Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేటాయింపుల మేరకే నీటిని వాడుకుంటాం
- కేంద్ర జలశక్తి మంత్రికి ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి
న్యూఢిల్లీ : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు ఆపొద్దని, కరువు ప్రాంతంలో ప్రాజెక్టు పనులు కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కోరారు. ఈ మేరకు శనివారం నాడిక్కడ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను ఆయన నివాసంలో ఆయనను సీఎం కె.చంద్రశేఖర్‌రావు కలిశారు. ఆయన వెంట ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్యేలు ఎస్.రాజేందర్ రెడ్డి (నారాయణ్ పేట్), సి.లక్ష్మారెడ్డి(జడ్చర్ల), ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి(దేవరకద్ర) ఉన్నారు. సుమారు 40 నిమిషాల పాటు సాగిన ఈ సమావేశంలో ప్రధానంగా పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై విజ్ఞప్తి చేశారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ కేంద్ర జలశక్తి శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అక్టోబరు 14 నుంచి అమలులోకి రానున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టు పనులు కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలని ఈ సమావేశంలో ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రికి వివరించారు. ఈ ప్రాజెక్టు నీటిని మాకు ఇప్పుడు అనుమతి ఉన్న 299 టీఎంసిల నీటి వాటాలో భాగంగానే వాడుకుంటామని, అంతకుమించి వాడుకోబోమని అన్నారు. అలాగే ట్రిబ్యునల్ తుది అవార్డుకు కట్టుబడి ఉంటామని, కేటాయింపులకు లోబడి ఈ ప్రాజెక్టు నీటిని వాడుకుంటామని కేంద్ర మంత్రికి తెలిపారు. దానికి సంబంధించి ఏదైనా అండర్ టేకింగ్ ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇస్తామని కూడా విన్నవించారు. గోదావరి నదిపై ప్రతిపాదిత ఆరు ప్రాజెక్టుల డిపిఆర్లు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని సీఎం కేసీఆర్ నివేదించారు. సీతారామ, తుపాకులగూడెం, ఛణాక కొరాట, ముక్తేశ్వరం, చౌటుపల్లి హన్మంత రెడ్డి ఎత్తిపోతల తదితర ఆరు ప్రాజెక్టుల డిపిఆర్లు ఇప్పటికే సమర్పించినట్టు తెలిపారు. సీడబ్ల్యూసి ద్వారా ఇప్పటికే ఆమోదించిన నీటి కేటాయింపుల నుంచి ఈ ప్రాజెక్టులను చేపట్టినందున, ఈ ప్రాజెక్టుల డిపిఆర్‌లను త్వరితగతిన ఆమోదించాలని కోరారు.
జల్‌జీవన్ మిషన్ అమలుపై చర్చించాం : కేంద్ర మంత్రి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనను మర్యాద పూర్వకంగా కలిశారని జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ట్వీట్ చేశారు. అన్ని రాష్ట్రాల్లో జల్‌జీవన్ మిషన్ ప్రభావవంతంగా అమలవ్వాలని ఆకాంక్షిస్తున్నామని, తెలంగాణలో అనేక అంశాలతోపాటు ఈ అంశంపై కూడా చర్చించామని ట్వీట్లో పేర్కొన్నారు.