Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒడిశా, ఆంధ్ర రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
- నిలిచిన రైళ్లు.. అప్రమత్తమైన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు
- ప్రభావిత రాష్ట్రాలకు సాయం అందిస్తాం: ప్రధాని మోడీ
- శ్రీకాకుళంలో ఐదుగురు మత్స్యకార్ల గల్లంతు
న్యూఢిల్లీ: వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ కేంద్ర బంగాళాఖాతం చుట్టూ తుఫాను 'గులాబ్' ఆదివారం ఉదయం కేంద్రీకృతమై ఉంది. వాయువ్య, పశ్చిమ బంగాళాఖాతంలో 270 కిలోమీటర్లు, తూర్పు ఆగేయంలో గోపాల్పూర్-కళింగపట్నానికి తూర్పున 330 కిలో మీటర్ల దూరంలో ఇది కొనసాగింది. అయితే, ప్రమాదకర స్థాయిలో గులాబ్ తుఫాను తీరంవైపు దూసుకువస్తుండటంతో కేంద్రంతో పాటు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. 'గులాబ్' తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ క్రమంలో తొలుత ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండీ.. దాన్ని ఆదివారం రెడ్ అలర్ట్‌గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఆదివారం సాయంత్రం లేదా రాత్రి సమయానికి ఈ రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ప్రారంభమవుతాయని వాతావరణ శాఖ సీనియర్ సైంటిస్టు ఆర్కే జెనమణి వివరించారు. ఈ తుఫాను పశ్చిమం వైపుగా ప్రయాణిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌లోని కళింగపట్నం, ఒడిశాలోని గోపాల్పూర్ మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గులాబ్ తుఫాను ప్రభావం ఏపీ, ఒడిశాలతో పాటు తెలంగాణ, బెంగాల్, ఛత్తీస్‌గఢ్, విదర్భ ప్రాంతాలపై కూడా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అదేవిధంగా తుఫాను ప్రభావం కారణంగా పలు రాష్ట్రాలు ముందస్తు చర్యలను ప్రారంభించాయి. ఇప్పటికే కురుస్తున్న వర్షంతో ఏపీ, ఒడిశాలలో రవాణా వ్యవస్థ స్థంభించింది. పలు రైళ్లు సైతం నిలిచిపోయియి. ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే భూవనేశ్వర్-తిరుపతి, పూరి-చెన్నై సెంట్రల్, హెచ్ఎస్ నాందేడ్-సంబల్పూర్, రాయగఢ్-గుంటూరు మధ్య రైళ్లను రద్దు చేసింది. అలాగే, మరికొన్ని రైళ్లను దారిమళ్లించింది.
అప్రమత్తమైన ఒడిశా సర్కారు..
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన ఒడిశా ప్రభుత్వం.. రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లోని పలు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు ప్రక్రియను ప్రారంభించింది. ఒడిశా రాపిడ్ యాక్షన్ ఫోర్స్ 42 బృందాలతో పాటు ఎన్డీఆర్ఎఫ్ 24 బృందాలు, అగ్నిమాపక బృందాలు రక్షణ చర్యల్లో పాల్గొంటున్నాయి. రాబోయే మూడు రోజులు పరిస్థితులు కఠినంగా మారే అవకాశముందనీ, ఒడిశా, బెంగాల్, ఏపీ మత్స్యకారులు బంగాళఖాతంలోకి వెళ్లవద్దని ప్రత్యేక సహాయ కమిషనర్ పి.జెనా సూచించారు.
పలాస-టెక్కిలి మధ్య తీరందాటే అవకాశం
గులాబ్ తుఫాను ప్రభావం ఏపీలో ఇప్పటికే మొదలైంది. ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. తీవ్ర ప్రాంతాల్లో సముద్రం అలజడి మొదలైంది. పలాస- టెక్కిలి నియోజకవర్గాల మధ్య తీరం దాటే అవకాశముండటంతో ఆయా ప్రాంతాల్లో చర్యలు ముమ్మరం చేసినట్టు ప్రభుత్వం పేర్కొంది. ప్రజలెవ్వరు బయటకు రావొద్దని సూచించింది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలోని లోతట్టు ప్రాంతాల నుంచి దాదాపు 86 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నంలో ఉన్నామని అధికారులు చెబుతున్నారు. శ్రీకాకుళంలో ఐదుగురు మత్స్యకారులు గల్లంతయ్యారని తెలిపారు.
బెంగాల్లోనూ..
ఇప్పటికే ఈ వారం ప్రారంభంలో కురిసిన భారీ వర్షాలకు అతాలకుతలమైన బెంగాల్‌కు గులాబ్ తుఫాను ప్రభావం మరింత ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర రాజధాని కోల్‌కతా సహా దాని పరిసర ప్రాంతాలు ఇప్పటికే నీటిలోనే ఉన్నాయి. అయితే, గులాబ్ తుఫాను ఈ నెల 29న బెంగాల్ తీరాన్ని తాకే అవకాశముందని ఐఎండీ అంచనావేసింది.
సీఎం జగన్‌తో మాట్లాడిన ప్రధాని మోడీ
ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ప్రధాని మోడీ ఆరా తీశారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నానని మోడీ ట్వీట్ చేశారు. ''ఎపీ సీఎం జగన్‌తో మాట్లాడాను. గులాబ్ తుఫాను ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నాను. కేంద్రం నుంచి సాధ్యమైనంత వరకు అన్నివిధాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చాను'' అంటూ మోడీ ట్వీట్ చేశారు. అలాగే, అందరి శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నానంటూ తెలిపారు.