Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విధించిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ.పది లక్షలను అత్యున్నత న్యాయస్థానం జరిమానా విధించింది. స్టాంప్ డ్యూటీ వసూలుకు సంబంధించి ఏపీ ప్రభుత్వ రెవెన్యూ, స్టాంప్స్, రిజిస్ట్రేషన్ విభాగం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టి వేసింది. సెక్యురిటైజేషన్, రికనస్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్, ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యురిటీ ఇంట్రెస్ట్ యాక్ట్ 2002 కింద వేలం వేసిన దానికి సేల్ సర్టిఫికెట్ ప్రకారం స్టాంప్‌డ్యూటీ, రిజిస్ట్రేషన్ రుసుమును దేవీ సీ ఫుడ్స్ నుంచి వసూలు చేయాలని, మార్కెట్ విలువ మీద కాదంటూ ఏపి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపి రెవెన్యూ, స్టాంప్స్, రిజిస్ట్రేషన్ విభాగం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమ కోహ్లిలతో కూడిన ధర్మాసనం విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తున్నట్టు హైకోర్టు ఆర్డర్లో ఉన్నదనీ, కోర్టు ఆదేశాన్ని గౌరవించరా అంటూ ఏపీ తరపు న్యాయవాదిని జస్టిస్ ఎన్వి రమణ ప్రశ్నించారు. రూ.10 లక్షల జరిమానా విధిస్తున్నామని జస్టిస్ ఎన్వి రమణ పేర్కొంటూ పిటిషన్ కొట్టి వేశారు. కోర్టు ఆదేశాలు లిఖితపూర్వకంగా రావాల్సి ఉంది.
2014లో ఇచ్చిన ఓ కామన్ ఆర్డర్లో పేర్కొన్న అంశాలు ఉటంకిస్తూ పెద్దాపురం సబ్ రిజిస్ట్రార్‌ను పెండింగ్‌లో ఉన్న డాక్యుమెంటు రిలీజ్ చేయాలని 2020 నవంబర్ 2న హైకోర్టు ఆదేశించింది. సేల్ సర్టిఫికెట్లో ఉన్న విలువను దేవీ సీ ఫుడ్స్ నుంచి స్టాంప్ డ్యూటీగా కట్టించుకొని డాక్యుమెంట్ రెండు వారాల్లోగా రిలీజ్ చేయాలని హైకోర్టు సింగిల్ బెంచ్ స్పష్టం చేసింది. ఈ ఆదేశాలు వ్యతిరేకిస్తూ ఏపి రెవెన్యూ స్టాంప్స్, రిజిస్ట్రేషన్ విభాగం ముఖ్య కార్యదర్శి డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. దాఖలు చేసిన రిట్ అప్పీలు 2014 జనవరి 24న జారీ చేసిన కామన్ ఆర్డర్‌కు లోబడిన అంశమేననీ, కామన్ ఆర్డర్ కన్సెంట్ (ఇరు పక్షాల అంగీకారం) ఆర్డర్ కావడంతో ఈ పిటిషన్లో జోక్యం చేసుకోబోమంటూ జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్ల ధర్మాసనం 2021 మార్చి 3న అప్పీలు కొట్టి వేసింది. దీంతో రిజిస్ట్రేషన్, స్టాంప్స్ విభాగం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.