Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీంలో కేంద్ర ప్రభుత్వ వాదన
- పాలనాపరమైన చిక్కులున్నాయంటూ సాకులు
న్యూఢిల్లీ : కుల గణన గురించి ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మోడీ ప్రభుత్వం గురువారం సుప్రీం కోర్టులో దానికి రివర్స్‌లో తన వాదన వినిపించింది. 2021 జనాభా లెక్కల్లో ఓబీసీ జనగణనను చేర్చాలని ఎలాంటి ఆదేశం ఇవ్వొద్దని అత్యున్నత న్యాయస్థానాన్ని అది కోరింది. జనగణనతో పాటే కుల గణన చేపట్టేలా జనాభా లెక్కల సేకరణ విభాగాన్ని ఆదేశించాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అభ్యర్థనను వ్యతి రేకిస్తూ కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వశాఖ గురువారం ఈ మేరకు ఒక అఫి డవిట్ను దాఖలు చేసింది. జనగణనతోబాటు ఓబీసీ కులాలకు సంబంధించిన సమాచారం సేకరించడం సాధ్యం కాదని చెప్పింది. అలాగే ఓబీసీ జనాభా లెక్కల సేకరణ పాలనా పరంగా క్లిష్టతరమైనది, కచ్చితత్వానికి సంబంధించి ఇబ్బం దులెదురవుతాయని చెప్పింది. 2020 జనవరి7న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్లో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన సమాచారం తప్ప ఇతర ఏ కులాలకు సంబంధించిన సామాజిక, ఆర్థిక సమాచారాన్ని సేకరించరాదని పేర్కొన్న విషయా న్ని కేంద్రం సుప్రీంకు తెలియజేసింది. కాబట్టి కుల గణనకు సంబంధించి జనాభా సేకరణ విభాగానికి ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా, అది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడమే అవుతుందని వాదించింది. ఇది సరైన పద్ధతి అనిపించుకోదని కూడా పేర్కొంది. కేంద్ర ప్రభు త్వం తన వైఖరిని సమర్థించుకోవడానికి రకరకాల వాదనలు ముందుకు తెచ్చింది. ఇది ఎస్సీ, ఎస్టీలకు చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం రూపొందించబడిన విధాన నిర్ణయం కాబట్టి ఇందులో కోర్టుల జోక్యం కూడదని వాదించింది. 2011 జనాభా లెక్కల సమయంలో చేపట్టిన కులాల సామాజిక, ఆర్థిక సమాచార సేకరణలో గందరగోళం వల్ల ఆ డేటా ఇప్పటికీ బయటకు రాలేదని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన జనాభా లెక్కల సేకరణకు మాత్రమే రాజ్యాంగంలో ఆదేశించబడింది, ఓబీసీ, బీసీసీల జనాభా గణన గణాంకాలను అందించా లని రిజిస్ట్రార్ జనరల్, జనాభా లెక్కల కమిషనర్‌కు ఆదేశించాలని రాజ్యాంగం పేర్కొనలేదని వాదిం చింది. మలబార్లో 40 రకాల కులాలు వున్నాయి. వాటిని ఎలా గుర్తిస్తారు? 'పొవార్', 'పవార్' కులాల గురించి నమోదు చేసేటప్పుడు ఒబిసి కేటగిరిలో ఉన్న పొవార్ లను పవార్‌గా పేర్కొంటే కొంపలంటుకుంటాయి. అలాగే ఒక రాష్ట్రంలో ఎస్సీలుగా ఉన్నవారు మరో రాష్ట్రంలో ఓబీసీ జాబితాలో ఉంటారు. అంటూ కులగణన వల్ల ఎదురయ్యే చిక్కులను ఏకరువుపెట్టింది. కేంద్రంలో అందుబాటులో ఉన్న మహారాష్ట్రలోని ఓబీసీల లెక్కల గురించి సమాచారం కోరుతూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో చేసిన అభ్యర్థనను సైతం కేంద్రం వ్యతిరేకించింది. మహారాష్ట్ర రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ (ఎంఎస్సీబీసీ) ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సామాజిక-ఆర్థిక, కుల గణనను నిర్వహించాలని మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఈ మేరకు ఒక తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపింది. కానీ, కేంద్రం ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటూ వస్తున్నది.
కుల గణనపై బీజేపీ మిత్రపక్షాలు సైతం డిమాండ్
2021 జనాభా లెక్కల సేకరణలో భాగంగా కుల గణన చేపట్టాలని ప్రతిపక్షాలే కాదు, బీజేపీ మిత్ర పక్షాలు సైతం డిమాండ్ చేస్తున్నాయి. బీహార్‌లో బీజేపీ మిత్రపక్షమైన జేడీ(యూ), ఆర్జేడితో కలసి ఇప్పటికే కేంద్రంపై ఒత్తిడి తెచ్చింది. ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీలు కుల గణన చేపట్టాల్సిందేనని తీర్మానాలు ఆమోదించాయి. అంతెందుకు 2019 ఎన్నికలకు ముందు మోడీ ప్రభుత్వం కులగణన చేపడతామని హామీ ఇచ్చింది. 2001లో యుపి ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో రాజ్‌నాథ్ సింగ్ సామాజిక న్యాయం కోసం ఒబిసి జనాభా లెక్కల సేకరణకు తాము సిద్ధమేనన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని బిజెపి తుంగలో తొక్కడానికి కారణం మరో నాలుగు మాసాల్లో కీలకమైన యుపి అసెంబ్లీ ఎన్నికలు రానుండడమేనని యోగేంద్ర యాదవ్ వంటి సామాజిక కార్యకర్తలు పేర్కొంటున్నారు. రిజర్వేషనకు బిజెపి వ్యతిరేకం కాబట్టి కుల గణను అది వ్యతిరేకిస్తున్నదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు కుల గణనను కనుక చేపడితే బిసిలకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చేసిన అన్యాయం చర్చకు వస్తుందని, ఈ చర్చ సమాజ్‌వాది వంటి పార్టీలకు లబ్ధి చేకూర్చుతుందని బిజెపి భయపడుతోందని వారు పేర్కొంటున్నారు. సోషల్ ఇంజినీరింగ్ పేరుతో చిన్న చిన్న కులాలను బిసిల జాబితాలో చేర్చి ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్న బిజెపి, కుల గణనను వ్యతిరేకించడానికి మరో కారణం కులాల వాదన ముందుకొస్తే మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలన్న దాని అసలు లక్ష్యమే దెబ్బతినిపోతుంది.