Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జై జవాన్, జై కిసాన్ నినాదాల హౌరు
- వాషింగ్టన్ డిసిలో వైట్ హౌస్, ఐక్య రాజ్య సమితి భవనం వద్ద నిరసనలు
- అమెరికా, ఇంగ్లాండ్, ఐర్లాండ్, కెనడాలో ఆందోళనలు
న్యూఢిల్లీ : రైతు ఉద్యమానికి ప్రపంచంలోని వివిధ దేశాల్లో ప్రవాస భారతీయులు, ఇతర దేశాల రైతులు, రైతు సంఘాల నుంచి మద్దతు, సంఘీభావం వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో అక్కడ వాషింగ్టన్ డిసిలో వైట్‌హౌస్ ఎదుట ప్రవాస భారతీయులు ఆందోళన చేపట్టారు. ''మేము రైతులను ఆదుకుంటాము, రైతులు లేకపోతే, ఆహారం లేదు, జై జవాన్, జై కిసాన్, భారతదేశం రైతులను అణిచివేస్తోంది'' వంటి ప్లకార్డులను చేబూని నినాదాల హౌరెత్తించారు. అలాగే ప్రధాని మోడీ అమెరికా పర్యటనకు సందర్భంగా నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాల్లో కూడా రైతుల మద్దతుదారులు జెండాలతో హాజరయ్యారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి భవనం దగ్గర నిరసనలు చేపట్టారు. నిరసన తెలుపుతున్న రైతులకు మద్దతుగా కాలిఫోర్నియాలోని శాక్రమెంటోలో కిసాన్ కార్ ర్యాలీ నిర్వహించారు. ఇంగ్లాండ్‌లోని లండన్, బర్మింగ్ హామ్, డబ్లిన్, గ్లాస్గోలలో సంఘీబావ నిరసనలు చేపట్టారు. ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో జరిగిన నిరసనతో పాటు, కెనడాలోని టొరంటోలో రైతులకు మద్దతుగా సంఘీభావ యాత్ర జరిగింది.
భారత్ బంద్‌కు మద్దతు
ఎస్కేఎం పిలుపునిచ్చిన సెప్టెంబర్ 27 భారత్ బంద్‌కు మరింత మద్దతు లభిస్తోంది. బంద్ పిలుపుకు వామపక్ష పార్టీలు తమ మద్దతును ఇప్పటికే అందించాయి. ఆర్జేడీ, ఎన్సీపీ, జేఎంఎం, టీడీపీ, డీఎంకె తదితర పార్టీలు కూడా మద్దతును ప్రకటించాయి. రైతులకు మద్దతుగా కేరళలో అధికారం ఎల్డీఎఫ్ హర్తాల్‌కు పిలుపు ఇచ్చింది. భారత్ బంద్‌కు మద్దతు కూడగట్టడానికి గురుగ్రామ్, పాల్వాల్‌లో కాగడాల ప్రదర్శన జరిగింది. జార్ఖండ్‌లో కార్మికుల సంఘాలు బంద్ రోజున బొగ్గు రవాణాను పూర్తిగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి. భారత్ బంద్‌కు మద్దతుగా ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ ప్రకటన విడుదల చేసింది. బీహార్‌లోని కోసి నవ నిర్మాణ మంచ్ భారత్ బంద్‌కు మద్దతు ప్రకటించింది. పంజాబ్, హర్యానా ప్రయివేట్ స్కూల్స్ సంఘం, ప్రయివేట్ స్కూల్స్ అసోసియేషన్ల సమాఖ్య భారత్ బంద్ రోజున ప్రయివేట్ పాఠశాలలు మూసివేస్తామని ప్రకటించాయి. వివిధ పట్టణాల్లోని బార్ అసోసియేషన్లు కూడా సెప్టెంబర్ 27న పనిని నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి. దేశవ్యాప్తంగా ప్రతిచోటా బంద్ పిలుపును విజయవంతం చేయడానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేవలం పంజాబ్‌లో ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం 320కి పైగా ప్రదేశాలలో చక్కా జామ్ జరుగుతాయని, డజన్ల ప్రదేశాల్లో రైల్ రోకోలు జరుగుతాయని సూచిస్తున్నాయి.
సింఘూ సరిహద్దు వద్ద కబడ్డీ పోటీలు
సింఘూ సరిహద్దులో సంయుక్త కిసాన్ మోర్చా నిర్వహించిన కబడ్డీ టోర్నమెంట్ శనివారం ప్రారంభమైంది. పార్కర్ మాల్ సమీపంలోని మైదానంలో పోటీలు మరో రెండు రోజులు కొనసాగుతాయి. చండీగఢ్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు రైతుల సెగ తగిలింది. రైతులు నల్ల జెండాలతో నిరసన తెలిపారు. దాదాపు 15 మంది రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో బిజెపి ఎంపి వరుణ్ గాంధీ రైతుల నిరసనలను ఎదుర్కొన్నారు. హర్యానాలోని కురుక్షేత్రలో బీజేపీ కార్యక్రమానికి వ్యతిరేకంగా స్థానిక రైతులు నిరసనలు తెలిపారు. అసోంలోని పేద రైతులపై పోలీసుల కాల్పులను ఎస్కేఎం ఖండించింది. హర్యానాలోని కర్నాల్‌లో ఆయుష్ సిన్హా వ్యవహరించిన తీరే, అసోంలో బిజరు శంకర్ బనియా అనుసరించారని మండిపడింది. పోలీసులపై చర్యలు తీసుకోవాలని, సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరపాలని డిమాండ్ చేసింది. బాధిత కుటుంబాలకు తగిన పరిహారం అందించాలని డిమాండ్ చేసింది.