Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర హోంమంత్రి అమిత్ షా
న్యూఢిల్లీ : దేశంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అభివృ ద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మావోయిస్టులను అణిచివేసేందుకు కేంద్రం, రాష్ట్రాల సంయుక్త కృషి కారణంగా చాలా విజయాలు సాధించామన్నారు. ఆదివారం నాడిక్కడ విజ్ఞాన్ భవన్లో పది మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. దేశవ్యాప్తంగా మావోయిస్టు సంఘటనలు 23 శాతం తగ్గాయని, మరణాల సంఖ్య 21 శాతం తగ్గిందని చెప్పారు. దశాబ్దాల పోరాటంలో మొదటిసారిగా మరణాల సంఖ్య 200 కంటే తక్కువగా ఉండే స్థితికి చేరుకున్నామని, ఇది గొప్ప విజయమని తెలిపారు. ఆయుధాలను విడిచిపెట్టి, హింసను వదిలి జనజీవన స్రవంతిలో చేరాలనుకునే వారికి స్వాగతం పలుకుతామని, అయితే ఆయుధాలు తీసుకొని అమాయక ప్రజలను, పోలీసులను గాయపరిచిన వారికి కూడా అదేస్థాయిలో స్పందన లభిస్తుందని ఆయన హెచ్చరించారు. నక్సలిజాన్ని ఎదుర్కోవడానికి బాధిత రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు కనీసం మూడు నెలలకోసారి డిజిపిలు, కేంద్ర సంస్థల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించాలని సూచించారు. అప్పుడే మనం ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లగలమని రాష్ట్రాలను కోరారు. గత రెండేండ్లలో ముఖ్యంగా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశాలో భద్రత కఠినంగా లేని ప్రాంతాల్లో భద్రతా శిబిరాలను పెంచడానికి ప్రయత్నించామని తెలిపారు. ఇటీవల ఈశాన్య ప్రాంతాలలో అనేక తీవ్రవాద గ్రూపులు లొంగిపోయాయని, బోడోలాండ్, బ్రూ, కర్బీ ఆంగ్లాంగ్ ఒప్పందాలు, త్రిపురలోని తిరుగుబాటు కార్యకర్తలు లొంగిపోవడం వంటివాటితో దాదాపు 16 వేల మంది కార్యకర్తలు సమాజంలోని ప్రధాన స్రవంతిలో చేరారని తెలిపారు. ఈ సమావేశంలో తెలంగాణ, మహారాష్ట్ర, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె చంద్రశేఖర్ రావు, ఉద్దవ్ ఠాక్రే, నితీశ్ కుమార్, నవీన్ పట్నాయక్, శివరాజ్ సింగ్ చౌహాన్, హేమంత్ సోరెన్, ఏపి హోంమంత్రి మేకతోటి సుచరిత, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, కేరళ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.