Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విచారణ జరపాలి
- మోడీ అమెరికా పర్యటనతో పెట్టుబడులు రావు
- దేశంలో ఉన్న కంపెనీలే మూసి వేస్తున్నారు
- అసోం ఘటనపై దర్యాప్తు జరపాలి : మీడియాతో సీతారాం ఏచూరి
న్యూఢిల్లీ : పిఎం కేర్స్ ఫండ్ ఒక కుంభకోణ మని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. శుక్రవారం నాడిక్కడ సీపీఐ(ఎం) కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 'పీఎం కేర్స్ ఫండ్ ఒక పెద్ద మోసం. ఇదొక పెద్ద స్కామ్. కేంద్ర ప్రభుత్వ చిహ్నంతో పీఎం కేర్స్ ఫండ్ ప్రారంభమైంది. ఈ స్కీమ్‌కు కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం వెబ్సైట్ సమకూర్చింది. ప్రభుత్వ రంగ సంస్థలు సహా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఉత్తర్వుల ద్వారా ఒకరోజు వేతనం తీసుకు న్నారు. ఒకవేళ ఇది ప్రయివేటు ఫండ్ అయితే ఉత్తర్వులు ఎందుకు ఇచ్చినట్టు? ప్రైయివేట్ ఫండ్ అయితే ఎంపీ లాడ్స్ ఫండ్ ఎలా జమ చేసినట్టు? ఎంపీల వేతనాలు ఎందుకు కోత విధించి జమచేసినట్టు? వాస్తవానికి ఇది లూటీ చేసేందుకు ఉపయోగించారు. ఈఫండ్ మొత్తం పారదర్శకతతో ఉండాలి. జవాబుదారీ తనం ఉండాలి. ఆడిట్ జరగాలి. తగిన సమ యంలో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుంటుం దని విశ్వసిస్తున్నాం' అన్నారు. 'ప్రధాన మంత్రి అమెరికాలో పెట్టుబడుదారులను కలవడం ద్వారా పెట్టుబడులు వస్తాయనుకోలేం. దేశానికి పెట్టుబడులు రావటం లేదని ఆర్బీఐ డేటా స్పష్టం చేస్తుంది. ఆర్బీఐ డేటా ప్రకారం పెట్టు బడులు తగ్గాయి. దేశంలో పరిస్థితులు అను కూలంగా లేవని పెట్టుబడుదారులు అనుకుం టున్నారు. మౌలిక వసతులు వంటి ఇతర సౌకర్యాలు లేవని భావిస్తున్నారు. దేశంలో అనేక ఉత్పత్తి సంస్థలు మూతపడుతున్నాయి. మూడు పెద్ద ఆటోమొబైల్ సంస్థలు జనరల్ మోటర్స్, ఫోర్డ్ మోటర్స్, హార్లీ డేవిడ్సన్ తదితర సంస్థలు మూతపడ్డాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నప్పుడు ఆయన ప్రధాని మోడీకి ఫోన్ చేస్తే రాయితీలు ఇచ్చారు. కానీ ఆయా సంస్థలన్ని మూసివేతకు గురయ్యాయి. పెట్టుబడులు పెట్టే వాతావరణం లేనందునే ఈ పరిస్థితి తలెత్తింది.
కొత్తగా వస్తున్నప్పటికీ, పాత సంస్థలు మూతపడుతు న్నాయి. అది వాస్తవం..' అని పేర్కొన్నారు. అసోంలో పోలీసుల చేసిన బహిరంగ కాల్పుల సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామనీ, బలవంతంగా ప్రజలను ఖాళీ చేయించటం, వారిపై కాల్పులు జరపడం ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అసోం ప్రజలపై యుద్ధం ప్రకటించారని, అందులో భాగంగానే ఇలా బహిరంగంగా కాల్పులు జరిపారని విమర్శించారు. మతపరమైన ఏకీకరణకు బీజేపీ ప్రయత్నిస్తుందని, అందులో భాగంగానే మైనారిటీ కమ్యూనిటీని లక్ష్యంగా చేసుకున్నారని విమర్శించారు. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని, అసోం ప్రజలపై యుద్ధం ఆపాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఈ ఘటనలో దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు.