Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మధ్యప్రదేశ్‌లో విహెచ్పి కార్యకర్తల బెదిరింపులు
- రక్షణ కల్పించాలని రాష్ట్రపతికి బిషప్ లేఖ
న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్‌లో క్రిస్టియన్లు, చర్చిలకు రక్షణ, భద్రత కల్పించాలని కోరుతూ పాల్ మునియా అనే బిషప్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు తాజాగా ఒక లేఖ రాశారు. రాష్ట్రంలోని జబువా జిల్లాలోని చర్చిలన్నింటినీ కూల్చివేస్తామని విశ్వహిందూ పరిషత్ (విహెచ్పి)కి చెందిన కార్యకర్తలుగా చెబుతున్న కొంతమంది బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న క్రిస్టియన్ వ్యతిరేక హింసను తక్షణం ఆపేందుకు తక్షణం కలుగజేసు కోవాలని ఆయన రాష్ట్రపతిని కోరారు. బిషప్ ఈ లేఖను రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, గవర్నర్ మంగూభారు సి.పటేల్‌కు కూడా పంపించారు. కాగా, విహెచ్పి సభ్యుల బెదిరింపులపై వివరణ అడిగేందుకు ఆ సంస్థకు చెందిన ప్రవీణ్ తొగిడియాను సంప్రదించగా, అందుబాటులోకి రాలేదని మీడియా సంస్థ ది వైర్ పేర్కొంది. జబువా సబ్‌డివిజనల్ మేజిస్ట్రేట్ ఎల్ఎన్.గార్గ్ వైర్‌తో మాట్లాడుతూ విహెచ్ కార్యకర్తలు, మరికొంత మంది ఈనెల మొదట్లో తమవద్దకు వచ్చి చర్చిల్లో కన్వర్షన్ రాకెట్ (మతమార్పిడులు) నడుపుతున్నారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారని తెలిపారు. బలవంతపు మతమార్పిడిలు ఏమైనా జరిగినట్లు తేలితే తగిన చర్యలు తీసుకుంటామని వారికి చెప్పామని, అయితే ఫిర్యాదు అనంతరం జరిపిన విచారణలో అటువంటి దాన్ని ఇప్పటి వరకు గుర్తించలేదని చెప్పారు. ఈనెల మొదట్లో కొంతమంది జిల్లాలోని పలు చర్చిలకు వెళ్లారు. చర్చిలుగా నడుస్తున్న అన్ని అక్రమ నిర్మాణాలను తాము కూల్చివేస్తామని అక్కడ ఉన్న వారికి బెదిరించారు. అదేవిధంగా హిందువులను క్రైస్టవ మతంలోకి బలవంతం మారుస్తున్నారని స్థానిక మతగురువులపై ఆరోపణలు చేశారు. జబువా జిల్లాలోని ఆదివాసులను బజరంగ్దళ్, విహెచ్పి వంటి హిందూత్వ సంస్థలు లక్ష్యంగా చేసుకున్నాయని, బెదిరింపుల నేపథ్యంలో వారంతా భయాందోళనల్లో బతకాల్సి వస్తోందని మునియా తన లేఖలో పేర్కొన్నారు. అక్రమ నిర్మాణాలు ఏమైనా ఉంటే అధికారులు చర్యలు తీసుకుంటారు కదా..ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు ఇలా ఎలా బెదిరింపులకు పాల్పడుతారని అన్నారు.