Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశ ప్రజలకు ఎస్కేఎం విజ్ఞప్తి
- మేముసైతం.. అంటున్న బ్యాంకింగ్ సంఘాలు
- మధ్యప్రదేశ్‌లో కేంద్ర మంత్రులు తోమర్, సింథియాలను అడ్డుకున్న రైతులు
న్యూఢిల్లీ : మోడీ సర్కార్‌కు వ్యతిరేకంగా ఈ నెల 27న జరిగే చారిత్రాత్మక భారత్ బంద్‌లో ప్రతి పౌరుడూ పాల్గొనాలని దేశ ప్రజలకు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కెేఎం) విజ్ఞప్తి చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థను కార్పొరేట్ స్వాధీనం చేసుకోవడం, జాతీయ ఆస్తులను, ఫెడరలిజాన్ని, ప్రజాస్వామ్యా న్ని, దేశ సమైక్యతను కాపాడుకునేందుకు రైతుల నిరసనలు జాతీయ ఉద్యమానికి కేంద్రంగా ఉన్నా యని ఎస్కేఎం పేర్కొంది. భారతీయులందరూ ఈ ఉద్యమంలో పాల్గొనాలనీ, భారత్ బంద్‌ను విజయ వంతం చేయాలని విజ్ఞప్తి చేసింది. బంద్ రోజున రైతులకు కార్మికులు, వ్యాపారులు, రవాణాదారులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులు, యువత, మహిళలు, అన్ని సామాజిక ఉద్యమకారులు సంఘీభావం తెలియచేయాలని ఎస్కేఎం ప్రత్యేకంగా కోరింది. ''మేం అన్ని రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాల నూ కోరుతున్నాం. మా గత పిలుపులను వీరిలో చాలా మంది ఆమోదించారు. ఉద్యమానికి మద్దతు ఇచ్చే తీర్మానాలను చేశారు. ఈ భారత్ బంద్‌కూ తమ మద్దతును అందించాలనీ, ప్రజాస్వామ్యం, సమాఖ్య సూత్రాలను కాపాడాలనే తపనతో రైతుల పక్షానా ఉండాలని మేము పిలుపునిస్తున్నాం'' అని ఎస్కెేఎం తెలిపింది. గతంలో ఎస్కేఎం ఇచ్చిన బంద్ పిలుపుకు మద్దతు ఇవ్వడానికి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చాయని గుర్తు చేసింది.
మేము సైతం...
27న జరిగే భారత్ బంద్‌కు బ్యాకింగ్ రంగ సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీఓసీ), ఆలిండి యా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ), బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఈఎఫ్ఐ) తదితర బ్యాంకింగ్ రంగ సంఘాలు భారత్ బంద్‌కు మద్దతు ఇచ్చాయి. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులతో మళ్లీ చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయా సంఘాలు కోరాయి.
కేంద్ర మంత్రులు రైతుల నిరసనల సెగ
మధ్యప్రదేశ్‌లో కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, జ్వోతి రాధిత్య సింథియాలకు రైతుల నిరసనల సెగ తగిలింది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్‌లోని వివిధ ప్రాంతాల్లో బీజేపీ, దాని మిత్రపక్ష పార్టీల నాయకులకు వ్యతిరేకంగా స్థానిక నిరసనలు గురువారం కూడా కొనసాగాయి. కాగా, మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర పౌర విమానయాన మంత్రి జ్వోతి రాధిత్య సింథియాలను రైతులు అడ్డుకున్నారు. కేంద్ర మంత్రుల పర్యటనకు వ్యతిరేకంగా రైతులు నల్ల జెండాలతో నిరసనను చేపట్టారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేంద్ర మంత్రి కాన్వారులోని వాహనాలపైకి ఎక్కి నల్ల జెండాలు చేబూని నినాదాలిస్తూ నిరసన తెలుపుతున్న యువ రైతులపై బీజేపీ కార్యకర్తలు దాడికి దిగారు. తరువాత పోలీసులు రైతులను అదుపులోకి తీసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 151 కింద కేసులు నమోదు చేశారు.
రైతు ఉద్యమానికి మద్దతుగా భారీ ఆందోళనలు
రైతుల ఉద్యమానికి మద్దతుగా, 27 భారత్ బంద్ విజయవంతానికి దేశంలోని వివిధ ప్రాంతాల్లో సమీకరణలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌లో రెండు రోజుల కిసాన్ జాగతి అభియాన్ ప్రారంభమైంది. ఈ అభియాన్‌లో రెండు రోజుల పాటు ఎనిమిది కిసాన్ సమ్మేళనాలు నిర్వహించనున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లోని ఘూర్పూర్లో జరిగిన కిసాన్ మహా పంచాయితీలో రైతుల ఉద్యమ డిమాండ్లకు పెద్ద ఎత్తున మద్దతు లభించింది. బుందేల్‌ఖండ్, మధ్యప్రదేశ్ సరిహద్దులో ఉన్న తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని గంగా-జమున బెల్ట్‌లోని ట్రాన్స్-జమున ప్రాంతంలో జరిగిన భారీ ప్రదర్శనలో వేలాది మంది రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మికులు భాగస్వామ్యం అయ్యారు. హర్యానాలోని కురుక్షేత్రలో ఇస్మాయిలాబాద్లో కిసాన్ మహా పంచాయత్ జరిగింది. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఒరిస్సాతో పాటు ఇతర రాష్ట్రాలలో సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. గురువారం పాట్నాలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఉత్తరాఖండ్‌లోని రుద్రపూర్ నుంచి టిక్రి బోర్డర్ వరకూ రైతు సత్పాల్ సింగ్ తుక్రాల్ చెప్పులు లేకుండా నడిచారు. మూడు నల్ల చట్టాలను రద్దు చేసే వరకు తాను చెప్పులు లేకుండా నడుస్తానని తుక్రాల్ ప్రతిజ్ఞ చేశాడు.