Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరు రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు
- ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు
- అన్ని వర్గాల నుంచి సంపూర్ణ అండదండలు
- అత్యవసర సేవలు మినహాయింపు
- శాంతియుతంగా జరపాలని ఎస్కేఎం విజ్ఞప్తి
న్యూఢిల్లీ : మోడీ సర్కార్ అప్రజాస్వామ్యకంగా, బలవంతంగా ఆమోదించుకున్న మూడు రైతు వ్యతిరేక చట్టాలు గతేడాది సెప్టెంబర్ 27న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోద ముద్రతో అమలులోకి తెచ్చారు. ఈ సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నేడు (సోమవారం) దేశవ్యాప్తంగా ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు భారత్ బంద్ జరుగుతుంది. అత్యవసర సేవలు మినహా దేశవ్యాప్తంగా జనజీవనం నిలిపివేయబడేలా కార్మిక సంఘాలతో సహా వారి అనుబంద సంఘాలతో పాటు రైతు సంఘాలు స్పష్టమైన ప్రణాళికలు రూపొందించాయి. ఇప్పటికే ఎస్కేఎం భారత్ బంద్‌కు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. భారత్ బంద్ పూర్తిగా శాంతియుతంగా నిర్వహించాలని పిలుపునిచ్చింది. బంద్‌లో పాల్గొనాలని భారతీయులందరికీ ఎస్‌కెఎం విజ్ఞప్తి చేసింది.
ఆరు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మద్దతు
భారత్ బంద్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ ప్రభుత్వం మద్దతును ప్రకటించింది. 26 రాత్రి నుండి 27 మధ్యాహ్నం వరకు బస్సులను నిలిపివేసింది. కేరళలో అధికార ఎల్డిఎఫ్ బంద్‌కు మద్దతుగా హర్తాళ్‌కు పిలుపు ఇచ్చింది. పంజాబ్ కొత్త ముఖ్యమంత్రి తన మద్దతును ప్రకటించారు. జార్ఖండ్‌లో జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్, ఆర్జెడి ప్రభుత్వం భారత్ బంద్ విజయవంతం చేయాలని పిలుపు ఇచ్చింది. తమిళనాడులో అధికార డిఎంకె, ఢిల్లీలోని అధికారం ఆమ్ ఆద్మీ పార్టీ భారత్ బంద్‌కు మద్దతు ఇచ్చాయి.
రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు మద్దతు
సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐఎంఎల్ (లిబరేషన్), సీపీఐఎంఎల్ (ఎన్డి), ఎస్‌యుసిఐ (సి), ఫార్వర్డ్ బ్లాక్, ఆర్ఎస్పి, ఎంసీపీఐ, ఎంసీపీఐ(యు), ఆర్ఎంపిఐ వంటి వామపక్ష పార్టీలతో పాటు కాంగ్రెస్, ఆప్, టీడీపీ, వైసిపి, డిఎంకె, ఎస్పి, జెడిఎస్, బిఎస్పి, ఎన్‌సిపి, జెఎంఎం, ఆర్జెడి, ఎస్ఎడి, స్వరాజ్ ఇండియా తదితర రాజకీయపార్టీలు భారత్ బంద్‌కు పిలుపు ఇచ్చాయి. అలాగే సిఐటియు, ఎఐటియుసి, ఐఎన్టియుసి, హెచ్ఎంఎస్ వంటి పది కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు భారత్ బంద్‌కు మద్దతు తెలిపాయి. బంద్‌కు మద్దతుగా జంతర్ మంతర్‌లో కేంద్ర కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టనున్నాయి. ఆల్ బార్ లాయర్స్ యూనియన్స్, అనేక బార్ అసోసియేషన్లు, స్థానిక యూనిట్లు తమ మద్దతును అందించాయి. ఆలిండియా లాయర్స్ యూనియన్ కూడా భారత్ బంద్‌కు మద్దతు తెలిపింది. విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు, బ్యాకింగ్ రంగ ఉద్యోగ సంఘాలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు, సామాజిక సంఘాలు, వర్తక సంఘాలతో పాటు దేశంలోని అన్ని వర్గాల ప్రజల నుంచి భారత్ బంద్‌కు సంపూర్ణ మద్దతు లభించింది. భారత్ బంద్‌కు మద్దతుగా గుర్గావ్, పాల్వాల్‌ల్లో దివిటిలతో ప్రదర్శన చేపట్టారు. జైపూర్‌లో ఊరేగింపులు నిర్వహించారు. కర్ణాటకలోని మైసూరులో బైక్ ర్యాలీ నిర్వహించారు. పాట్నాలో ఊరేగింపు నిర్వహించారు.