Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీ పోరాటానికి మా మద్దతుంటుంది
- సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ
న్యూఢిల్లీ : న్యాయ వ్యవస్థలో 50 శాతం రిజర్వేషన్లు మహిళల హక్కు అని, ఈ హక్కును పోరాడి సాధించుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. 'వేల సంవత్సరాల అణచివేత ఇక చాలు. న్యాయ వ్యవస్థలోని అన్ని స్థాయిల్లోనూ మహిళలకు 50 రిజర్వేషన్లు కల్పించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇది మీ హక్కు. ఇదేదో దాతృత్వానికి సంబంధించిన అంశం కాదు. కోపంతో అరవాలి. 50 శాతం రిజర్వేషన్లు అవసరమని అరవాలి. మీరు ఈ దిశగా జరిపే పోరాటానికి మా మద్దతు ఉంటుంది' అని జస్టిస్ రమణ ఉద్ఘాటించారు. ఆదివారం నాడిక్కడ సుప్రీం కోర్టు బార్ కౌన్సిల్‌లోని మహిళా న్యాయవాదులు సీజేఐ జస్టిస్ ఎన్వి రమణతో సహా నూతనంగా నియమితులైన తొమ్మిది మంది న్యాయమూర్తులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సభలో జస్టిస్ ఎన్వి రమణ మాట్లాడుతూ కింది కోర్టుల్లో మహిళలు కేవలం 30 శాతం మాత్రమే ఉన్నారని, హైకోర్టుల్లో 11.5 శాతం, సుప్రీంకోర్టులో 12 శాతం మహిళలున్నారని, దేశంలో 17 లక్షల మంది న్యాయవాదులుండగా వారిలో 15 శాతం మాత్రమే మహిళలున్నారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. బార్ కౌన్సిళ్లలో ఎన్నికైన ప్రతినిధుల్లోనూ కేవలం 2 శాతం మాత్రమే మహిళలున్నారని తెలిపారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో మహిళ ప్రాతినిధ్యం లేదనీ, దీన్ని సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. అవసరమైన దిద్దుబాట్ల గురించి కార్యనిర్వాహక వ్యవస్థపై ఒత్తిడి తీసుకొస్తామని ఆయన తెలిపారు. న్యాయవాద వృత్తిలోకి రావడానికి మహిళలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. కుటుంబ అడ్డంకులు, లింగ వివక్ష ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు వేల ట్రయల్ కోర్టుల్లో 22 శాతం కోర్టుల్లో మహిళలకు మరుగుదొడ్లు లేవని తమ సర్వేలో తేలిందన్నారు. మహిళలకు న్యాయవ్యవస్థలోకి స్వాగతం పలికే సరైన వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.
న్యాయ విద్యలో ప్రవేశించేదిశగా మహిళలకు ప్రోత్సాహం ఇవ్వాలన్నారు. తొలి చర్యగా న్యాయ కళాశాలు, విశ్వవిద్యాలయాల్లో మహిళలకు తగినంతగా రిజర్వేషన్లు కల్పించాలన్నారు. అప్పుడే మహిళ న్యాయమూర్తులు, న్యాయవాదులు గణనీయంగా పెరుగుతారని, అన్ని రంగాల్లోకి మహిళలు వచ్చేలా స్ఫూర్తి నివ్వాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
దసరా తరువాత ప్రత్యక్ష విచారణ
న్యాయస్థానాల్లో ప్రత్యక్ష విచారణ వల్ల న్యాయమూర్తులకు ఎలాంటి ఇబ్బంది లేదని, న్యాయవాదులకే ఒకింత ఇబ్బంది కలుగుతుందని ఆయన అన్నారు. దసరా తరువాత ప్రత్యక్ష విచారణ ప్రారంభించాలని భావిస్తున్నట్టు తెలిపారు. కోవిడ్ థర్డ్‌వేవ్ రాకూడదని కోరుకుందామని, ప్రత్యక్ష విచారణకు సంబంధించిన ప్రామాణిక నిర్వహణా నియమావళి పట్ల న్యాయవాదుల సంఘం కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసిందని, వాటిని సరిచేయాలని రిజిస్ట్రీని ఆదేశించినట్లు తెలిపారు.