Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరు పౌరులు మృతి
- నిరసనకారులపై రెచ్చిపోయిన అసోం పోలీసులు
- దర్యాప్తునకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం
గువహతి : అసోంలో పోలీసులు రెచ్చిపోయారు. నిరసనకారులపై తీవ్ర ప్రతాపం చూపారు. వారిపై లాఠీలు ఝుళిపించారు. వారిని ఇష్టమొచ్చినట్టు కొట్టారు. నిరసకారులపై కాల్పులూ జరిపారు. టియర్‌గ్యాస్, రబ్బరు బుల్లెట్లనూ ప్రయోగించారు. దీంతో ఈ హింసాత్మక కాల్పుల ఘటనలో ఇద్దరు పౌరులు మరణించారు. పలువురికి గాయాలయ్యాయి. అలాగే తొమ్మిది మంది పోలీసులు కూడా గాయపడినట్టు అధికారులు వెల్లడించారు. కాగా, ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ హైకోర్టు జడ్జి నేతృత్వంలో దర్యాప్తునకు ఆదేశించింది. దర్రాంగ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకున్నది. దీంతో ఆక్రమణలకు వ్యతిరేకంగా జిల్లా యంత్రాంగ, పోలీసులు నిర్వహించిన డ్రైవ్‌పై నిరసనకారులు చేపట్టిన కార్యక్రమం హింసాత్మకంగా మారింది.
800 కుటుంబాలను ఖాళీ చేయించిన అధికారులు
దర్రాంగ్ జిల్లాలోని ధోల్పూర్ గోరుఖుతి గ్రామంలో చేపట్టిన డ్రైవ్‌లో భాగంగా సోమవారం నుంచి అధికారులు 800 కుటుంబాలను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. దీంతో దాదాపు 5000 మంది నిరాశ్రయులయ్యారు. తూర్పు బెంగాల్‌కు చెందిన ఒక వర్గం ప్రజలు అధికంగా ఉండే ఈ ప్రాంతంలో అగ్రికల్చర్ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యకు పూనుకున్నది. కాగా, ప్రాజెక్టు పేరుతో తమను అక్కడి నుంచి అధికారులు తరలించడంపై స్థానికుల్లో ఆగ్రహం తెప్పించింది. దీంతో ఈ చర్యకు వ్యతిరేకంగా వారు ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు రైఫిల్స్, లాఠీలతో భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది. అది కాస్తా హింసాత్మకంగా మారింది. '' తొమ్మిది మంది పోలీసులు గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించాం. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నది'' అని పోలీసు అధికారి సుశాంత విశ్వ శర్మ తెలిపారు.
స్థానికుడిపై పోలీసు ప్రతాపం
కాగా, ఈ ఘటనలో ఒక వ్యక్తిపై పోలీసులు తీవ్రంగా విరుచుకుపడి దాడి చేసిన ఘటన సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారింది. కెమెరా సమక్షంలోనే పోలీసులు సదరు వ్యక్తిపై రెచ్చిపోయారు. ఈ ఘటనపై సదరు పోలీసు అధికారిని ప్రశ్నించగా.. తాను ఆ సమయంలో అక్కడ లేననీ, దీనిపై తర్వాత గుర్తించి పరిస్థితిని అంచనా వేస్తానని చెప్పారు.
నాకు సంతోషంగా ఉన్నది : అసోం సీఎం
దర్రాంగ్‌లో స్థానికులను ఖాళీ చేయించే ప్రత్యేక డ్రైవ్ హింసాత్మకంగా మారినప్పటికీ అసోం సీఎం హిమంత విశ శర్మ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. 800 కుటుంబాలను సిపాఘర్ నుంచి తరలించి, ఒక మతానికి చెందిన నాలుగు ప్రార్థనా మందిరాలను కూల్చి 4500 బిఘాల స్థలాన్ని క్లియర్ చేసినందుకు దర్రాంగ్ జిల్లా యంత్రాంగాన్ని, అసోం పోలీసులను అభినందించారు. ఇందుకు గానూ తాను సంతోషంగా ఉన్నానని తెలుపుతూ ట్వీట్ చేశారు.