Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తల్లి కల్పకం ఏచూరి మరణం
- భౌతిక కాయాన్ని పరిశోధనల కోసం దానం
న్యూఢిల్లీ : సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి మాతృవియోగం జరిగింది. అనారోగ్య కారణాలతో సీతారాం ఏచూరి తల్లి కల్పకం ఏచూరి (89)ని శనివారం ఉదయం గురుగ్రామ్‌లోని మేదంతా ఆస్సత్రిలో చేర్చారు. సాయంత్రం 4 గంటల సమయంలో ఆమె మరణించారు. పరిశోధనల నిమిత్తం ఆమె భౌతిక కాయాన్ని ఎయిమ్స్ ఆస్పత్రికి ఇవ్వాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా కల్పకం ఏచూరి.....మృతి పట్ల సీపీఐ(ఎం) తీవ్ర విచారం వ్యక్తం చేసింది. సీతారాం ఏచూరి, ఆయన కుటుంబ సభ్యులకు సంతాపాన్ని ప్రకటించింది.
కల్పకం ఏచూరి చెన్నైలో 1933 జూన్ 23న పాపయ్యమ్మ, జస్టిస్ కందా భీమశంకరం దంపతులకు జన్మించారు. కందా భీమశంకరం మద్రాస్ హైకోర్టు జడ్జిగా పనిచేసేవారు. ఏచూరి సర్వేశ్వర సోమయాజులును వివాహం చేసుకున్నారు. భర్త సోమయాజులు ఆటోమొబైల్ ఇంజనీరు. వారికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, రెండో కుమారుడు భీమ శంకర్ ఏచూరి (మారుతి ఉద్యోగ్ నుండి పదవీ విరమణ చేశారు). ఆమె సోదరుడు కందా మోహన్ మాజీ ఐఎఎస్, ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు.
అర్థాంతరంగా ఆగిపోయిన చదువును పెళ్లి తర్వాత కూడా కొనసాగించారు. మద్రాసు స్టెల్లా మేరీస్ కాలేజీలో బీఏ ఎకనామిక్స్ ఫైనల్ పరీక్షలు రాస్తున్నప్పుడు కల్పకం నాలుగు నెలల గర్భిణి. బెనారస్ హిందూ యూనివర్శిటీలో పొలిటికల్ సైన్స్, ఉస్మానియా యూనివర్శిటీలో 'ఇండియా అండ్ ద యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్'లో ఎంఫిల్ చేశారు. రీసెర్చ్ స్కాలర్‌గా ఉన్నప్పుడు కూడా ఆమె ఆలిండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ కోసం పని చేశారు. దుర్గాబారు దేశ్‌ముఖ్ రాష్ట్రానికి వచ్చినప్పుడు, హైద్రాబాద్, ఢిల్లీ కేంద్రంగా ఆంధ్ర మహిళా సభ సంస్థను నిర్వహిస్తున్నప్పుడు ఆమెతో పాటు పని చేశారు.
బాల్యం నుంచే సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. స్వాతంత్య్ర సమరయోధురాలు వేముగంటి బొప్మాయమ్మ, అనేక మంది ఇతర కార్యర్తలతో కలసి విద్యార్థి రోజుల నుంచీ పనిచేశారు. ఆ రోజుల్లోనే బాలికలు, మహిళల విద్యావకాశాలను పెంపొందించడంలో సేవలు చేసేవారు. ఉన్నత విద్యను అభ్యసించడానికి మద్రాసు వెళ్లిన ఎంతోమంది పేద విద్యార్థులకు ఆమె పుట్టిల్లు ఆశ్రయం ఇచ్చేది. ఆ ప్రేరణతో వివాహానంతరం కూడా భర్త సహకారంతో కాకినాడలో స్వగహంలోనే దివ్యాంగులైన ఆడపిల్లలకు విద్యావసతి సౌకర్యాలు ఏర్పర్చారు. దివ్యాంగ ఆడపిల్లలకు కూడా కుట్లు, అల్లికలు నేర్పించి వారికి ఆదాయం వచ్చేలా చేశారు. ఆమె తన దుస్తులు తానే స్వయంగా కుట్టుకునేవారు. కల్పకం తల్లిదండ్రులు దుర్గాబాయి దేశ్‌ముఖ్ కుటుంబంతో దగ్గర సంబంధాలుండేవి. దుర్గాబాయి స్థాపించిన ఆంధ్ర మహిళా సభ వ్యవస్థాపక సభ్యురాలుగా ఉన్నారు. ఆనాటి నుంచీ ఆమె గత ఆరు దశాబ్దాలుగా ఆ మహిళా సభతో చాలా సన్నిహితంగా ఉన్నారు. కాకినాడ వికలాంగ బాలికల పాఠశాల, బాల భవన్లకు కన్వీనర్‌గా సేవలు అందించారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు సభ్యురాలిగా, రాష్ట్ర మహిళా మండలి అక్షరాస్యత ఉద్యమం, సంగీత నాటక అకాడెమీ సభ్యురాలిగా, రాష్ట్ర ఎడ్యుకేషన్ సొసైటీ, ఢిల్లీ, ఆంధ్ర వనితామండలి కోశాధికారిగా .. ఇలా ఎన్నో బాధ్యతలు నిర్వహించారు.
దక్షిణాఫ్రికా డర్బన్‌లో జరిగిన సిఒపి-17 (వాతావరణ మార్పులపై సమావేశం) గ్లాస్గో, బ్రిటన్, యుకె, ఫోరెన్స్, ఇటలీ, మలేషియాలో గ్లోబల్ వాటర్ పార్టనర్షిప్, బంగ్లాదేశ్‌లో జరిగిన జాతీయ, అంతర్జాతీయ సమావేశాలకు కల్పకం హాజరయ్యారు. మెక్సికో, యునిఫెమ్, యుఎన్ డెవలప్మెంట్ ఫండ్ ఫర్ ఉమెన్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్వైరన్మెంట్, సార్క్ అండ్ యునెస్కో కాన్ఫరెన్స్ ఆన్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ, బీజింగ్ వర్క్‌షాప్ ఆన్ ఎనర్జీ ఫర్ ఎ బెటర్ లైఫ్, ఉమెన్ అండ్ రూరల్ఎనర్జీ, ఎక్స్పో-2000, హన్నోవర్ వంటి వినూత్న అభ్యాసాలకు అవార్డులు అందుకొన్నారు. పునరుత్పాదక శక్తిలో ఎఐడబ్ల్యుసి తరపున ఆసియా పసిఫిక్ మైక్రో క్రెడిట్ సమ్మిట్ సమావేశం, బంగ్లాదేశ్, 32వ త్రైమాసికంలో ఐఎడబ్ల్యు, కొలంబో, శ్రీలంకలో పాల్గొన్నారు. అఖిల భారత మహిళా మోటార్ ర్యాలీలో గిరి మెమోరియల్ అవార్డును అందుకున్నారు. హిమాలయాల్లో, ఢిల్లీలో జరిగిన ఛారిటీ కార్ ర్యాలీలో పాల్గొన్నారు. ఆమె చేసిన భారతనాట్య ప్రదర్శనలకు 80కి పైగా పతకాలు అందుకున్నారు.ఆమె ఇటీవలి (జూలై 15న) దుర్గాబారు దేశ్‌ముఖ్ అవార్డును అందుకున్నారు.