Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బంద్‌కు మద్దతు పలికిన కార్మికసంఘాలు
- రైతు సగటు నెల ఆదాయం రూ.3221 : ఎన్ఎస్ఎస్ తాజా నివేదిక
- జాతీయ సగటుకు దిగువన 16 రాష్ట్రాలు
- పంట ఉత్పత్తిపై ఆదాయం లేక కూలి పనితో బతుకుతున్న రైతు కుటుంబాలు
వ్యవసాయరంగంలోకి కార్పొరేట్లకు ప్రవేశం కల్పిస్తూ మోడీ సర్కార్ చేసిన నూతన సాగు చట్టాల్ని రైతులంతా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు. దీనిపై గత 10 నెలలుగా రైతాంగ ప్రతిఘటన నేడు ఉధృతరూపం దాల్చింది. దాదాపు 400కుపైగా రైతు సంఘాలు, 10కిపైగా కార్మిక సంఘాలు 'భారత్ బంద్' చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో కేంద్రం నుంచి ఒక కీలక సర్వే బయటకు వచ్చింది. పంట ఉత్పత్తిపై ఒక రైతు కుటుంబం సగటు నెల ఆదాయం రూ.3221 ఉందని (జాతీయ గణాంక కార్యాలయం) ఆ సర్వే స్పష్టం చేసింది. 16 రాష్ట్రాల్లో రైతు సగటు నెల ఆదాయం జాతీయ సగటు కన్నా తక్కువగా ఉంది. పరిస్థితి ఓ వైపు ఇలా ఉంటే..రైతుల వైపు నుంచి కాకుండా..ప్రయివేటు వ్యాపారులు, కార్పొరేట్లకు అనుకూలమైన చట్టాలు చేయటమేంటని అందరూ ప్రశ్నిస్తున్నారు.
న్యూఢిల్లీ : దేశంలో రైతుల ఆదాయం, వారి కుటుంబాల పరిస్థితి పాలకులకు తెలియనిది కాదు. దాదాపు 70శాతం మంది రైతులకు సాగు భూమి ఒక హెక్టారు (సుమారుగా 2.47 ఎకరా) లోపే ఉందని, 83శాతం మంది చిన్న, సన్నకారు రైతులే ఉన్నారని అనేక అధ్యయనాలు తేల్చాయి. వ్యవసాయరంగంలో ప్రధాన సమస్యలకు స్వామినాథన్ కమిషన్ సిఫారసుల అమలు పరిష్కారం చూపుతుందని కోట్లాది కుటుంబాలు భావిస్తున్నాయి. కమిషన్ సిఫారసులు అమలుజేస్తామని 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ ప్రజలకు వాగ్దానం కూడా చేసింది. తీరా అధికారంలోకి వచ్చాక ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ వ్యవసాయరంగాన్ని కార్పొరేట్ల చేతుల్లో పెట్టే పనికి శ్రీకారం చుట్టింది. కనీస మద్దతు ధర, మార్కెట్ యార్డుల మనుగడ అంతా కనుమరుగు అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో నూతన సాగు చట్టాల రద్దును కోరుతూ 10 నెలలుగా రైతు ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. ఇలాంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన 'జాతీయ గణాంక కార్యాలయం' నుంచి ఇటీవల ఒక 'ఎన్ఎస్ఎస్ఓ' నివేదిక విడుదలైంది. ఈ సర్వేను 2018-19 మధ్యకాలంలో చేపట్టారు. దీని ప్రకారం, వివిధ రాష్ట్రాల్లో పంట ఉత్పత్తిపై రైతుకు వచ్చే ఆదాయం నామమాత్రమని అంకెలు చెబుతున్నాయి. కుటుంబ అవసరాల్ని తీర్చుకోవడానికి రైతుకూలీగా మారాల్సి వచ్చిందనేది ఇక్కడ స్పష్టమవుతోంది.పంట ఉత్పత్తిపై ప్రతి రైతుకు వస్తున్న సగటు నెల ఆదాయం (జాతీయ సగటు) రూ.3221. జాతీయ సగటు కన్నా తక్కువ ఆదాయం 16 రాష్ట్రాల్లో నమోదైంది. తెలంగాణలో రైతు సగటు నెల ఆదాయం రూ.4289కాగా, ఆంధ్రప్రదేశ్‌లో రూ.2262గా ఉంది. అత్యల్పంగా జార్ఖాండ్‌లో రూ.682, అత్యధికంగా పంజాబ్‌లో రూ.15047 ఉందని సర్వేలో చూపారు.
స్వామినాథన్ సిఫారసులు ఏమయ్యాయి?
జార్ఖాండ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్, జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, బీహార్, అసోం, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్..రాష్ట్రాల్లో రైతుల సగటు నెల ఆదాయం(పంట ఉత్పత్తిపై) జాతీయ సగటు కన్నా తక్కువగా ఉంది. అందుకే దేశవ్యాప్తంగా రైతులు కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ కావాలని డిమాండ్ చేస్తున్నారు. పండించిన పంట మార్కెట్‌కు వస్తే కొనేనాథుడు లేక, ప్రభుత్వం ముందుకు రాక మార్కెట్ దళారుల ఆటకు రైతులు బలవుతున్నారు. ఈ సమస్య పరిష్కరించాలని రైతులు పాలకుల్ని కోరుతున్నారు. ఎం.ఎస్.స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలుజేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కూలి పనులే దిక్కు !
పంట ఉత్పత్తిపై ఆదాయం లేక రైతు వేరే మార్గాల్ని వెతుక్కుంటున్నాడని 'నేషనల్ సాంపిల్ సర్వే' గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం ఆదాయంలో పంట ఉత్పత్తి ద్వారా సమకూరేది కేవలం 37శాతమే ఉంది. 48శాతం ఆదాయం వ్యవసాయ కూలీగా పనిచేస్తే వస్తోంది. ఇతర రైతుల పొలాల్లో పనులకు వెళ్లటం ద్వారా ఈ ఆదాయం వస్తోంది. పశువుల పెంపకం ద్వారా 5శాతం ఆదాయం సమకూరుతోంది. వ్యవసాయేతర పనుల ద్వారా ఎలాంటి ఆదాయం లేదని ఇక్కడ స్పష్టంగా కనపడుతోంది. దీనిని బట్టి..పంట ఉత్పత్తి, వ్యవసాయ అనుబంధ పనులే రైతు కుటుంబానికి ప్రధాన ఆదాయ వనరు అని, జీవనాధారమని తేలిపోయింది.
లోతైన పరిశీలన లేదు : నిపుణులు
రైతు రుణాలు, సగటు రైతుకు ఎంత వ్యవసాయ భూమి ఉంది?ఎన్ఎస్ఎస్ సరైన గణాంకాలు నమోదు చేయలేదని నిపుణులు విమర్శిస్తున్నారు. ధనిక రైతులు ఎక్కువగా ఉన్న పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి ఎక్కువ సంఖ్యలో గణాంకాలు తీసుకొని సర్వే తయారుచేశారని, ఇందులో వాస్తవ పరిస్థితి పూర్తిగా బయటకురాలేదనే వారు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో 93శాతం మంది, తెలంగాణలో 92శాతం, కర్నాటకలో 68శాతం, తమిళనాడులో 65శాతం రైతులు రుణాలు తీసుకున్నారని, రైతు రుణ సంక్షోభం కొన్ని రాష్ట్రాలకే పరిమితమని సర్వేలో చూపే ప్రయత్నం చేశారని నిపుణులు చెప్పారు.