Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాధితులకు న్యాయం చేయాలంటూ.. మద్దతు ప్రకటిస్తూ పలు చోట్ల నిరసనలు
గువహతి: అసోంలో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల ధోల్పూర్లో అక్రమంగా నిర్మించుకున్నారంటూ పలు ఇండ్లను ఖాళీ చేయిస్తోంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే రెండు గ్రామాల్లోని దాదాపు వేయి వరకు ఇండ్లు ఖాళీ చేయించడంతో వివాదం మొదలైంది. మళ్లీ ప్రభుత్వం ఇదే తరహా చర్యలకు దిగడంతో బాధితులు ఆందోళనకు దిగడంతో.. పోలీసులు వారిపై లాఠీలతో విరుచుకుపడ్డారు. కాల్పులు సైతం జరపడంతో ఇద్దరు మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. తీవ్ర ఘర్షణ నెలకొంది. గురువారం జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే బాధితులకు సంఘీభావం ప్రకటిస్తూ.. దేశంలోని పలుచోట్ల ర్యాలీలు, ఆందోళనలు నిర్వహించారు. ఈ సంఘీభావ ర్యాలీలు అసోంలోనే కాకుండా ఢిల్లీ, అలీగఢ్, కోల్‌కతా సహా పలు ప్రాంతాల్లో నిర్వహించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)కు చెందిన ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోషియేషన్ సభ్యులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. వర్గీకృత బహిష్కరణను నిలిపివేయాలనీ, డారంగ్ పోలీసు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సుశాంత బిశ్వశర్మను తొలగించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు. అలాగే, అసోంలో ముస్లింలపై తక్షణమే దాడులను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ అలీఘర్ ముస్లిం యూనివర్సీటీ (ఏఎంయూ) విద్యార్థులు నిరసన తెలిపారు. బలవంతంగా వారిని అక్కడి నుంచి తొలగించడం అమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. యూనీవర్సీటీ క్యాంపస్‌లో ర్యాలీ నిర్వహించడంతో పాటు నగర మేజిస్ట్రేట్‌కు దీనికి సంబంధించి ఓ మెమోరాండం అందజేశారు.
దరాంగ్‌లో ఇండ్లను ఖాళీ చేయించిన ఘటన పరిస్థితులను తెలుసుకోవడానికి అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) ఓ ప్రతినిధి బృందాన్ని అసోంకు పంపాలని నిర్ణయించింది. బాధిత కుటుంబాలకు తన మద్దతును ప్రకటిస్తూ.. సంఘీభావం తెలిపింది. సీపీఎల్-ఎంఎల్ సైతం కోల్‌కతాలో నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. అసోంలో ముస్లింలను చంపడం ఆపండి అంటూ డిమాండ్ చేస్తున్న ప్లకార్డులను ప్రదర్శించింది. నిస్సహాయిలుగా తమ ఇండ్లను కాపాడుకోవడాని ప్రయత్నిస్తున్న వారిపై పోలీసులు చట్టాన్ని ఉల్లంఘిస్తూ వారిపై లాఠీలతో విరుచుకుపడుతూ.. కాల్పులకు తెగబడ్డారని ఆరోపించింది.