Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 15 ఏండ్ల బాలికపై 9 నెలలుగా సామూహిక లైంగికదాడి
- 24 మంది అరెస్టు, అదుపులో ఇద్దరు మైనర్లు
ముంబయి : మానవత్వానికి మాయని మచ్చ తెచ్చే విధంగా మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఒక ఘోరం వెలుగుచూసింది. 15 ఏండ్ల బాలికపై 30 మందికి పైగా మానవ మృగాలు 9 నెలలుగా పైగా సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. బాధితు రాలు తాజాగా పోలీసులను ఆశ్రయించడంతో ఈ పైశాచిక ఘటన వెలుగులోకి వచ్చింది. 33 మంది తనపై లైంగికదాడికి పాల్పడ్డారని బాధిత బాలిక బుధవారం పోలీసులకిచ్చిన తన ఫిర్యాదులో పేర్కొంది. వారిలో ఇప్పటి వరకు 24 మంది అరెస్టు చేశారని, మరో ఇద్దరు ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు గురువారం తెలిపారు. ఈ కేసుపై విచారణ చేసేందుకు అసిస్టెంట్ కమిష నర్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటుచేశారు. చిత్రీకరించిన వీడియోతో బ్లాక్ మెయిల్ చేసి, బెదిరించి నిందితులు తనపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. అరెస్టైన వారిని కోర్టులో ప్రవేశపెట్టగా, న్యాయస్థానం వారికి ఈనెల 29 వరకు పోలీస్ కస్టడీ విధించింది. ఈ లైంగికదాడి ఘటనపై తీవ్ర ప్రజాగ్రహం వ్యక్తమవుతోంది.
వీడియోతో బ్లాక్మెయిల్..
నిందితులు తనపై ఈ ఏడాది జనవరి 29 నుంచి సెప్టెంబర్ 22 వరకు పలుమార్లు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొందని తూర్పు రీజియన్ అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ దత్తాత్రేయ కరలే పేర్కొన్నారు. ఈ ఘటనలో బాధితురాలి స్నేహితుడు ప్రధాన నిందితుడి గా ఉన్నాడు. ఈ ఏడాది జనవరిలో ఆమెపై లైంగికదాడికి పాల్పడడంతో పాటు దాని వీడియో చిత్రీకరించాడు. ఆ వీడియోతో బెదిరింపులకు పాల్పడి పలు మార్లు అత్యాచారానికి ఒడిగట్టారు. వీడియోను అతను తన స్నేహితులు, ఇతర పరిచయస్తులకు కూడా షేర్ చేయడంతో వారు కూడా దాన్ని వినియోగించి బ్లాక్ మెయిల్‌కు దిగి అత్యాచారం చేశారు. థానే జిల్లాలోని దోంబివిలీ, బద్లాపూర్, ముర్బాద్, రబాలే పట్టణాల్లో ప్రాంతాల్లో పలుమార్లు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారని దత్తాత్రేయ పేర్కొన్నారు. బాధితురాలు బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. లైంగికదాడికి పాల్పడిన వారందరికీ బాధిత బాలిక తెలిసిన అమ్మాయే అని పోలీసులు తెలిపారు.