Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందులో 53శాతం రూ.2వేల నోట్లవే : ఎన్సీఆర్బీ నివేదిక
న్యూఢిల్లీ : క్రితం ఏడాదితో పోల్చితే 2020లో దొంగనోట్ల పట్టివేత 191 శాతం పెరిగిందని 'జాతీయ నేర గణాంకాల బ్యూరో' (ఎన్సీఆర్బీ) తాజాగా వెల్లడించింది. పట్టుబడ్డ మొత్తం దొంగనోట్ల విలువలో 53శాతం రూ.2వేల నోట్లు ఉండగా, రూ.వెయ్యినోట్లు(చలామణిలో లేనప్పటికీ) 35శాతం ఉన్నాయని నివేదిక పేర్కొంది. ఇందులో పేర్కొన్న మరికొన్ని విషయాలు ఈ విధంగా ఉన్నాయి. 2020ఏడాదిలో 8,34,947 దొంగనోట్లు పట్టుబడ్డాయి. వీటి విలువ సుమారుగా రూ.92కోట్లకుపైగా ఉంటుంది. అంతక్రితం ఏడాది అయిన 2019లో 2,87,404 దొంగనోట్లు పట్టుబడ్డాయి. వీటి విలువ రూ.25కోట్లుగా ఉంది. ఈ గణాంకాలతో పోల్చితే 2020లో పట్టుబడ్డ దొంగనోట్లు 3.6రెట్లు ఎక్కువ. వీటికి సంబంధించి దేశవ్యాప్తంగా పోలీసులు 385 కేసులు నమోదుచేయగా, ఇందులో 633 నిందితులుగా ఉన్నారు.
రాష్ట్రాల వారీగా చూస్తే 2020లో మహారాష్ట్రలో పెద్ద మొత్తంలో దొంగనోట్లు పట్టుబడ్డాయి. రూ.83.6కోట్ల విలువజేసే 6,99,495 దొంగనోట్లను పోలీసులు సీజ్ చేశారు. ఆ తర్వాత స్థానాల్లో పశ్చిమబెంగాల్(24,227), గుజరాత్ (20,360), ఆంధ్రప్రదేశ్(17,705), ఉత్తరప్రదేశ్(17,078) రాష్ట్రాలున్నాయి. నోట్ల రద్దు తర్వాత వచ్చిన రూ.500 కొత్త వాటిల్లో పెద్ద సంఖ్యలో దొంగనోట్లు పట్టుబడ్డాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక సైతం పేర్కొంది. పట్టుబడ్డ మొత్తం 8,34,947 దొంగనోట్లలో 2,08,625నోట్లు బ్యాంకుల వద్ద గుర్తించారని నివేదిక తెలిపింది. దొంగనోట్ల ముద్రణ, పంపిణీలో ఒక మహిళ అంతర్జాతీయ ముఠాను నడుపుతోందని, ఆమెను యూపీ యాంటీ టెర్రరిజం విభాగం పట్టుకుందని సమాచారం. బంగ్లాదేశ్ నుంచి దొంగనోట్లను యూపీ, పంజాబ్, హర్యానాకు చేరవేస్తున్నామని, వివిధ రాష్ట్రాల్లో తనకు ఏజెంట్లు ఉన్నారని విచారణలో ఆమె చెప్పిందట!