Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చదువుకు తగ్గ ఉద్యోగం వారికే
- ఐఎల్వో నివేదిక
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా కార్మికుల్లో సగం మందికే వారు చదువుకు తగిన ఉద్యోగాలను కలిగి ఉన్నారు. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ఓ) తన నివేదికలో పేర్కొన్నది. అలాగే, ఇందులో పలు ఆసక్తికర అంశాలను పేర్కొన్నది. లేబర్ ఫోర్స్ సర్వే సహకారంతో ఈ నివేదికను తయారుచేసింది. దాదాపు 130కి పైగా దేశాల్లో ఉద్యోగస్థుల విద్యార్హతలు, వృత్తులను నివేదికలో పొందుపరిచారు.
ఈ నివేదిక ప్రకారం.. ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్నవారిలో చాలా మంది వారి చదువుకు తగిన కొలువులో లేరు. మరోపక్క, తమ వ్యాపారాన్ని విజయవంతంగా విస్తృతం చేయడంలో భాగంగా నైపుణ్యం కలిగినవారు దొరకడం కష్టతరమైందని అనేక మంది యజమానులు చెబుతున్నారు. కాగా, తమ విద్యార్హతకు తగిన ఉపాధిని పొందనివారిలో ఉన్నత విద్యార్హతలు, కనిష్ట విద్యార్హతలు కలిగినవారున్నారు. అధిక ఆదాయం కలిగిన దేశాల్లో కార్మికులు వారి చదువుకు తగిన కొలువుల్లో ఉన్నారు. ఈ దేశాల్లో దాదాపు 60 శాతం మంది ఉద్యోగాలను కలిగి ఉన్నారు. ఎగువ మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి దేశాల్లో వరుసగా.. 52 శాతం, 43 శాతం మంది ఉద్యోగులుగా ఉన్నారు. ఇక తక్కువ ఆదాయం కలిగిన దేశాల్లో ప్రతి నలుగురిలో ఒకరు మాత్రం విద్యార్హతకు తగిన ఉద్యోగాన్ని కలిగి ఉన్నారు. లేబర్ మార్కెట్లు, ప్రపంచీకరణ, కార్మిక వలసలు, సాంకేతిక మార్పులు, డెమోగ్రాఫిక్ షిఫ్ట్స్.. ఇలా వీటిలో వచ్చిన వేగమైన మార్పులు ప్రభావాన్ని చూపాయి. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విద్యార్హతలు, నైపుణ్యాలు సరితూగకపోవడమన్నది అక్కడి విధానకర్తలకు ఆందోళనకరంగా మారింది.
అధిక, మధ్య ఆదాయ దేశాల్లో దాదాపు 20 శాతం మంది ఉద్యోగులు అధిక విద్యార్హతను కలిగి ఉన్నారు. తక్కువ మధ్య ఆదాయ దేశాల్లో ఇది 12.5 శాతంగా ఉన్నది. తక్కువ ఆదాయ దేశాల్లో ఇది పది శాతం కంటే తక్కువగా ఉన్నది. ఇక తక్కువ ఆదాయం కలిగిన దేశాల్లో అత్యధికంగా 70 శాతం మంది ఉద్యోగులు వారి ఉద్యోగాలకు తగిన విద్యార్హత కంటే తక్కువ చదువును కలిగి ఉన్నారు. ఇది తక్కువ మధ్య తరగతి ఆదాయం కలిగిన దేశాల్లో ఇది 46 శాతంగా, మధ్య ఆదాయ దేశాల్లో, అధిక ఆదాయం కలిగిన దేశాల్లో ఇది 20 శాతంగా ఉండటం గమనార్హం. ఇక అధిక ఆదాయం కలిగిన దేశాల్లో పురుషులతో పోల్చుకుంటే మహిళలు అధిక విద్యార్హతను కలిగి ఉన్నారు. తక్కువ ఆదాయం కలిగిన దేశాల్లో ఇది విరుద్ధంగా ఉండటం గమనార్హం.