Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేపటి బంద్‌పై ప్రజలకు ఏఐకేఎస్ పిలుపు
- మోడీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరు
- అసోం ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి
- రైతులను చంపడమే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వాలు
న్యూఢిల్లీ : మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 27 (సోమవారం)న జరిగే భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని దేశ ప్రజలకు అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) నేతలు పిలుపు నిచ్చారు. శనివారం నాడిక్కడ ఏఐకేఎస్ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐకేఎస్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అశోక్ దావలే, హన్నన్ మొల్లా, సహాయ కార్యదర్శులు ఎన్‌కె శుక్లా, విజూకృష్ణన్, కోశాధికారి ఎన్ కృష్ణప్రసాద్ మాట్లాడారు. దేశంలోని మోడీ సర్కార్ అవలంబిస్తున్న ప్రజా, దేశ వ్యతిరేక విధానాలపై రైతులు, కార్మికులు ఉద్యమిస్తున్నారని తెలిపారు. మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని దేశంలోని రైతాంగం పోరాడుతున్నదని అన్నారు. చారిత్రాత్మక రైతు ఉద్యమం పది నెలల పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్ 27 భారత్ బంద్‌కు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పిలుపు ఇచ్చిందని అన్నారు. ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక, విద్యార్థి, యువజన, మహిళ, ఉద్యోగ సంఘాలు భారత్ బంద్‌కు మద్దతు తెలిపాయని అన్నారు. రైల్‌రోకో, రోడ్ల దిగ్బంధం జరుగుతుందని, మార్కెట్లు మూసివేత ఉంటుందని వివరించారు. ఈ సందర్భంగా చాలా ప్రాంతాల్లో మోటర్ సైకిల్ ర్యాలీలు, ప్రదర్శనలు జరుగుతాయని పేర్కొన్నారు.
అసోం ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి
అసోంలోని దరాంగ్ జిల్లా సిపాజార్లో ధోల్పూర్-గోరుఖుతి ప్రాంతంలో వేలాది మంది పేద రైతులను బలవంతంగా తరలించడానికి అసోం బీజేపీ ప్రభుత్వం వ్యవహరించిన క్రూరత్వాన్ని ఖండించారు. రైతులను కాల్చి చంపడమనేది మానవత్వంపై మచ్చ అని అన్నారు. దీనికి నైతిక బాధ్యత వహించి అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వాశర్మ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆ ప్రాంతంలో భూమి అంశంపై గౌహతి హైకోర్టులో ఒక కేసు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, ప్రజలకు ఎటువంటి నోటీసు కూడా ఇవ్వకుండానే తొలగింపు కార్యక్రమం జరిగిందని విమర్శించారు. ఈ ఘటనకు కారకులైన అధికారులను తొలగించాలని డిమాండ్ చేశారు. ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా భూమిని సాగు చేస్తున్న రైతులపై పోలీసుల చర్యను ముఖ్యమంత్రి సమర్థించారని, దానికి ఆయన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నట్టు ప్రకటించడం దారుణమన్నారు. అక్కడ ఉండే ప్రజలు బెంగాలీ ముస్లీంలని, అందరూ వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. ఎన్ఆర్సీ......ధ్రువీకరణ పత్రాలు కూడా వారి వద్ద ఉన్నాయని చెప్పారు. కానీ వారిని బంగ్లాదేశ్ ముస్లీంలుగా ప్రచారం చేస్తున్నారని ఏఐకేఎస్ నేతలు విమర్శించారు.
రైతులను చంపడమే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వాలు
రైతులను చంపడమే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఎఐకేఎస్ నేతలు విమర్శించారు. హర్యానా బీజేపీ ప్రభుత్వం సుశీల్ కాజల్ అనే రైతును దారుణంగా చంపిన తరువాత, ఇప్పుడు అసోంలోని బీజేపీ ప్రభుత్వం ఇద్దరు రైతులను కాల్చిచంపిందని విమర్శించారు. రైతులపై బీజేపీ ప్రభుత్వాలు అనుసరిస్తున్న మొండి వైఖరికి ఇవే ఉదాహరణలని అన్నారు. మరణించిన రైతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.