Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారమవుతున్న తల్లిదండ్రులు
- సమాజంలో పెరుగుతున్న ఆస్తి.. అత్యాశ..
- బిడ్డల్ని ప్రాణంలాచూసుకున్నా..
- ముసలితనంలో వేధింపులు
నవమాసాలు మోసిన కన్నతల్లిని..బిడ్డకు వెన్నుతట్టి ధైర్యం నింపే తండ్రిని..వృద్ధాప్యదశకు చేరుకున్న తర్వాత నిరాదరణే మిగులుతున్నది. ఆస్తి పాస్తులున్నన్నాళ్లు వాటిని ఎప్పుడు దక్కించుకుందామనే భావనే తప్ప..పండుటాకుల్లా చివరిదశలో ఉన్న ఆ ముసలితలిదండ్రులకు అంతిమదశలో అడుగడుగునా వేధింపులే. ఇంట్లో నుంచి తరిమికొట్టిన బిడ్డలు కొందరైతే...అడ్డొచ్చారని అతి కిరాతకంగా చంపేస్తున్న ఘటనలు కోకొల్లలు. 14 ఏండ్ల కింద వృద్ధుల ప్రయోజనాలను పరిరక్షించటానికి అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ మెయింటెనెన్స్ యాక్ట్ తెచ్చినా...వారికి అడుగడుగునా అన్యాయమే.
న్యూఢిల్లీ: సమాజం వేగంగా మారుతున్నది. అంతే వేగంగా కుటుంబాలు..బంధాలు..అనుబంధాలు తెగిపోతున్నాయి. నేడు సామాజిక విలువలు గతితప్పుతున్నాయి. తాము తిన్నా తినకపోయినా అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డలే..తెగబడటానికి సిద్ధమైపోతున్నారు. ఆ ముసలివాళ్ల వద్ద ఉన్న ఆస్తి,డబ్బును దక్కించుకునే ప్రయత్నాలు పెరిగిపోతున్నాయి. ఇండ్లనుంచి సొంతవాళ్లే బహిష్కరిస్తే..కోర్టులను కొందరు ఆశ్రయిస్తే..మరికొందరు దిక్కుమొక్కులేని వాళ్లుగా అతి దుర్భరబతుకిలీడుస్తున్నారు.
క్షీణిస్తున్న సామాజిక విలువలు
మోడీ పెట్టుబడిదారీ విధాన వికృత రూపమే క్షీణిస్తున్న సామాజిక విలువలు. ఆస్తి అత్యాశతో కొడుకు,కోడలు, కుమార్తె,అల్లుడు, వీరికి తోడు బంధువర్గాలూ చరమాంకంలో ఉన్న తల్లిదండ్రులను అగౌరవపరుస్తున్న సంఘటనలు ఎక్కువవుతున్నాయి. దీనికనుగుణంగా చట్టపరమైన మార్గాన్ని అవలంబించిన పెద్దల కేసులు పెరుగుతున్నాయి. కానీ మధ్య తరగతిలో ఉన్న వృద్ధులు మాత్రం మా బతుకులింతేలేనంటూ కాలాన్ని నెట్టుకొస్తున్నారు.
ఇదేం తీరు..
వృద్ధ తల్లిదండ్రులు కానీ.. ముసలితనంతో బాధపడుతున్న సభ్యులు ఉంటే... కుటుంబాలలో భారంగా భావిస్తున్నారు. తాము సొంతంగా సంపాదించుకున్న ఇండ్ల నుంచి తరిమేస్తున్నారు. మరోవైపు బాగా చదువుకున్న కొడుకులు,కోడళ్లు వారిని వృద్ధాశ్రమాలకు తరలిస్తున్నారు. దీంతో ఎన్నడూ లేనివిధంగా వృద్ధాశ్రమాలు పుట్టుకొస్తున్నాయి.
సుప్రీం ఆందోళన...
కుటుంబాల్లో నిస్సహాయంగా మారుతున్న వృద్ధుల పరిస్థితిపై సుప్రీంకోర్టు కూడా ఆందోళన వ్యక్తం చేసింది. వృద్ధుల ప్రయోజనాలను కాపాడటానికి 2007 లో రూపొందించిన 'తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్స్ మెయింటెనెన్స్ యాక్ట్' నిబంధనలను కచ్చితంగా పాటించాలని 2018 డిసెంబరులో అత్యున్నత న్యాయస్థానం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
అత్యున్నత న్యాయస్థానం (డా. అశ్వని కుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా )రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం.. జీవించే హక్కుకు విస్తృత అర్థాన్ని అందించాలని అంగీకరించింది. అనేక హక్కులతో ఏకీభవిస్తున్నామని కోర్టు చెప్పింది, కానీ ప్రస్తుతం మూడు ముఖ్యమైన రాజ్యాంగ ప్రాథమిక హక్కుల గురించి ఆందోళన చెందుతున్నామని వ్యాఖ్యానించింది.
కొడుకులు , కుమార్తెలు, కోడళ్లు, అల్లుళ్ల ప్రవర్తన కారణంగా ఇంటి సరిహద్దు గోడ లోపల ఉండాల్సిన వివాదాలు కాస్త కోర్టులను చేరుకుంటున్నాయి. మారుతున్న పిల్లల ప్రవర్తనతో వృద్ధులైన తల్లిదండ్రులు చెప్పుకోలేనంతగా బాధలు అనుభవిస్తున్నారు. దీనికి తోడు ఇండ్ల నుంచి తరిమికొట్టడం వంటి తీవ్రమైన చర్యలు తీసుకోవటానికి బిడ్డలు వెనకాడకపోవటం పట్ల పౌరసంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.
ఏకైక సంతానం ఉన్నా....
ఆశిశ్ దలాల్ అనే వ్యక్తికి వృద్ధతలిదండ్రులున్నారు. ఏకైక సంతానం కావటంతో అతి గారాబంగా పెంచారు. పెండ్లి చేశారు. కోడలు వచ్చాక..ముసలిదంపతులకు వేధింపులు ఎక్కువయ్యాయి.90 ఏండ్ల తండ్రి,89 ఏండ్ల తల్లికి ఎన్నోవిధాలుగా హింసించారు. సొంత ఇంటిలో జరుగుతున్న పరాభ వాన్ని దిగమింగుకోలేకపోయాడు. ఆ వయసులో ఏం చేయాలో తెలియక..తండ్రి వినోద్ రామన్లాల్ దలాల్ బాంబే హైకోర్టులో పిటిషన్ వేశాడు. నెల రోజుల్లోగా తండ్రి ఇంటిని ఖాళీ చేయాలని కొడుకు ఆశిశ్ను బాంబే హైకోర్టు ఆదేశించింది. పుట్టిన ప్పటినుంచి యుక్తవయస్సు వరకు, ఆ తర్వాత ఉద్యోగం వచ్చేదాకా పోషించాక వయసును లెక్కచేయకుండా, అండగా ఉండకపోవటం ఘోరమని కోర్టు వ్యాఖ్యానించింది. కర్నాటకలో తన వృద్ధ తలిదండ్రులపై చేయి ఎత్తిన సంఘనపై అక్కడి హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. జీవితం చివరిదశలో ఉన్న వారిని గౌరవంగా చూడాలని కోర్టు వ్యాఖ్యానించింది.
90 రోజుల్లో కేసును పరిష్కరించాలి
వృద్ధుల ప్రయోజనాల కోసం నిర్వహణ ట్రిబ్యునల్,అప్పిలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటు కోసం చట్టంలో ఒక నిబంధన ఉన్నది. ఈ ట్రిబ్యునల్స్ ఒక వృద్ధ పౌరుడి ఫిర్యాదును 90 రోజుల్లోపు పరిష్కరించాలి. అలాంటి సీనియర్ సిటిజన్ యొక్క బిడ్డ లేదా బంధువు నెలకు పది వేల రూపాయల వరకు చెల్లించాలని నిర్వహణ ట్రిబ్యునల్ ఆదేశించవచ్చు.
ఒకవేళ వృద్ధులైన తల్లిదండ్రులు , ఇతర వృద్ధ కుటుంబ సభ్యుల ఇంటిని దుర్వినియోగం చేయడం, నిర్లక్ష్యం చేయడం లాంటి ఘటనలు జరిగితే... వారి ఆస్తిని స్వాధీనం చేసుకోవడానికి కూడా వెనకాడొద్దని కేంద్రం చట్టాన్ని రూపకల్పన చేసింది.
అవగాహనే కీలకం..
వృద్ధుల ప్రయోజనాలను కాపాడటంలో ఈ చట్టం కొంత మేరకు విజయవంతమైంది, అయితే మెట్రో మహానగరాలు, పట్టణాల్లోనే కాకుండా దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని వృద్ధులకు ఈ చట్టం గురించి పెద్దగా అవగాహన లేదని తెలుస్తోంది. కేంద్రంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి. ఆస్తిపై అత్యాశతో వృద్ధుల జీవితాన్ని నరకంలా మార్చేస్తున్నారు. సుమారు 14 ఏండ్లయినా ఇంతవరకూ ఈ చట్టం ఉన్నదన్న విషయం తెలియని వృద్ధ దంపతులెందరో నానా అవస్థలు పడుతున్నారు. ఈ చట్టం గురించి అవగాహన కల్పించడానికి ఒక ప్రచారాన్ని నిర్వహించాలి.