనితీరుపై ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు నియోజకవర్గాల్లో సర్వేలు జరిగాయి. అట్టడుగు వర్గాల సాధికారత కోసం చేసిన ప్రాజెక్టులు, శాసన సభ్యులు స్థానిక ప్రాంత.... అభివృద్ధి నిధుల వ్యయం, మహమ్మారి సమయంలో పార్టీ సంక్షేమ కార్యక్రమం వంటి తదితర అంశాలపై సర్వే నిర్వహించాం. అలాగే గత ఐదేళ్లలో చేసిన పనికి సంబంధించిన నివేదిక కార్డ్‌లను సమర్పించమని ఎమ్మెల్యేలను కూడా కోరారు. అవి పార్టీ సొంత ఫలితాలతో లెక్కించబడ్డాయి. పనితీరు సరిగా లేని వారికి మళ్లీ పోటీ చేయలేరు'' అని అయన అన్నారు.
నిరుద్యోగం, ధరలు పెరుగుదల
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రజా వ్యతిరేక చాలా ఎక్కువ ఉంది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు కాకపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్‌తోపాటు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదల, నిరుద్యోగం, అవినీతి వంటి వాటితో పాటు ఆయా రాష్ట్రాల్లో స్థానిక అవినీతి, కుంభకోణాలు కూడా ప్రధానంగా ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ప్రధానంగా చెరకు రైతుల సమస్యలు, నేరాలు, శాంతి భద్రతలు, నిరుద్యోగం వంటి అంశాలు నెలకొన్నాయి. ఉత్తరాఖండ్‌లో రైతు సమస్యలు, అవినీతి, కుంభకోణాలు, అస్థిర ప్రభుత్వం వల్ల ప్రజలు విసిగిచెందడం వంటి అంశాలు ఉన్నాయి. గోవాలో నిరుద్యోగం సమస్య ప్రధానంగా ఉంది. హిమాచల్‌ప్రదేశ్‌లో ఆపిల్ రైతుల సమస్యలు, అవినీతి ప్రభావం ఎక్కువ ఉంది. మణిపూర్‌లో హామీలు అమలు చేయకపోవడంతో పాటు వివిధ స్థానిక అంశాలు ఉన్నాయి.
రైతు ఉద్యమం పెద్ద ప్రభావం
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు చేస్తున్న పోరాటం వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపనుంది. ప్రధానంగా బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో ఈ ఉద్యమం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇటీవల ముజఫర్‌నగర్‌లో మిషన్ యూపీ, ఉత్తరాఖండ్లను ప్రారంభిస్తూ జరిగిన కిసాన్ మజ్దూర్ మహా పంచాయత్ కూడా విజయవంతం కావడంతో రైతుల్లో నూతనోత్సహం నెలకొంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కిసాన్ మహా పంచాయత్‌లో నిర్వహిస్తున్నారు. అలాగే ఉత్తరాఖండ్‌లో కూడా రైతుల ఉద్యమం ఉవ్వెత్తున్న ఎగిసిపడుతుంది. బీజేపీ నేతలను రైతులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఉత్తరాఖండ్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం విస్తరించి ఉంది. దీంతో బీజేపీ నేతల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇదివరకు రైతు ఉద్యమాన్ని అణచివేసేందుకు అనేక దాడులు, రైతు నేతలపై కేసులు బనాయించడం, అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి చర్యలకు పూనుకున్న బీజేపీ ప్రభుత్వం, ఎన్నికలు సమీపిస్తుండటంతో కాస్తా నోరు అదుపులో పెట్టుకొని వ్యవహరిస్తుంది.