Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్నదాత ఆందోళనకు అమెరికాలో భారతీయుల మద్దతు
న్యూఢిల్లీ : రైతు వ్యతిరేక నల్ల చట్టాలు రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు ఆందోళన పది నెలలు కావస్తున్న నేపథ్యంలో సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పిలుపు ఇచ్చిన సెప్టెంబర్ 27న భారత్ బంద్‌కు ఐదు వామపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి. సెప్టెంబర్ 27న భారత్ బంద్‌కు మద్దతివ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు సీతారాం ఏచూరి (సీపీఐ(ఎం)), డి రాజా (సీపీఐ), దేబబ్రత బిశ్వాస్ (ఫార్వర్డ్ బ్లాక్), మనోజ్ భట్టాచార్య (ఆర్ఎస్పీ), దీపాంకర్ భట్టాచార్య (సీపీఐ (ఎంఎల్) లిబరేషన్) సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు. భారత్ బంద్ విజయవంతానికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పార్టీల కమిటీలు చురుకుగా పని చేయాలని పిలుపునిచ్చారు.
మా గోడు పట్టించుకోండి : బైడెన్‌కు టికాయత్ విజ్ఞప్తి
తమ గోడు పట్టించుకోవాలంటూ అమెరికా అధ్యక్షుడికే రైతు నేత టికాయిత్ విజ్ఞప్తి చేశారు. అమెరికా పర్యటనలో వున్న ప్రధాని నరేంద్రమోడీ ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీకానున్నారు. అయితే మోడీని కలిసిన సమయంలో భారత్‌లో కొనసాగుతున్న రైతు ఆందోళన గురించి మాట్లాడాల్సిందిగా బైడెన్‌ను టికాయత్ కోరారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు వెళ్లిన నేపథ్యంలో యూఎస్‌తోపాటు ఇతర దేశాలలోని భారతీయ ప్రవాసులు రైతుల ఆందోళనకు మద్దతు ఇస్తున్నారు. గత కొన్ని నెలలుగా ర్యాలీలు, స్లీప్-అవుట్లతో పాటు ఇతర నిరసనలను నిర్వహిస్తున్నారు. రైతు ఉద్యమానికి సంబంధించిన వివిధ హ్యాష్‌ట్యాగ్‌లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. మరోవైపు ప్రధాని మోడీ అమెరికా పర్యటనను వ్యతిరేకిస్తూ.. రైతులకు మద్దతుగా ఆందోళన చేపట్టారు. ఎన్ఆర్ఐ ఫర్ ఫార్మర్స్ పేరుతో శుక్రవారం వాషింగ్టన్ డీసీలో ఆందోళన జరిగింది.
వ్యాఖ్యలు వెనక్కి తీసుకో...లేదంటే ఘెరావ్ చేస్తాం
ఆందోళన చేస్తున్న రైతులపై కర్నాటక ముఖ్యమంత్రి ఎస్ఆర్ బొమ్మై అవమానకరమైన వ్యాఖ్యలను నిరసిస్తూ కర్నాటక రైతులు అల్టిమేటం జారీ చేశారు. రైతుల పట్ల ముఖ్యమంత్రి చేసిన అవమానకర వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలనీ, లేదంటే సొంత నియోజకవర్గంలో సీఎంను ఘెరావ్ చేస్తామని ప్రకటించారు.